వై.ఎస్‌.భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వై.ఎస్‌.భాస్కరరెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Updated : 06 Jun 2023 06:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన వై.ఎస్‌.భాస్కరరెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసులో పిటిషనర్‌ పాత్రపై దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. ప్రత్యేకంగా ఎలాంటి ఆరోపణలూ లేవని బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఏప్రిల్‌ 16 నుంచి భాస్కరరెడ్డి నిర్బంధంలో ఉన్నారన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.  బెయిలును వ్యతిరేకిస్తూ సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. వివేకా హత్య కుట్రలో భాస్కరరెడ్డి పాత్ర ఉందని, అంతేగాకుండా సాక్ష్యాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారని తెలిపింది. సంఘటనా స్థలంలో దగ్గర ఉండి రక్తపు మరకలను తుడిచివేయించారని, వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు కట్టు కట్టించి, గుండెపోటుతో మరణించారని నమ్మించే ప్రయత్నాలు చేశారంది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సీబీఐ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

లేఖను నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు పంపడంపై నిర్ణయం 7న

మరణానికి ముందు వివేకా రాసిన లేఖను నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు పంపడానికి అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ కోర్టు ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. లేఖను పరీక్షకు పంపడంపై గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దస్తగిరి తరఫున ఎలాంటి కౌంటరు దాఖలు చేయడంలేదు. వివేకా లేఖను నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు పంపి బలవంతంగా రాయించిన వారి వేలి ముద్రలను కనిపెట్టడానికి సీబీఐ ప్రయత్నిస్తోంది. అయితే ఈ పరీక్షలో చేతిరాత  దెబ్బతింటుందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ చెప్పడంతో లేఖ కలర్‌ జిరాక్స్‌ ప్రతిని రికార్డుల్లో ఉంచుకుని, లేఖను పరీక్షకు పంపడానికి అనుమతించాలని సీబీఐ కోరిన విషయం విదితమే. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐకి సహకరించేందుకు అనుమతించాలన్న సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని