చిరుద్యోగుల జీతాల్ని మింగేసిన సర్కారు!

క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సిబ్బందికి ఆరునెలలకోసారి కూడా జీతాలివ్వడం లేదు.

Updated : 16 Aug 2023 09:55 IST

ప్రకృతి సేద్యం విభాగంలో ఆకలి కేకలు
7 నెలలుగా జీతాలందక 10 వేల మంది వేదన
కేంద్ర నిధుల్ని ప్రభుత్వం వాడేసుకున్న ఫలితం
పాలకొల్లు - న్యూస్‌టుడే

‘‘ప్రకృతి సాగులో దేశంలోనే మిన్నగా పలు విధానాలు అవలంభిస్తూ మనరాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోంది. క్రమేపీ సాగు విస్తీర్ణం పెరుగుతోంది..’’

గత ఏడాది జరిగిన నీతి ఆయోగ్‌ సదస్సులో సీఎం జగన్‌ ప్రత్యేక ప్రసంగమిది.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అభివృద్ధి కోసం పనిచేస్తున్న సిబ్బందికి ఆరునెలలకోసారి కూడా జీతాలివ్వడం లేదు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఏ జిల్లా చూసినా వందలమంది ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సకాలంలో జీతాలందక ఆకలితో అప్పులు చేసుకుంటూ సంసారాలు నెట్టుకొస్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి ప్రకృతి సాగు ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు విడుదలవుతున్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల సిబ్బందికి జీతాల ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వీరి జీతాల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తున్నాయి. 2022లో పెండింగ్‌ ఉన్న జీతాలను 2023 జనవరిలో చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మళ్లీ ప్రకృతి సాగు సిబ్బంది వైపు చూసింది లేదు. ఏడు నెలలుగా జీతం రూపేణా చిల్లిగవ్వ అందక నానా తిప్పలు పడుతున్నామని పలువురు సిబ్బంది వాపోతున్నారు.

రాష్ట్రం దాటి సేవలు..

ప్రకృతి సేద్యంపై ఉన్న ఆసక్తితో రాష్ట్రం దాటి సేవలందిస్తున్నవారు అనేకమంది ఉన్నారు. మన రాష్ట్రంలో తెలంగాణ నుంచి వచ్చి పనిచేస్తున్న జోనల్‌ కోఆర్డినేటర్లు 15 మంది ఉన్నారు. అలానే మన రాష్ట్రం నుంచి వెళ్లి మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో కొందరు పనిచేస్తున్నారు. ఆయా రాష్ట్రాలు సకాలంలోనే జీతాలు విడుదల చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే సుమారు 10 వేల మంది సిబ్బంది జీతాలు అందక అల్లాడుతున్నారు. జీవామృతం తయారీ, కిచెన్‌ గార్డెన్ల ఏర్పాటుకు విత్తనాల నిమిత్తం అయ్యే ఖర్చులకు గ్రామాల్లో పేద రైతులు ముందుకు రావడం లేదు. వాటిని సైతం డివిజన్‌ ఇన్‌ఛార్జీలు, ఐసీఆర్పీలు దుకాణాల్లో అప్పుగా తీసుకొస్తూ కార్యక్రమాలు నిర్వహించాల్సిన దుస్థితి!

2.90 లక్షల హెక్టార్లలో..

రాష్ట్రంలో మొత్తం 2.90 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరుగుతుండగా 6.30 లక్షల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. వీరందరికీ సూచనలు, సలహాలతో సాగు అభివృద్ధికి పనిచేసే సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తుంటే ప్రకృతి సాగు విస్తీర్ణం పెరిగేదెలాగో పాలకులే చెప్పాలి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరితో ప్రారంభమైన ప్రకృతి  సాగు క్రమేపీ ఆయిల్‌పామ్‌, జామ, కూరగాయలకు విస్తరించి 42 వేల ఎకరాల్లో కొనసాగుతోంది. 450 మంది వరకు సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో 144 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా రూ.44 లక్షల వరకు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 330 మంది పని చేస్తుండగా.. వీరికి జనవరి జీతాలు జులైలో అందాయి. ఆ తర్వాతి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని