బాపట్ల జిల్లాలో ప్రబలిన అతిసారం

బాపట్ల జిల్లాలోని తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో అతిసారం ప్రబలింది. గడిచిన అయిదు రోజుల్లో సుమారు 40 మంది వాంతులు, విరేచనాలతో మంచాన పడ్డారు.

Published : 27 Mar 2024 04:40 IST

తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో 40 మంది బాధితులు

బాపట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లాలోని తూర్పు పిన్నిబోయినవారిపాలెంలో అతిసారం ప్రబలింది. గడిచిన అయిదు రోజుల్లో సుమారు 40 మంది వాంతులు, విరేచనాలతో మంచాన పడ్డారు. బాధితులు బాపట్ల, కర్లపాలెం, గుంటూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో పిన్నిబోయిన సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉండటంతో రెండ్రోజుల క్రితం గుంటూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పికట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారులు బాధితుల వివరాలు సేకరించారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. స్థానికులు తాగుతున్న నీటి నమూనాలు సేకరించి, పరీక్షల నిమిత్తం పంపినట్లు ఈవోపీఆర్డీ పులి శరత్‌బాబు తెలిపారు. మిరప, వరి కోతలకు వెళ్తున్న వారు ఎండ నుంచి ఉపశమనం కోసం కూల్‌డ్రింక్‌లు తాగి, సమయానికి తినకపోవడం వల్ల అతిసార వ్యాధి బారిన పడినట్లు వైద్యాధికారి ఉస్మాన్‌ ప్రాథమికంగా నిర్ధారించారు. రోగులు కోలుకునే వరకూ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. గ్రామంలో ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకం ఒక్కటీ లేదు. దీంతో దాతలు సరఫరా చేసే ట్యాంకర్లు, ప్రైవేటు నీటి శుద్ధి కేంద్రాల నీటినే ప్రజలు తాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని