అమరావతి స్మార్ట్ సిటీకీ తూట్లు
రాజధాని అమరావతిని పూర్తిగా దెబ్బ తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది.
పలు ప్రాజెక్టుల కుదింపు.. నాలుగు రద్దు
ఆ నిధులతో.. సెంటు స్థలాలిచ్చినచోట అంగన్‌వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు
కేంద్ర అనుమతి లేకుండా ప్రాజెక్టుల రద్దు నిబంధనలకు విరుద్ధం
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిని పూర్తిగా దెబ్బ తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల ఆందోళనల్ని బేఖాతరు చేస్తూ, బృహత్ ప్రణాళికను మార్చేసి.. కొత్తగా ఆర్5 జోన్ సృష్టించి బయటి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి అక్కడ స్థలాలిచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అమరావతి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులోనూ ఇష్టానుసారం మార్పులు చేసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రాజధానిలో ఇదివరకు ప్రతిపాదించిన నాలుగు ప్రాజెక్టులను రద్దు చేసింది. కొన్ని ప్రాజెక్టుల్ని కుదించింది. వాటికి బదులుగా బయటి ప్రాంతాల వారికి స్థలాలిచ్చిన చోట అంగన్‌వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల్ని ప్రతిపాదించింది. ప్రాజెక్టును రద్దు చేయగా మిగిలిన నిధుల్ని అక్కడ ఖర్చు చేయబోతోంది. ఈ నెల 1న జరిగిన అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏఎస్‌ఎస్‌సీసీఎల్) బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇది నిబంధనలకు విరుద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్నా.. కేంద్రం నుంచి ముందుగానే అనుమతి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాలపై లబ్ధిదారులకు ప్రస్తుతం హక్కు లేదు. కోర్టు ఉత్తర్వులకు లోబడే వారికి హక్కు దఖలు పడుతుందన్న షరతుతో పట్టాలిచ్చారు. వారికి పట్టాలిచ్చిన చోట పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు వంటి మౌలిక వసతులు కల్పించాల్సిందే. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు నిధులతో అక్కడ అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు నిర్మిస్తామని చెప్పడం లబ్ధిదారుల్ని మోసం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రద్దు చేసిన, కుదించిన ప్రాజెక్టులివే!
* అమరావతిలో స్మార్ట్ వార్డ్స్ అభివృద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు, మురుగునీటి శుద్ధి కేంద్రం, పట్టణ క్రీడా కేంద్రాల (టౌన్ స్పోర్ట్స్ హబ్స్) ప్రాజెక్టుల్ని రద్దు చేశారు.
* నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పాఠశాలలు, ఈ-ఆరోగ్య కేంద్రాలు, నీటి శుద్ధి కేంద్రం ప్రాజెక్టుల్ని కుదించారు.
* అమరావతి సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రూ.86 కోట్ల నుంచి రూ.37.89 కోట్లకు కుదించారు.
కొత్తగా తీసుకున్న ప్రాజెక్టులివీ!
* కేంద్ర ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకి, ఏఎస్‌ఎస్‌సీసీఎల్‌కి గతంలో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం.. రూ.58 కోట్ల నిధుల్ని సిటీ ఇన్వెస్ట్‌మెంట్ టు ఇన్నోవేటివ్, ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టెయిన్ (సీఐఐటీఐఎస్) కార్యక్రమానికి మళ్లించనున్నారు. ఈ కార్యక్రమం కింద కూడా సెంటు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతాల్లో పాఠశాలలు, ఈ-ఆరోగ్య కేంద్రాలు నిర్మించనున్నారు.
* సెంటు స్థలాలిచ్చిన ప్రాంతాల్లో రూ.27.06 కోట్లతో అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు నిర్మిస్తారు.
ప్రాజెక్టులు రద్దు చేసే అధికారం ఎవరిచ్చారు?
కేంద్ర ప్రభుత్వం 2017లో అమరావతి స్మార్ట్ సిటీ డీపీఆర్‌కి అనుమతిచ్చి, తన వాటాగా రూ.500 కోట్ల నిధులూ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో రూ.500 కోట్లు సమకూర్చాలి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు నిధులతో అక్కడ చేపట్టే ఏ ప్రాజెక్టయినా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉండాలి. ఇది వరకు ప్రతిపాదించిన ప్రాజెక్టులను ఇష్టానుసారం రద్దు చేస్తాం, కొత్తవి జత చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనడానికి వీల్లేదు. మార్పులు చేసేస్తూ బోర్డు ముందు నిర్ణయం తీసేసుకుని, తర్వాత తీరిగ్గా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తామని చెప్పడానికీ కుదరదు. ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసిన స్మార్ట్ వార్డుల అభివృద్ధి, ఘనవ్యర్థాలు, మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల వంటివి కూడా అమరావతికి అత్యంత కీలకమైనవే.
రూ.150 కోట్ల మాటేంటి?: అమరావతి స్మార్ట్ సిటీకి రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన రూ.500 కోట్లను తెదేపా ప్రభుత్వ హయాంలోనే కేటాయించారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఈ నిధుల్నీ 2022 మార్చి 31లోగా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రూ.150 కోట్లు జమ చేయకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు
-
ODI World Cup: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి అగర్ ఔట్.. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆటగాడికి చోటు
-
Disney+: నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+.. పాస్వర్డ్ షేరింగ్‌కు చెక్.. ఇండియాలోనూ?
-
Vishal: రూ. 6.5 లక్షలిచ్చా.. సెన్సార్ బోర్డులోనూ అవినీతి.. ఆరోపించిన విశాల్
-
Tragedy: అయ్యో.. కూతురి పెళ్లి కోసం లాకర్లో ₹18లక్షలు దాస్తే... చివరకు..!!