ఏపీ హెచ్‌ఆర్‌సీలో టైపిస్టూ లేరు!

కర్నూలులోని ఏపీ మానవ హక్కుల కమిషన్‌ (ఏపీహెచ్‌ఆర్‌సీ) సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. విచారణలు పూర్తయి తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు వాయిదా పడిన కేసుల్లో డిక్టేషన్‌ తీసుకునేందుకు టైపిస్టు, స్టెనోగ్రాఫర్‌, కోర్టు మాస్టర్‌ లేరు.

Updated : 02 Jun 2023 05:35 IST

స్టెనోగ్రాఫర్‌, కోర్టు మాస్టర్‌ లేని వైనం
స్వయంగా ఉత్తర్వులు సిద్ధం చేస్తున్న ఛైర్‌పర్సన్‌

ఈనాడు, అమరావతి: కర్నూలులోని ఏపీ మానవ హక్కుల కమిషన్‌ (ఏపీహెచ్‌ఆర్‌సీ) సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. విచారణలు పూర్తయి తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు వాయిదా పడిన కేసుల్లో డిక్టేషన్‌ తీసుకునేందుకు టైపిస్టు, స్టెనోగ్రాఫర్‌, కోర్టు మాస్టర్‌ లేరు. కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి తానే కంప్యూటర్‌ ముందు కూర్చుని తుది ఉత్తర్వులను సిద్ధం చేస్తున్నారు. వాయిదా పడిన అన్ని కేసుల్లోనూ ఉత్తర్వులను తయారుచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ ముందుకు వచ్చిన ఓ కేసులో తుది ఉత్తర్వులను సిద్ధం చేయలేకపోతున్నట్లు హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. వేసవి సెలవులూ వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాయిదా పడిన కేసును మళ్లీ తెరవాలని నిర్ణయించింది. కేసు తదుపరి విచారణను జూన్‌ 14కు వాయిదా వేస్తూ విషయాన్ని ఇరువైపులా న్యాయవాదులకు తెలియజేయాలని హెచ్‌ఆర్‌సీ పరిపాలన విభాగాన్ని ఆదేశించింది. ఏపీహెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి, జ్యుడిషియల్‌ సభ్యులు డి.సుబ్రమణ్యం, డాక్టర్‌ జి.శ్రీనివాసరావుతో కూడిన బెంచ్‌ ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

పట్టుపట్టి కర్నూలుకు.. 

వాస్తవానికి అమరావతిలో హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుకు 2017లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న హెచ్‌ఆర్‌సీని రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో ఏర్పాటుచేసేందుకు తీసుకుంటున్న చర్యలను సవాలు చేస్తూ 2021లో హైకోర్టులో పిల్‌ దాఖలైంది. న్యాయవ్యవస్థ విభాగాలన్నింటిని రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. కర్నూలులో హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని 2021 ఆగస్టు 26న విచారణ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ న్యాయస్థానానికి వివరించారు. 2017నాటి నోటిఫికేషన్‌ను సవరించి కర్నూలులో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2021 సెప్టెంబరునుంచి కర్నూలులోని ఓ అతిథిగృహంలో హెచ్‌ఆర్‌సీని నిర్వహిస్తున్నారు. పట్టుబట్టి కర్నూలులో హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, సిబ్బందిని నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు కర్నూలులోని హెచ్‌ఆర్‌సీ కార్యాలయంలో సౌకర్యాల లేమి, సిబ్బంది కొరతపై దాఖలైన వ్యాజ్యం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని