Vizag: విజయసాయి కుమార్తె విల్లాకు రూ.15.89 లక్షల వీఎల్టీ విధింపు

విశాఖ నగర శివారు మధురవాడ సర్వేనంబరు 386/పీలోని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి విల్లాకు ఎట్టకేలకు వీఎల్టీ (ఖాళీ స్థలం పన్ను) విధించారు.

Updated : 05 Sep 2023 07:49 IST

ఎంపీ ఎంవీవీకి రూ.90 లక్షల డిమాండ్‌ నోటీసు
‘ఈనాడు’ కథనానికి స్పందన

విశాఖపట్నం (కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: విశాఖ నగర శివారు మధురవాడ సర్వేనంబరు 386/పీలోని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహారెడ్డి విల్లాకు ఎట్టకేలకు వీఎల్టీ (ఖాళీ స్థలం పన్ను) విధించారు. 5076 గజాల స్థలానికి రెండేళ్ల వ్యవధి కోసం రూ.15,89,804 చెల్లించాలని నోటీసులిచ్చారు. నేహారెడ్డికి చెందిన అవ్యాన్‌ రియల్టర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థకు చెందిన భవనం నిర్మాణంలో ఉండగానే జీవీఎంసీ అధికారులు నివాస ఆస్తి పన్ను విధించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తర్న్‌ సర్కార్స్‌)లో చేపట్టిన నిర్మాణానికి వీఎల్టీ విధింపులో అవకతవకలు జరిగాయి. దీనిపై ‘ప్రజలకు పన్నుపోటు.. వైకాపా నేతలకు రిబేటు’ శీర్షికన ఈనెల 2న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జీవీఎంసీ అధికారులు నేహారెడ్డి భవనానికి విధించిన అసెస్‌మెంట్‌ను వీఎల్టీగా మార్పు చేశారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణానికి సంబంధించి రూ.90 లక్షలు చెల్లించాలని నోటీసులిచ్చారు.

80 ఎకరాల నుంచి రూ.60 కోట్లు రావాలి

మధురవాడ సర్వేనంబరు 386/పి, ఎండాడ సర్వేనంబరు 1/పిలో 80 ఎకరాలను గ్లోబల్‌ ఎంట్రో పోలీస్‌ ఏసియా ప్రైవేటు లిమిటెడ్‌కు వీఎంఆర్‌డీఏ కేటాయించింది. దీనికి సంబంధించి వీఎంఆర్‌డీఏ 2010లో జీవీఎంసీకి రూ.4 కోట్లు వీఎల్టీ చెల్లించింది. విజయసాయి కుమార్తెకు కేటాయించిన స్థలంలో ఇటీవల భవనం నిర్మాణం చేపట్టగా జీవీఎంసీ కేవలం ఏడాదికి మాత్రమే రూ.7,94,902 వీఎల్టీ విధించింది. వాస్తవంగా 2010 నుంచి 2023 వరకు అంటే 13 ఏళ్లకు వీఎల్టీ విధించాల్సి ఉంది. అధికార పార్టీ ఎంపీ కుమార్తె కావడంతో కేవలం ఒక్క ఏడాదికే సరిపెట్టారు. మరో పక్క మొత్తం 80 ఎకరాలకు బకాయిలు లెక్కిస్తే రూ.60,09,24,800 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్తగా అసెస్‌మెంట్‌ వేసి వీఎల్టీ విధిస్తే మూడేళ్ల కాలానికి రూ.16.77 కోట్ల మేర జీవీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్లోబల్‌ ఎంట్రో పోలీస్‌ ఏసియా ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన స్థలాల్లో సగం వరకు నిర్మాణాలు పూర్తి కాగా, మరికొన్ని ప్రారంభ దశల్లో ఉన్నాయి. వాటినుంచి కూడా వీఎల్టీ వసూలు చేయగలిగితే జీవీఎంసీకి భారీగా ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని