రాష్ట్రంలో కమ్ముకున్న చిమ్మచీకట్లు

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా గాడి తప్పింది. డిమాండ్‌లో భారీ పెరుగుదల లేకున్నా, ప్రభుత్వం సరఫరా చేయలేని స్థితికి వచ్చింది. అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరుతో సుమారు 3 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కోత విధించినట్లు సమాచారం.

Updated : 22 Aug 2023 06:50 IST

రాత్రివేళ విద్యుత్‌ కోతల ఫలితం
మార్కెట్‌లో కొనడానికి డబ్బుల్లేకే?

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా గాడి తప్పింది. డిమాండ్‌లో భారీ పెరుగుదల లేకున్నా, ప్రభుత్వం సరఫరా చేయలేని స్థితికి వచ్చింది. అత్యవసర లోడ్‌ రిలీఫ్‌ (ఈఎల్‌ఆర్‌) పేరుతో సుమారు 3 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) కోత విధించినట్లు సమాచారం. సోమవారం రాత్రి 7-10 గంటల వరకు కొన్ని ఫీడర్‌ల పరిధిలో విద్యుత్‌ కోతలు విధించినట్లు అధికారులు చెబుతున్నా.. గ్రామాల్లో ఐదారు గంటల పాటు కరెంటు లేదు. చాలాగ్రామాల్లో రాత్రి 11 తర్వాతా సరఫరా పునరుద్ధరించలేదు.

వినియోగం పెరగకున్నా..

రాష్ట్రంలో కొన్ని రోజులుగా విద్యుత్‌ వినియోగం 225 ఎంయూల మధ్య ఉంటోంది. ఆదివారం 225.31 ఎంయూల డిమాండ్‌ ఉంది. థర్మల్‌ విద్యుత్‌ 87.93, జల విద్యుత్‌ 8.24, పునరుత్పాదక, ఇతర వనరుల నుంచి 55.79 ఎంయూల చొప్పున వచ్చింది. కేంద్ర సంస్థల నుంచి 44.31, బహిరంగ మార్కెట్‌లో 33 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి. పీక్‌ డిమాండ్‌ వేళ కనీసం 10-15 ఎంయూల మేర డిస్కంలు కొనాల్సి వస్తోంది. ఇందుకు ముందుగానే డబ్బు చెల్లించాలి. రోజు మొత్తంలో విద్యుత్‌ కొనుగోళ్లకు సుమారు రూ.30-35 కోట్లు అవసరం. ఇటీవల బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లకు భారీ మొత్తంలో ఖర్చు చేయడంతో డిస్కంలకు నిధులు సర్దుబాటు కావడం లేదని, ప్రభుత్వమూ సమకూర్చడం లేదని, తత్ఫలితమే గాఢాంధకారమని తెలుస్తోంది. జెన్‌కో థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గడం, జల విద్యుత్‌ అందుబాటులో లేకపోవడం, పవన విద్యుత్‌ ఆకస్మికంగా పడిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌, ఉత్పత్తికి నడుమ అంతరం పెరిగింది. వార్షిక నిర్వహణ పేరిట ఆర్‌టీపీపీ, వీటీపీఎస్‌లో ఒక్కో యూనిట్‌లో ఉత్పత్తి నిలిచింది. సాంకేతిక కారణాలతో కృష్ణపట్నంలోని రెండు యూనిట్లలో (1,600 మెగావాట్లు) ఉత్పత్తి ఆగింది. బొగ్గు కొరత వల్ల హిందుజాలో ఒక యూనిటే పనిచేసింది. 

  • విజయనగరంలో సోమవారం రాత్రి 10 నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచింది. ఎస్‌.కోట, గజపతినగరంలోనూ కోతలు విధించారు.
  • నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రాత్రి 7 నుంచి కరెంటు లేదు. ఉలవపాడు, గుడ్లూరు, వలేటివారిపాలెం, కావలి, వరికుంటపాడు, విడవలూరు గ్రామాలు అంధకారంలో మగ్గాయి.
  • ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో విద్యుత్‌ కోతలను నిరసిస్తూ చిలుకూరివారిగూడెం గ్రామస్థులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మైలవరంలో రాత్రి 9 నుంచి కరెంటు లేదు. తిరువూరు, బంటుమిల్లి మండల కేంద్రాల్లోనూ కోతలు అమలయ్యాయి.
  • పార్వతీపురం మన్యం జిల్లాలోని చాలా గ్రామాల్లో రాత్రి 7 నుంచి కరెంటు లేదు.
  • వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలో రాత్రి 8 నుంచి గంట పాటు కోతలు విధించారు. ప్రొద్దుటూరులోనూ గంట సేపు తీసేశారు.
  • తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని గ్రామాల్లో రాత్రి 7 నుంచి మూడు గంటల పాటు కోతలు విధించారు.
  • పల్నాడు జిల్లా ఈపూరు, గురజాల, వినుకొండ మండలాల్లోని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచింది. శ్రీకాకుళం డివిజన్‌లోని 85 సబ్‌ స్టేషన్లలో సాయంత్రం 7 తర్వాత రొటేషన్‌ విధానంలో కోతలు అమలయ్యాయి.
  • బాపట్ల జిల్లా చెరుకుపల్లి, పర్చూరు మండలాల్లో రాత్రి 7.20 నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.
  • రాజధాని గ్రామాల్లో రాత్రి 7-10.30 వరకు కరెంటు లేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని