‘తిరువూరు..’ తాగునీటికీ పోరు

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం (ఎస్సీ రిజర్వుడ్‌) రాజకీయం ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను ఆనుకొని ఉండటం, ఆ జిల్లాలో ఆంధ్రా ప్రాంతవాసులు అధికంగా ఉండటంతో ఇటు ఏపీతోపాటు అటు తెలంగాణలోనూ ఈ నియోజకవర్గం గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది.

Updated : 23 Apr 2024 06:49 IST

ఎన్నికల ఎజెండాగా కిడ్నీ బాధితుల సమస్య
ఇరకాటంలో వైకాపా
అయిదేళ్లలో ఎ.కొండూరు మండలంలోనే 250 మందికిపైగా మృత్యువాత
గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నా చలనం లేని సర్కారు
జగన్‌ హామీలను గుర్తు చేస్తున్న ఓటర్లు
ఈనాడు, అమరావతి

  • తిరువూరు-గంపలగూడెం ప్రధాన రహదారి పక్కన రేకుల షెడ్డులో ఉంటాం. దానికీ ఇంటి పన్ను పేరుతో రూ.250 వసూలు చేస్తున్నారు. నీటి పన్నూ కట్టాలి. ఈ షెడ్డు స్థానంలో ఇంటి నిర్మాణానికి సహకరించమంటే ఎక్కడో ఊరి చివరలో చెరువు వద్ద ఇంటి స్థలమిచ్చారు.

తిరువూరు మండలం సూరంపాలేనికి చెందిన వ్యవసాయ కూలీ ఆవేదన


  • మా పొలంలోని మడిలో ఉన్న మట్టిని పక్కన పల్లంలో ఉన్న మరో మడిలోకి తోలుకోవాలంటే గ్రామసచివాలయంలో రూ.2500 చలానా తీయాలి. ఇదేం పద్ధతి? ఇప్పుడు వడ్ల బస్తా ధర రూ.వెయ్యి మాత్రమే ఉంది. ఎరువుల బస్తా ధర దానికి రెట్టింపు. రైతులకు జగన్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. పోయిన ఎన్నికల సమయంలో వైకాపా గెలుపునకు నిద్రాహారాలు మాని పనిచేశా. ఈసారి ఆలోచనలో పడ్డా.

తిరువూరు మండలం రోలుపడికి చెందిన ఓ యువరైతు వ్యాఖ్య


  • ఇసుక కొనలేని పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాల కల్పనా లేదు. ప్రభుత్వ పద్ధతి బాగా లేదు. సర్కారు చేయాల్సిందేమిటి? పరిశ్రమలు స్థాపించాలి. ఉద్యోగాలు కల్పించాలి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి పొలాలకు నీళ్లివ్వాలి. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. వీటిల్లో ఏ ఒక్కటైనా చేసిందా?

గంపలగూడెంలోని చెప్పుల వ్యాపారి, మెకానిక్‌, కూల్‌ డ్రింక్‌ షాపు యజమానుల ఆగ్రహమిది.


  • మున్సిపాలిటీలో తాగడానికి భూగర్భజలంపై ఆధార పడాల్సి వస్తోంది. కృష్ణా నీటి సరఫరా కోసం రూ.164 కోట్లను గత ప్రభుత్వం మంజూరుచేసి శంకుస్థాపన చేసినా ఈ అయిదేళ్లలోనూ పూర్తి చేయలేకపోయింది.

తిరువూరుకు చెందిన ఓ మెడికల్‌ షాపు యజమాని ఆవేదన.


మ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం (ఎస్సీ రిజర్వుడ్‌) రాజకీయం ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను ఆనుకొని ఉండటం, ఆ జిల్లాలో ఆంధ్రా ప్రాంతవాసులు అధికంగా ఉండటంతో ఇటు ఏపీతోపాటు అటు తెలంగాణలోనూ ఈ నియోజకవర్గం గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఎన్డీయే కూటమి పక్షాన తెదేపా నుంచి అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాసరావు తొలిసారి బరిలో నిలవగా.. ఇటీవల తెదేపా నుంచి వైకాపాలో చేరిన నల్లగట్ల స్వామిదాస్‌ ఆ పార్టీ టికెట్‌ సాధించారు. తెదేపాకు బలమైన కేడర్‌ ఉన్న ఈ నియోజకవర్గంలో గత నాలుగుసార్లు గెలుపు దక్కలేదు. అందులో రెండు సార్లు స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపు తప్పింది. ఇక్కడ 2004 నుంచి తెదేపా జెండా ఎగరలేదు. 2004, 2009లలో కాంగ్రెస్‌, 2014, 2019లలో వైకాపా అభ్యర్థులు గెలిచారు. 2009లో కేవలం 265 ఓట్లు, 2014లో 1676 ఓట్ల తేడాతో తెదేపా ఓటమిపాలైంది. పోయినసారి కూడా 10,835 ఓట్ల వ్యత్యాసంతో తెదేపాకు విజయం దూరమైంది.

2019 ఎన్నికల్లో చిన్నచిన్న పొరపాట్లు, సొంత పార్టీ నేతే వెన్నుపోటు పొడిచారన్న ప్రచారం ఆ పార్టీలో ఉంది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు జెండా ఎగరవేయాలని తెదేపా శ్రేణులు పట్టుదలగా ఉన్నాయి. ఈసారి జనసేన, భాజపా ఓట్లు తమ గెలుపునకు కలిసి వస్తాయని తెదేపా వర్గాలు భావిస్తున్నాయి. గత రెండు మార్లు వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రక్షణనిధికి ఈసారి సీటు దక్కకపోవడంతో ఆయన వైకాపా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియాకుమారి, బీఎస్పీ నుంచి విశ్రాంత అధికారి వందనకుమార్‌ పోటీలో నిలిచారు. అభ్యర్థులు నలుగురూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్థి వల్ల తమ ఓటు బ్యాంకుకు గండిపడుతుందన్న ఆందోళనలో వైకాపా ఉంది.

నియోజకవర్గ కేంద్రం తిరువూరు, మండలకేంద్రం గంపలగూడెం, సూరవరం, రాజీవ్‌నగర్‌, రోలుపడి, చింతలపాడు, తోటమూల తదితర పలు గ్రామాల్లో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటించారు. జగన్‌ సర్కారుపై వ్యాపార, రైతువర్గాలతోపాటు వ్యవసాయ కూలీల ఆగ్రహం పర్యటనలో కనిపించింది. ప్రగతి పనులు చేయకపోవడం, హామీలను నెరవేర్చకపోవడం, ఇంటి, నీటి పన్నులు భారీగా పెంచడం, విద్యుత్తు ఛార్జీల పెంపు భారం తదితర సమస్యలను అధిక శాతం మంది ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నారు. సాగునీరే కాదు.. కనీసం తాగునీరు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విసన్నపేట మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. అయినా వైకాపా నియోజకవర్గ స్థాయి నాయకుల అండదండలతో ఆ పార్టీ నేతలు తవ్వుతూ ట్రాక్టరు ఇసుకను రూ.5 వేలకు విక్రయిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.


ఇప్పటికీ భూగర్భజలమే దిక్కు

గ్రామాలకు సైతం రక్షిత నీరు సరఫరా అవుతున్న పరిస్థితుల్లో నియోజకవర్గ కేంద్రం, మున్సిపాలిటీ అయిన తిరువూరులో తాగడానికి భూగర్భజలమే ఆధారమవుతోంది. ఇక్కడ తాగునీటి సమస్య పరిష్కారానికి ఫెర్రీ నుంచి తిరువూరు వరకు పైపులైన్‌ ద్వారా కృష్ణా జలాలను తరలించే పథకానికి 2017లోనే అప్పటి తెదేపా ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. 2019లో టెండర్లనూ పిలిచి శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పనులు నిలిచాయి. జగన్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత రూ.164 కోట్లతో టెండర్లు పిలిచి గుత్తేదారుకు పనులు అప్పగించారు. అయిదేళ్ల నుంచి పది శాతమూ పనులవలేదు. నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే పనులు నిలిపేశారు. ఫలితంగా పట్టణవాసుల దాహార్తి అందని ద్రాక్షగానే మిగిలింది. తనను గెలిపిస్తే తిరువూరులో ఇంటింటికి కుళాయి కనెక్షన్‌ ఇచ్చి మంచినీరు సరఫరా చేస్తామని కూటమి అభ్యర్థి శ్రీనివాసరావు హామీనిస్తున్నారు.


సీఎం కార్యాలయానికి సమీపంలోనే మరో ఉద్దానం

శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌ సర్కారు.. సీఎం కార్యాలయానికి 80 కి.మీ.దూరంలోని తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరులో ఈ సమస్యపైనే కనీసం దృష్టి పెట్టలేదు. ఇక్కడ అయిదేళ్లలో 250 మందికిపైగా కిడ్నీ బాధితులు మృత్యువాతపడ్డారు. వారిలో అత్యధికులు గిరిజనులే. నా ఎస్సీలు ఎస్టీలంటూ గొంతు చించుకుంటున్న సీఎం జగన్‌.. వారికి రక్షిత నీటిని అందించే ఏ ఒక్క ప్రయత్నమూ చేయలేదు.

భూగర్భజలంలో ఫ్లోరైడ్‌తోపాటు సిలికాన్‌ ఎక్కువగా ఉండి 21 గ్రామపంచాయతీల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారమే రెండు వేల మందికిపైగా కిడ్నీ వ్యాధి బారినపడ్డారు. డయాలసిస్‌ చేయించుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్నవారూ తక్కువేం కాదు. కిడ్నీ బాధితులందరికీ రూ.10 వేల పింఛను ఇస్తామని ప్రతిపక్ష నేతగా హామీలిచ్చిన జగన్‌.. అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే కేవలం డయాలసిస్‌ చేయించుకునే వారికే పింఛను ఇస్తున్నారు. మందులు వాడే వారికి మొండిచేయి చూపారు. పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక కిడ్నీ వ్యాధిగ్రస్తులు మృత్యువుకు దగ్గరవుతున్నారు. ఫలితంగా ఈ నియోజకవర్గం మరో ఉద్దానంలా మారింది. ఫ్లోరైడ్‌, కిడ్నీ ప్రభావిత గిరిజన గ్రామాలకు కృష్ణా జలాలు అందిస్తామన్న జగన్‌ హామీ వట్టిదే అయింది.


బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు లేవు... వంతెన లేదు

నియోజకవర్గంలోని 360 చెరువులను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా మార్చి సాగునీటి కొరత లేకుండా చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీలిచ్చారు. ఇందులో ఏ ఒక్కటీ నెరవేరలేదు. పలు వాగులపై వంతెన నిర్మాణమూ కలగానే మిగిలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపే గంపలగూడెం మండలంలోని కట్లేరు వాగుపై వంతెన లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అయిదేళ్లు నిద్రబోయిన సర్కారు ఇక ఎన్నికలు వస్తున్నాయని ఇటీవల రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చి హడావిడిగా శంకుస్థాపన చేసి చేతులు దులుపుకొంది. పాలిటెక్నిక్‌, ఐటీఐ కళాశాలలను నెలకొల్పుతామని.. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్ల ఏర్పాటు, మిర్చి, మామిడి నిల్వలకు శీతల గిడ్డంగుల నిర్మాణం.. ఇలా జగన్‌ ఇచ్చిన హామీలను ఇప్పుడు ఓటర్లు గుర్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని