అక్రమాలు అడ్డుకుంటే తొక్కించేస్తారా?

రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలపై అన్నదాతలు మండిపడ్డారు. సోమవారం ఉదయం, అర్ధరాత్రి మందడం గ్రామ పరిధిలో టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద భారీగా మట్టి తరలించారని వివరించారు.

Updated : 31 May 2023 05:34 IST

మందడంలో మట్టి తవ్వకాలపై రైతుల ఆగ్రహం  
వానలో తడుస్తూ నిరసన

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధానిలో అక్రమ మట్టి తవ్వకాలపై అన్నదాతలు మండిపడ్డారు. సోమవారం ఉదయం, అర్ధరాత్రి మందడం గ్రామ పరిధిలో టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద భారీగా మట్టి తరలించారని వివరించారు. సదరు మట్టి దొంగలను 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం మందడం శిబిరం ఎదుట రోడ్డుపై ఉదయం పదింటినుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బైఠాయించారు. అమరావతి ఐకాస ఆధ్వరంలో వానలోనూ ఈ నిరసన కొనసాగింది. మందడం పరిధిలో రాజధాని రైతులకిచ్చిన ప్లాట్లలో ఐదు అడుగుల లోతులో, మూడెకరాల విస్తీర్ణంలో కొందరు కొద్ది రోజులుగా మట్టి తవ్వుతున్నారు. దీన్ని గమనించిన ఒక రైతు సోమవారం ఉదయం మట్టి తవ్వకాలపై డ్రైవర్లను ప్రశ్నించడంతో వారు పరారయ్యారు. దీనిపై మంగళవారం నిరసన తెలపాలని రాజధాని రైతులు నిర్ణయించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మళ్లీ అదే ప్రాంతంలో మట్టి తవ్వుతున్నారని గమనించి తొలుత ఆ ప్రాంతానికి వెళ్లిన రైతు కట్టా మురళి అక్రమార్కులను ప్రశ్నించారు. ఆయన్ని ముళ్లకంపలోకి నెట్టేయడంతో గాయాలయ్యాయి.

విషయం తెలిసి రైతులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని జేసీబీలకు అడ్డంగా తమ ద్విచక్రవాహనాలను పెట్టారు. కొందరు వైకాపా నాయకులు తొక్కించుకుంటూ వెళ్లండంటూ డ్రైవర్లకు సూచనలిస్తూ భయపెడుతున్నారని రైతులు తెలిపారు. ఉండవల్లికి చెందిన ఒక వ్యక్తి పొలంలోకి, మరికొన్ని నిర్మాణాలకు ఈ మట్టిని తరలిస్తున్నారన్నారు. నిరసన తెలుపుతూ రైతుల బైఠాయింపుతో భారీగా వాహనాలు నిలిచాయి. పోలీసులు వచ్చి అమరావతి సమన్వయ సమితి సభ్యులతో మాట్లాడారు. మట్టి తవ్వకాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రైతులు పోలీసులకు సమర్పించారు. తగిన చర్యలు తీసుకుంటామని సీఐ ఆనందరావు హామీనిచ్చారు. మట్టి తవ్వుతున్నది ఎంపీ నందిగం సురేష్‌ అనుచరులేనని మందడం గ్రామానికి చెందిన మహిళా రైతు వరలక్ష్మి ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి ఉద్యమిస్తున్న రైతులపై కేసులు పెడుతున్న పోలీసులు.. మట్టి దొంగలను ఎందుకు పట్టుకోవడం లేదని న్యాయవాది రజని, ఐకాస నాయకులు పువ్వాడ సుధాకర్‌, చిలకా బసవయ్య ప్రశ్నించారు.ఈ ఘటనలో లారీడ్రైవర్లు, యజమానులైన సురేష్‌, రమేష్‌, మణికంఠ, రోహిత్‌ పటేల్‌లను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని