Old Pension Scheme: పాత పింఛను అమలుకు ప్రభుత్వం అనాసక్తి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సోమవారం నిర్వహించిన చర్చల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.
గ్యారెంటీ పెన్షన్‌పై కేబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తాం
డీఏ, పీఆర్సీ బకాయిలు 2027 వరకు వాయిదాల్లో చెల్లింపు
ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ చర్చలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సోమవారం నిర్వహించిన చర్చల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. గతంలో ప్రకటించినట్లే గ్యారెంటీ పెన్షన్ పథకం(జీపీఎస్) అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. సీపీఎస్ ఉద్యోగులకు 33 శాతం గ్యారెంటీ పెన్షన్ ఉండేలా జీపీఎస్‌లో కొన్ని మార్పులు ఉంటాయని, దీనిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని అనుసరించి మార్పుచేసేలా ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి హాజరయ్యారు. ‘ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. ఉద్యోగుల డీఏ, పీఆర్సీ బకాయిలు కలిపి రూ.7 వేల కోట్లకుపైగా ఉండగా, వాటిని 2027వరకు చెల్లిస్తామంది. 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% చెల్లిస్తామంటూ హామీ ఇచ్చింది. ఇది కేవలం కంటితుడుపు చర్యే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విధించిన నిబంధనల వల్ల చాలామంది అర్హత కోల్పోతున్నారు’ అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రస్తావించారు. పీఆర్సీ ఛైర్మన్‌గా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను నియమిస్తామని మంత్రుల కమిటీ ప్రతిపాదించగా సంఘాల నాయకులు తిరస్కరించారు. ఆయన సీఎస్‌గా ఉన్నప్పుడే 11వ పీఆర్సీలో అన్యాయం జరిగిందని గుర్తుచేశారు. ఆదిత్యనాథ్‌దాస్‌ను నియమించాలని కొందరు ప్రతిపాదించారు.
ఓపీఎస్ అమలు చేయాలి
- బండి శ్రీనివాసరావు, ఛైర్మన్ ఏపీ ఐకాస
సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్‌లో రాయితీలు ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. పాత పింఛను (ఓపీఎస్) విధానమే అమలు చేయాలని కోరుతున్నాం. పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు పెంచడాన్ని పరిశీలిస్తామన్నారు. గతంలో ఏపీ ఐకాస ఇచ్చిన 71డిమాండ్లలో చాలావరకు పరిష్కారమయ్యాయి. డీఏ, పీఆర్సీ బకాయిలు నాలుగేళ్లలో వాయిదా పద్ధతుల్లో 2024 జనవరి నుంచి చెల్లిస్తామని చెప్పారు. ఐఆర్ ప్రకటించడంగాని, ఫిట్‌మెంట్ ఇవ్వడంగాని చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
8 తర్వాత ఉద్యమ కార్యాచరణ
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఏపీ ఐకాస అమరావతి
చర్చల్లో సానుకూలత రావడంతో అదే వాతావరణంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి ముందుకెళ్తాం. ఈనెల 8న గుంటూరులో ప్రాంతీయ సదస్సు యథావిధిగా ఉంటుంది. ఆ రోజున అన్ని జిల్లాల ఛైర్మన్లతో భేటీ అయి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. వీఆర్‌ఏలకు రూ.300 డీఏను పునరుద్ధరించడంపై సీఎం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తామన్నారు. కొత్తగా చేరిన మహిళా ఉద్యోగి రెండేళ్లలోపు 180 రోజులు ప్రసూతి సెలవులు వాడుకుంటే, వారి ప్రొబేషన్ పొడిగించడం దుర్మార్గమని చెప్పాం. దీనిపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తామన్నారు. 2003లో నియమితులై, 2004 సెప్టెంబరు ఒకటి తర్వాత ఉద్యోగాల్లో చేరిన 9వేల మందికి చట్టప్రకారం పాత పింఛన్‌ను అమలు చేయాలని కోరాం.
బిల్లుల జాప్యం కారణంగానే
- వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం
ఈహెచ్‌ఎస్ అమలు కాకపోవడానికి ఆస్పత్రుల బిల్లుల్లో జాప్యమే కారణం. ఉద్యోగుల వాటాతో కలిపి ప్రభుత్వ వాటాను ఏ నెలకు ఆ నెల ట్రస్టు ఖాతాలోకి మళ్లిస్తే ఆస్పత్రులకు చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండవు. దీన్ని ఈనెల నుంచి అమలు చేస్తామని మంత్రులు చెప్పారు. సీపీఎస్ ఉద్యోగులకు భద్రత కల్పించేలా పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా మేలు చేస్తామని, దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు. 1993కి ముందు ఐదేళ్లు పూర్తిచేసుక్ను ఎన్‌ఎంఆర్, డైలీవేజ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని జీవో ఇచ్చారు. అయితే ఐదేళ్ల నిబంధనతో క్రమబద్ధీకరణ కాని 4వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వంపై ఏటా కేవలం రూ.20 కోట్ల భారం పడుతుందని చెప్పాం. దీనిపై ఈ కేబినెట్‌లోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ ఈ కేబినెట్‌లో కాకపోతే ఆ ఉద్యోగులు అసంతృప్తి చెందొద్దు. సీఎంను కలిసి రెగ్యులర్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం.
చట్టబద్ధ పీఆర్సీ వేయాలి
- సాయి శ్రీనివాస్, తిమ్మన్న, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రోపాధ్యాయ సంఘం
చట్టబద్ధతతో కూడిన పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి. 2003లో నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన వారికి ఓపీఎస్ అమలు చేస్తామని గత సమావేశంలో చెప్పారు. ఇప్పుడు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు చేయాలని కోరాం. జీపీఎస్‌లో కొన్ని రాయితీలపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. మేం జీపీఎస్‌ను అంగీకరించడం లేదు. పీఆర్సీ బకాయిలను పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామన్న ప్రభుత్వం.. నాలుగేళ్లలో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
సీపీఎస్ ఉద్యోగులను విస్మరించింది
- మరియాదాస్, అధ్యక్షుడు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం
రాష్ట్రంలో 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులను ప్రభుత్వం విస్మరించింది. జీపీఎస్ విధానంలోనే కొంత మెరుగ్గా చేస్తామని చెబుతున్నారు. ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడా చేయాలి.
జీపీఎస్‌కు తుది మెరుగులు
- మంత్రి బొత్స సత్యనారాయణ
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ ఇచ్చేలా జీపీఎస్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నాం. కేబినెట్‌లో చర్చించాక ప్రకటిస్తాం. 2014 జూన్ 2నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని రెగ్యులరైజ్ చేస్తాం. జనవరిలోపే ఉత్తర్వులు ఇస్తాం. 12వ పీఆర్సీ ఏర్పాటును కేబినెట్‌లో పెట్టి, ఛైర్మన్‌ను నియమిస్తాం. సొసైటీలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీవిరమణ వయసు 62ఏళ్లకు పెంచడంపై కోర్టులో కేసులున్నాయి. వాటిని పరిశీలించి, నిర్ణయం తీసుకుంటాం. గత పీఆర్సీలో స్పెషల్ పే ఇచ్చేందుకు అనుమతించాం. కొత్త జిల్లా కేంద్రాల్లో 16% హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తాం. గతంలో పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీవిరమణ తర్వాత ఇస్తామని చెప్పాం. వీటిని నాలుగేళ్లలో ఏటా నాలుగు వాయిదాల చొప్పున చెల్లిస్తామని చెప్పాం. వైద్య విధాన పరిషత్తు సిబ్బందికి 010 కింద జీతాలు ఇవ్వాలని నిర్ణయించాం. కేబినెట్‌లో పెట్టిన తర్వాత ఆయా విభాగాలు ఉత్తర్వులు ఇస్తాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కొంత ఆలస్యమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..
-
Fake News: ఎక్స్ కీలక నిర్ణయం.. నకిలీ వార్తలపై ఫిర్యాదు ఫీచర్ తొలగింపు..!
-
Manipur Violence: మణిపుర్లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్ అధికారికి పిలుపు..
-
Prabhas: ప్రభాస్ మైనపు విగ్రహంపై క్లారిటీ ఇచ్చిన మ్యూజియం నిర్వాహకులు..
-
Justin Trudeau: ‘మేం చేసింది ఘోర తప్పిదం.. క్షమించండి’: కెనడా ప్రధాని ట్రూడో
-
Balapur Laddu Auction: అత్యధిక ధరకు బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఎంత పలికిందంటే?