Nara Bhuvaneswari: మీ కష్టం, త్యాగం మరువం: యువగళం వాలంటీర్లతో నారా భువనేశ్వరి

పార్టీ కోసం జైలుకు వెళ్లిన మీ రుణం తీర్చుకోలేనిదని యువగళం వాలంటీర్లతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడిలో సెప్టెంబరు 5న లోకేశ్‌ పాదయాత్రపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో 43 మంది యువగళం వాలంటీర్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే.

Updated : 08 Oct 2023 07:39 IST

ఈనాడు - రాజమహేంద్రవరం, కాకినాడ: పార్టీ కోసం జైలుకు వెళ్లిన మీ రుణం తీర్చుకోలేనిదని యువగళం వాలంటీర్లతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడిలో సెప్టెంబరు 5న లోకేశ్‌ పాదయాత్రపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో 43 మంది యువగళం వాలంటీర్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. వారిలో 39 మంది రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. వీరందరినీ తెదేపా శిబిరంలో భువనేశ్వరి కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో మాట్లాడుతూ.. ‘అనేక సవాళ్లను ఎదుర్కొని యువగళం పాదయాత్ర ప్రారంభం నుంచి లోకేశ్‌కు వెన్నంటి ఉంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ కష్టం, త్యాగం ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. మీరు జైలు నుంచి విడుదలవుతున్నారని తెలియగానే మిమ్మల్ని చూడాలని చెప్పా. దాడిచేసిన వారిని వదిలిపెట్టి చేయని నేరానికి మిమ్మల్ని అకారణంగా అరెస్టు చేసి నెల రోజులుగా జైలులో పెట్టారు. ఎంతో భవిష్యత్తు ఉన్న మీపై అన్యాయంగా హత్యాయత్నం కేసులు పెట్టడం బాధించింది’ అని పేర్కొన్నారు. యువగళంలో లోకేశ్‌తో పాటు సాగుతున్నారనే కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టారని భువనేశ్వరి ఆరోపించారు. వైకాపా మూకల దాడిలో యువగళం వాలంటీర్లకే గాయాలయ్యాయని, దాడికి పాల్పడిన వారిని అదుపు చేయని పోలీసులు బాధితులపైౖనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను కలిసిన వాలంటీర్లకు కొత్త దుస్తులతో పాటు కొంత ఆర్థిక సాయాన్ని భువనేశ్వరి అందించారు. అనంతరం వారి వారి స్వగ్రామాలకు వాలంటీర్లు పయనమయ్యారు.

భువనేశ్వరిని కలిసిన అమరాతి జేఏసీ నాయకులు

రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోందని.. ప్రశ్నించేవారిపై, ప్రతిపక్షాలపై పోలీసులతో తప్పుడు కేసులు నమోదు చేయిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అమరావతి ఐకాస నాయకులు విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతూ, దసరా నుంచి విశాఖకు తరలిస్తున్నట్లు మరో నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్బంధించడాన్ని వారంతా ఖండించారు. శనివారం రాజమహేంద్రవరం వచ్చిన అమరావతి ఐకాస నాయకులు..  చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని