సహకార బ్యాంకులపై సైబర్‌ వల

సహకార బ్యాంకులపై సైబర్‌ నేరగాళ్లు కన్నేశారు. వాటిలోని సాంకేతికపరమైన లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము కొల్లగొడుతున్నారు.

Updated : 10 Jun 2023 06:03 IST

సిబ్బంది కంప్యూటర్‌ ద్వారా సర్వర్‌లోకి చొరబాటు
ఎంపిక చేసుకున్న ఖాతాల్లోకి  సొమ్ము మళ్లింపు
దిల్లీ కాంగ్రా సహకార  బ్యాంకు నుంచి రూ.7.79 కోట్లు  కొట్టేసిన నేరగాళ్లు
గతంలో హైదరాబాద్‌లోని బ్యాంకుల్లోనూ ఇదే తరహా లూటీ

ఈనాడు, హైదరాబాద్‌: సహకార బ్యాంకులపై సైబర్‌ నేరగాళ్లు కన్నేశారు. వాటిలోని సాంకేతికపరమైన లొసుగులను ఆసరాగా చేసుకొని సొమ్ము కొల్లగొడుతున్నారు. దేశ రాజధాని దిల్లీలోని కాంగ్రా సహకార బ్యాంకులో ఇటీవల రూ.7.79 కోట్లు కొట్టేశారు. గతంలో హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల సర్వర్లలోకి చొరబడి దోచుకున్న తరహాలోనే కాంగ్రా బ్యాంకునూ లూటీ చేశారు.

హైదరాబాద్‌లో ఏం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల నుంచి గతంలో ఆరు నెలల వ్యవధిలోనే రూ.14 కోట్లను సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. 2021 జులైలో తెలంగాణ సహకార బ్యాంకు నుంచి రూ.2 కోట్లు, 2022 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ సహకార బ్యాంకు నుంచి రూ.12 కోట్లు కొల్లగొట్టారు. రెండింటిలోనూ దాదాపు ఒకే తరహా విధానం అనుసరించారు. తొలుత సిబ్బంది కంప్యూటర్‌ ద్వారా సర్వర్‌లోకి ర్యాట్‌(రిమోట్‌ యాక్సెస్‌ టూల్‌) చొప్పించారు. బ్యాంకు సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకొని సాఫ్ట్‌వేర్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం బ్యాంకు డబ్బును తాము ఎంపిక చేసుకున్న ఖాతాదారుల ఖాతాల్లోకి, అక్కడి నుంచి ఆర్టీజీఎస్‌ ద్వారా ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. అక్కడ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న వందల సంఖ్యలోని ‘మ్యూల్‌’ ఖాతాల్లోకి మళ్లించి డబ్బు డ్రా చేసుకున్నారు. డబ్బు డ్రా చేసిన ఖాతాల యజమానులను పోలీసులు పట్టుకున్నా అసలు నేరానికి పాల్పడింది ఎవరో ఇప్పటికీ తెలియలేదు.

కాంగ్రాలోనూ ఇదే తీరు..

హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల సొమ్మును కొల్లగొట్టినట్లుగానే కాంగ్రా బ్యాంకులోనూ గత నెల మొదటి వారంలో ఇలాంటి మోసానికే సైబర్‌ నేరగాళ్లు పాల్పడ్డారు. ఈ బ్యాంకు ఖాతాదారులకు స్వయంగా ఆర్టీజీఎస్‌ ద్వారా నగదు బదిలీ చేసే అవకాశం లేదు. ఆర్టీజీఎస్‌ చేయాలంటే బ్యాంకుకు వెళ్లి.. సంబంధిత దరఖాస్తు పత్రం నింపి, ఎవరి ఖాతాలోకి ఎంత డబ్బు బదిలీ చేయాలో రాసివ్వాలి. ఇలా ఖాతాదారులు ఇచ్చిన పత్రాలను కాంగ్రా బ్యాంకు సిబ్బంది రిజర్వు బ్యాంకుకు ఆన్‌లైన్‌లో పంపుతారు. అనంతరం రిజర్వు బ్యాంకు సంబంధిత ఖాతాదారుల ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేస్తుంది. ఇందుకోసం కాంగ్రా బ్యాంకు ప్రతి రోజూ రూ.4 కోట్లు ముందుగానే రిజర్వు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఏరోజుకారోజు వచ్చిన వినతుల మేరకు రూ.4 కోట్ల నుంచే నగదు బదిలీ అవుతుంది. మిగతా డబ్బును రిజర్వు బ్యాంకు వెనక్కి పంపుతుంది. దీనికి సంబంధించి స్టేట్‌మెంట్‌ కూడా కాంగ్రా బ్యాంకుకు పంపుతుంది. ఈ మొత్తం ప్రక్రియను గమనించిన సైబర్‌ నేరగాళ్లు తొలుత కాంగ్రా బ్యాంకు సిబ్బంది కంప్యూటర్‌లోకి చొరబడి.. సర్వర్‌లోకి ‘ర్యాట్‌’ను చొప్పించారు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. కాంగ్రా బ్యాంకు శాఖల నుంచి వచ్చే ఆర్టీజీఎస్‌ పత్రాల్లాంటివే నకిలీవి సృష్టించారు. వాటిని ఆన్‌లైన్‌లో రిజర్వు బ్యాంకుకు పంపారు. ఈ నకిలీ ఆర్టీజీఎస్‌ పత్రాల ఆధారంగా రిజర్వు బ్యాంకు పంపిన డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించారు.

ఇలా మూడు రోజుల వ్యవధిలో రూ.7.79 కోట్లు కొల్లగొట్టారు. తాము పంపిన పత్రాల్లోని వారికి కాకుండా ఇతరులకు.. ఎక్కువ మొత్తం సొమ్ము బదిలీ అవుతున్నట్లు బ్యాంకు అధికారులు తొలి రోజే గుర్తించారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. మూడు రోజుల తర్వాత అనుమానం వచ్చి ఆర్టీజీఎస్‌ చెల్లింపులను నిలిపివేశారు. గతంలో సహకార బ్యాంకులను కొల్లగొట్టిన ముఠాయే కాంగ్రా బ్యాంకును లూటీ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత పోలీసులు డబ్బు డ్రా చేసినవారిని గుర్తిస్తున్నారు. అప్పటికే డబ్బు చేతులు మారిఉంటుంది. దాంతో అసలు నేరానికి పాల్పడింది ఎవరన్నది తెలియడం లేదు. ఇప్పటివరకూ దేశంలోని ఏడు సహకార బ్యాంకుల్లో సైబర్‌ నేరగాళ్లు ఈ తరహాలో రూ.110 కోట్లు కొల్లగొట్టారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన మూడు బ్యాంకులు ఉన్నాయి. వీటిలో రెండు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయగా రూ.1.5 కోట్లు పోగొట్టుకున్న ఓ బ్యాంకు తన విశ్వసనీయత దెబ్బతింటుందున్న ఉద్దేశంతో ఫిర్యాదు చేయలేదు. సహకార బ్యాంకుల్లో సైబర్‌ భద్రత బలహీనంగా ఉంటుందని, ఆర్బీఐ నిబంధనలు సరిగా పాటించడం లేదని గమనించిన సైబర్‌ నేరగాళ్లు వాటి సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో సైబర్‌ భద్రతపై సహకార బ్యాంకులు దృష్టి సారించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని