అన్నను మించిన అను‘చోరులు’!

పేదలు అనుభవిస్తున్న ఎసైన్డ్‌ భూములకు హక్కులన్నారు జగన్‌.. వెంటనే ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. రూ.కోట్ల విలువైన స్థలాలపై గద్దల్లా వాలిపోయారు. మేం చెప్పిన ధరకే ఇచ్చేయండి.. ధర ఎంతో చెప్పేయండి.. లేదంటే ప్రభుత్వం లాక్కుంటుందని భయభ్రాంతులకు గురిచేశారు.

Updated : 09 Apr 2024 12:44 IST

భూ యాజమాన్య హక్కులపై వైకాపా కపటనాటకం
పేద రైతుల చేజారిన ఎసైన్డ్‌ స్థలాలు
విలువైన భూములను చౌకగా కొట్టేసిన నేతలు
రూ. కోట్ల భూములకు రూ.లక్షల్లోనే చెల్లింపు
మరో 15 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం!
ఈనాడు,అమరావతి, విశాఖపట్నం

పేదలు అనుభవిస్తున్న ఎసైన్డ్‌ భూములకు హక్కులన్నారు జగన్‌.. వెంటనే ఆయన అనుచరులు రంగంలోకి దిగారు. రూ.కోట్ల విలువైన స్థలాలపై గద్దల్లా వాలిపోయారు. మేం చెప్పిన ధరకే ఇచ్చేయండి.. ధర ఎంతో చెప్పేయండి.. లేదంటే ప్రభుత్వం లాక్కుంటుందని భయభ్రాంతులకు గురిచేశారు. వాటిపై హక్కులు దక్కేలోపే పేదల నుంచి అప్పనంగా లాగేసుకున్నారు!

రాష్ట్రంలో ఇరవై ఏళ్ల క్రితం ఎసైన్డ్‌ భూములు పొందిన వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని తొలుత సీఎం జగన్‌ ప్రకటన చేశారు. ఇది అర్హులైన రైతులను ఆనందానికి లోనుచేసింది. అయితే, పైకి చెప్పేదొకటి... లోన చేసేదొకటనే సంగతి ఆ పేదలకు తొలుత అర్థం కాలేదు. ప్రకటనపై జీవో రాకముందే... విలువైన ఆ సాగు భూములపై వైకాపా నాయకులు, కార్యకర్తలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారు. పేద రైతులను బెదిరించి డి-పట్టా భూములను గుప్పిట పట్టారు. వారిని వివిధ రకాలుగా బెదిరించి వాటిని తక్కువ ధరకు దక్కించుకున్నారు. పేద రైతుల స్థానంలో వారే లబ్ధిపొందారు. వారికి ఉన్నతాధికారులు వంతపాడి ఈ కుట్రలో భాగస్వాములయ్యారు.

క్షేత్రస్థాయిలో కనిపించని అనుభవదారులు

తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పేదలకు 29,62,303 ఎకరాల ఎసైన్డ్‌ భూమిని పంపిణీ చేశారు. ఇందులో 2003కు ముందు పంపిణీ చేసిన 9,94,073 లక్షల ఎకరాలకు, 2003 తర్వాత పంపిణీ చేసిన 3,58,926 ఎకరాలకు సంబంధించిన అనుభవదారులు ఉన్నట్లు తేలింది. 16,589 ఎకరాలపై పరిశీలన జరుగుతోంది. ఏకంగా 15,92,713 ఎకరాలకు సంబంధించి అసలు అనుభవదారులు, వారసులు క్షేత్రస్థాయిలో లేరు. ఈ 15 లక్షల ఎకరాల స్థలాలు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని ఎసైన్డ్‌ భూములకు ధరలు పెరగడంతో 70% వరకు చేతులు మారినట్లు అంచనా.

ప్రభుత్వ పెద్దల పన్నాగం

ఎసైన్డ్‌ స్థలాలను పేద రైతుల నుంచి కాజేసేందుకు ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే పెద్దలు పెద్ద స్కెచ్చే వేశారు. ఆయా భూముల క్రయవిక్రయాలకు అవకాశం కల్పిస్తూ వైకాపా సర్కారు చట్ట సవరణ చేసింది. చట్టాన్ని సవరిస్తారన్న సమాచారంపై ఆ పెద్దలకు ముందే ఉప్పందింది. యాజమాన్య హక్కులు కల్పించేందుకు వీలుగా కలెక్టర్లు డీ-నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ముందే వైకాపా నేతలు పేద రైతులపై గద్దల్లా వాలిపోయారు. వారిని బెదిరించి, తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. డీ-నోటిఫికేషన్‌ వెలువడగానే ఆయా స్థలాలను తమ,  తమ బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇలా వైకాపా నాయకులు, వారి అనుచరులు రూ.కోట్లకు పడగలెత్తారు.

భూములివ్వకుంటే హక్కులు దక్కవని..

డి-పట్టా భూముల కుంభకోణం ఉత్తరాంధ్రలో భారీగా జరిగింది. పరిపాలనా రాజధాని పేరిట విశాఖ చుట్టుపక్కల భూములపై, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దృష్టిలో పెట్టుకుని విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోని డి-పట్టాలపై కన్నేశారు. ‘భూములు ఇవ్వకుంటే మీకు ఎప్పటికీ హక్కులు సంక్రమించబోవు. విమానాశ్రయం, రాజధాని వంటి అవసరాల కోసం ప్రభుత్వం మీ భూములను తీసుకుంటే ఎలాంటి పరిహారం రాదు’ అంటూ అమాయకులను మభ్యపెట్టారు. దాంతో విశాఖ పరిధిలోని భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, విజయనగరం జిల్లా భోగాపురం, శ్రీకాకుళం పరిధిలో వందల ఎకరాల డి-పట్టాల భూములు చేతులు మారాయి. ఇక్కడ ఎకరానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతున్నా.. రైతులకు మాత్రం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు మాత్రమే ముట్టజెప్పినట్లు సమాచారం.

అస్తవ్యస్తంగా వివరాలు

‘హక్కుల కల్పన’కు సంబంధించి ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి భూ రికార్డుల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. ప్రతి గ్రామం నుంచి ఎసైన్డ్‌ భూములు ఎంత విస్తీర్ణంలో, ఎప్పుడు పంపిణీ అయ్యాయి, అవి అనుభవదారులు/వారసుల ఆధీనంలోనే ఉన్నాయా? తదితర వివరాలు సేకరించింది. కొన్నిచోట్ల ఈ భూములు ఆక్రమణకు గురయ్యాయని తేలింది. ఇంకొన్ని గ్రామాల్లో స్థలాలను అనుభవిస్తున్నా.. వారి వద్ద సరైన పత్రాలు లేవు. ఇలా రికార్డులు కనిపించని, అస్తవ్యస్తంగా మారిన భూముల వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. ఇలాంటి పొరపాట్లు వైకాపా నేతలు, వారి అనుచరులకు వరంగా మారాయి.

చేతులు మారాయి ఇలా..

  • ఆనందపురం మండలం కోలవానిపాలెం, రామవరం, గండిగుండం, మామిడిలోవ, పందలపాక తదితర గ్రామాల్లోని 200 ఎకరాల భూములను ఇటీవల విశాఖ కలెక్టర్‌ డీనోటిఫై చేశారు. ఆయా భూములు రైతుల నుంచి వేరొకరి చేతులు మారుతున్నాయి. పెందుర్తి, పద్మనాభం, భీమునిపట్నం మండలాల పరిధిలో డీనోటిఫై చేసిన భూముల రిజిస్ట్రేషన్లు కూడా చకచకా సాగిపోతున్నాయి. డీనోటిఫైలో జాప్యం చేశారన్న కారణంతో విశాఖ జిల్లాలో పనిచేసిన ఓ ఐఏఎస్‌ అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి.
  • రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు 300 ఎకరాల వరకు డి-పట్టా భూములు ఉత్తరాంధ్ర పరిధిలో కొన్నట్లు సమాచారం. వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి మినహాయించే యత్నాలు చేస్తున్నారు.
  • భీమిలి పరిధిలోనూ ఓ అధికార పార్టీ నేత.. రైతులకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున చెల్లించి రూ. కోట్ల విలువైన 49 ఎకరాల డి-పట్టా భూములను దక్కించుకున్నట్లు తెలిసింది.
  • తాడేపల్లిలోని ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు బినామీ పేర్లపై వందల ఎకరాలు హస్తగతం చేసుకున్నట్లు సమాచారం. ఈ భూముల  విలువ రూ. కోట్లలో ఉంటే.. రైతులకు  మాత్రం రూ.లక్షల్లో చెల్లించినట్లు సమాచారం.
  • అనంతపురం, అనంతపురం గ్రామీణ, రాప్తాడు, కూడేరు మండలాల్లోని భూములు ఎకరాకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతున్నాయి. వైకాపా నాయకులు.. ‘ఎసైన్డ్‌’ రైతులకు తక్కువ మొత్తంలో చెల్లిస్తూ వాటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.
  • ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లి, గార్లదిన్నె, ధర్మవరం, ఉమ్మడి కడప జిల్లా కాశినాయన, కలసపాడు, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, కృష్ణా జిల్లా అయినంపూడి, ఇలపర్రు, పోలకొండ, నందివాడ, ఏలూరు జిల్లా దోసపాడు తదితర ప్రాంతాల్లో ఎసైన్డ్‌ భూములు దళితుల నుంచి అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి ఉదంతాలే జరిగాయి.

కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులకు భిన్నంగా...

ఎసైన్డ్‌ భూములు పొందిన వారిలో ఎస్సీలే కాకుండా ఎస్టీలు, బీసీలు, కొందరు ఓసీలు కూడా ఉన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు ప్రకారం.. ఎసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైతే వాటిని స్వాధీనపరచుకుని తిరిగి పేదలకు గానీ, వారసులకు గానీ అప్పగించాలి. అమ్మకానికి పెట్టిన, రుణాలను చెల్లించలేనప్పుడు వేలానికి పెట్టిన పేదల భూములను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వాటిని భూమిలేని దళితులు/పేదలకు ఇవ్వాలి. వైకాపా ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని