సీపీఎస్‌ ఉద్యోగులను మోసగించిన జగన్‌

మాట తప్పం, మడమ తిప్పం అని పదేపదే చెప్పే సీఎం జగన్‌... సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి.

Published : 08 Jun 2023 05:12 IST

ఓపీఎస్‌ అమలు చేస్తామని.. చేసిందేమిటి?
విశ్వసనీయత అంటే ఇదేనా?
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మండిపాటు

ఈనాడు, అమరావతి: మాట తప్పం, మడమ తిప్పం అని పదేపదే చెప్పే సీఎం జగన్‌... సీపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. సీపీఎస్‌ ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని, గత 18 ఏళ్లుగా పాత పింఛను విధానాన్ని అనుసరిస్తున్న పశ్చిమబెంగాల్‌కు లేని ఇబ్బంది ఏపీకి ఎలా వస్తుందని ప్రశ్నించాయి. సీపీఎస్‌కు బదులు జీపీఎస్‌ అమలుచేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు స్పందించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పాత పింఛను పథకం (ఓపీఎస్‌) అమలుచేయాలని డిమాండు చేశాయి. జగన్‌ హామీ ఇచ్చిన తర్వాత ఆరు రాష్ట్రాల్లో పాత పింఛనును పునరుద్ధరించారని, ఇక్కడ మాత్రం సాధ్యం కాదనడం ఉద్యోగులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించాయి.


సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మఘోష చూస్తారు

సీపీఎస్‌ ఉద్యోగులకు ఇది చీకటి రోజు. వారి ఆత్మఘోష ఎలాంటి రూపం దాలుస్తుందో జగన్‌ ప్రత్యక్షంగా చూసే రోజు వస్తుంది. గత ప్రభుత్వం నిజాయతీతో తీసుకొచ్చిన పింఛను వద్దనుకొని.. సీఎం జగన్‌ మోసపూరిత హామీతో నష్టపోయాం. రాష్ట్రంలోని సీపీఎస్‌ ఉద్యోగులను జగన్‌ నిలువునా ముంచారు. పాత పింఛను పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు జీపీఎస్‌ పెట్టి అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిస్తే వీధిరౌడీల్లా బైండోవర్‌ కేసులు పెట్టి, కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు. వృద్ధాప్యంలో ఆసరా ఇచ్చే పాత పింఛనును ఉద్యోగులకు దూరం చేసి, నిరాశ్రయుల్ని చేయొద్దు.

అప్పలరాజు, పార్థసారథి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీసీపీఎస్‌ఈఏ


సీపీఎస్‌ రద్దు కాలేదు

రాష్ట్రంలో సీపీఎస్‌ రద్దు కాలేదు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ నిలిపివేసి, పీఎఫ్‌ ఖాతాలు తెరిస్తేనే సీపీఎస్‌ రద్దు అయినట్లు భావిస్తాం. సీపీఎస్‌ అమలు చేస్తూనే జీపీఎస్‌ తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఓపీఎస్‌ అమలు చేయాల్సిందే. జీపీఎస్‌ను ఆహ్వానిస్తున్న ఉద్యోగ సంఘాల్లోని సీపీఎస్‌ ఉద్యోగులందరూ బయటకు రావాలి.

మరియదాస్‌, అధ్యక్షుడు, ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం


జీపీఎస్‌తో ఉద్యోగికి భద్రత ఉండదు

సీఎం జగన్‌ హామీ ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పింఛను(ఓపీఎస్‌) విధానమే అమలుచేయాలి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఓపీఎస్‌ అమలు చేస్తామన్న జగన్‌ నాలుగేళ్ల తర్వాత కొత్త పథకం ప్రతిపాదించడం ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసింది. మంత్రివర్గ సమావేశంలో జీపీఎస్‌పై తీసుకున్న నిర్ణయం 3లక్షల మంది ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. ఉద్యోగి పదవీవిరమణ నాటికి ఉన్న మూలవేతనంలో 50% పింఛను, దానిపై డీఆర్‌ ఇస్తామన్న ప్రతిపాదన విశ్రాంత ఉద్యోగికి భద్రతనివ్వదు.

వెంకటేశ్వర్లు, ప్రసాద్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య


సీఎం జగన్‌ మాట తప్పారు

ఓపీఎస్‌ అమలుపై సీఎం జగన్‌ మాట తప్పారు, మడమ తిప్పారు. జీపీఎస్‌ పేరుతో ఉద్యోగులను మోసం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తామని చెప్పి, అందులో ఇచ్చిన హామీనే తుంగలోకి తొక్కారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ లేని, షేర్‌ మార్కెట్‌ లేని, ఓపీఎస్‌ను అమలుచేయాలి.

సాయి శ్రీనివాస్‌, తిమ్మన్న, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు,  రాష్ట్రోపాధ్యాయ సంఘం


ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయం లేదు

ప్రతిపక్ష నేతగా జగన్‌ తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్‌ను అమలుచేయాలి. జీపీఎస్‌ అమలుకు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయం ఏదీ లేదు.

మంజుల, భానుమూర్తి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్‌(257)


పోరాటాలతో ఓపీఎస్‌ సాధిస్తాం

జీపీఎస్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చి, నాలుగేళ్ల తర్వాత జీపీఎస్‌ తీసుకురావడం దురదృష్టకరం. ఓపీఎస్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదు. సీపీఎస్‌, జీపీఎస్‌లను రద్దుచేయాలి. లేనిపక్షంలో ఐక్య పోరాటాలు చేసి, ఓపీఎస్‌ సాధించుకుంటాం.

హృదయరాజు, చిరంజీవి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏపీటీఎఫ్‌


ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకం

ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు ఉద్యోగులందరికీ ఓపీఎస్‌ను అమలుచేయాలి. కొత్త పథకం ప్రతిపాదించడంతో ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. అనేక రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పింఛను అమలు చేస్తున్నట్లే ఇక్కడా చేయాలి.

ఆస్కార్‌రావు, బాబాసాహెబ్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం


జీపీఎస్‌పై నమ్మకం లేదు

సీపీఎస్‌ కింద కాంట్రిబ్యూషన్‌ను కొనసాగిస్తూ మరోపక్క జీపీఎస్‌ ఇస్తామనడం ఆమోదయోగ్యం కాదు. ప్రతిపక్షంలో ఇచ్చిన హామీని జగన్‌ అమలుచేయాలి. జీపీఎస్‌పై ఉద్యోగులకు నమ్మకం లేదు.

హరికృష్ణ, శ్రీనివాసరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌


ఉద్యోగులను మోసం చేయడమే

జీపీఎస్‌ ఇస్తామనడం ఉద్యోగులను మోసం చేయడమే. దీనికంటే సీపీఎస్‌లోనే ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు ఉంది. పదవీవిరమణ చెందేలోగా అవసరాల కోసం మూడుసార్లు పాక్షిక ఉపసంహరణ, పదవీవిరమణ తర్వాత ప్రాన్‌ ఖాతాలోని మొత్తంలో 60% ఉద్యోగికి వస్తుంది. జీపీఎస్‌లో ఉద్యోగి వాటా 10% వసూలు చేస్తూ పదవీవిరమణ తర్వాత 60% వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

 పాల రామాంజనేయులు, వ్యవస్థాపకుడు,  సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని