Kashi vishwanath Corridor: కాశీలో కొత్త అధ్యాయం

ప్రపంచ చరిత్రలో వారణాసికి ప్రత్యేక స్థానం ఉందని, ఎందరో సుల్తాన్‌లు పుట్టుకొచ్చినా, మట్టిలో కలిసినా ఈ చారిత్రక నగరం మాత్రం చెక్కుచెదరలేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో రూ.339 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథుని

Updated : 14 Dec 2021 05:14 IST

దండయాత్రలను తట్టుకున్న కర్మభూమి ఇది
విశ్వనాథుని నడవాను దేశానికి అంకితం చేసిన ప్రధాని
గంగానదిలో స్నానం.. కాలభైరవ దర్శనం
కార్మికులపై పూలరేకులు జల్లి, వారితో భోజనం చేసిన మోదీ
పడవలో విహారం.. గంగా హారతి వీక్షణ

వారణాసిలోని విశ్వనాథ ఆలయ నడవా ప్రారంభోత్సవ సందర్భంగా గంగా జలంతో గుడికి వెళ్తున్న ప్రధాని మోదీ

వారణాసి, ఈనాడు-లఖ్‌నవూ: ప్రపంచ చరిత్రలో వారణాసికి ప్రత్యేక స్థానం ఉందని, ఎందరో సుల్తాన్‌లు పుట్టుకొచ్చినా, మట్టిలో కలిసినా ఈ చారిత్రక నగరం మాత్రం చెక్కుచెదరలేదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. తన సొంత నియోజకవర్గంలో రూ.339 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథుని నడవా తొలిదశను సోమవారం ఆయన దేశానికి అంకితం చేశారు. కాశీ విశ్వనాథ్‌ మందిర చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, దీన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడం అదృష్టమనీ చెప్పారు. తొలుత గంగానదిలో పుణ్యస్నానం ఆచరించారు. కలశంలో గంగాజలం తీసుకువెళ్లి కాశీ విశ్వనాథుడు, కాలభైరవ ఆలయాల్లో పూజలు చేశారు. నడవా పనుల్లో పాలుపంచుకున్న కార్మికులపై పూలరేకులు జల్లి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. వారితో సహపంక్తి భోజనం చేశారు. సాయంత్రం బ్యాటరీ పడవలో విహరిస్తూ నదీ తీరంలో హారతిని వీక్షించారు. ప్రసంగంలో పలు వ్యాఖ్యలు చేశారు.

కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రధాని మోదీ

నాశనం లేని నగరం వారణాసి  

‘‘ఎందరో ఆక్రమణదారులు వారణాసిపై దండెత్తారు. ధ్వంసం చేయాలని చూశారు. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు, భారత్‌లో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ వంటివారు కాశీపై చేసిన కుట్రలు, దురాగతాలను చరిత్ర చెబుతోంది. ఖడ్గం పట్టుకొని.. వారణాసిని, నాగరికతను మార్చేద్దామనుకున్నా, మత మౌఢ్యంతో సంస్కృతిని అణచివేయాలని చూసినా వారికి సాధ్యం కాలేదు. భారతనేల భిన్నమైంది. ఇక్కడ ఔరంగజేబు వస్తే.. అక్కడ మరాఠా యోధుడు శివాజీ పుట్టుకొచ్చాడు. సలార్‌ మసూద్‌ మనపైకి దండెత్తితే రాజా సుహెల్‌దేవ్‌ మన ఐక్యత బలమేమిటో చాటిచెప్పారు. మన దేశ శక్తి, భక్తి కంటే వినాశకారుల బలం పెద్దది కాదు. కాశీని నాశనం చేద్దామనుకున్నవారు నల్ల పుటలకు పరిమితమైతే కాశీ మాత్రం తన వైభవంపై కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోంది. సాక్షాత్తూ పరమశివుని రక్షణలో ఉన్న ఈ నగరం.. నాశనం లేనిది’’ అని ప్రధాని చెప్పారు.

సనాతన ధర్మానికి ప్రతీక

కాశీ విశ్వనాథ ధామం ఒక భవనం మాత్రమే కాదని, ఇది సనాతన ధర్మానికి, సంస్కృతికి ప్రతీక అని మోదీ అన్నారు. ‘‘తులసీదాస్‌- రామచరిత మానస్‌ను రచించిన ప్రదేశం ఇది. కాశీ విశ్వనాథ ధామం భారతదేశ శక్తికి, చైతన్యానికి చిహ్నం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పురాతన తత్వం, కొత్తదనం రెండూ కనిపిస్తాయి. ఇకపై ఇబ్బందులు లేకుండా మందిరాన్ని దర్శించుకోవచ్చు’’ అని మోదీ చెప్పారు. ఈ అభివృద్ధి పనులు దేశానికి సరికొత్త దిశ, భవితను చూపిస్తాయని చెప్పారు.

గంగానదిలో ప్రధాని పుణ్యస్నానం

గర్వంగా అనిపిస్తుంది

‘ఇక్కడకు రావడం గర్వంగా అనిపిస్తుంది. కాశీ అందరిది. గంగా అందరిది. విశ్వనాథుడి ఆశీస్సులు అందరివి. స్థలం ఇరుకుగా ఉండడంతో కాశీ విశ్వనాథుడిని, గంగాదేవిని దర్శించుకోవడం కష్టంగా ఉండేది. విశ్వనాథ్‌ ధామ్‌ అన్నివిధాలా పూర్తయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం సులభమవుతుంది. 3,000 చదరపు అడుగుల్లో ఉన్న మందిరాన్ని, 5 లక్షల చ.అ.లకు విస్తరించాం. ఇప్పుడు 50 వేల నుంచి 75 వేల మంది మందిరాన్ని దర్శించుకోవచ్చు’ అని మోదీ చెప్పారు. నగరం మార్పు చెందిన ప్రతిసారీ దేశ అదృష్టం కూడా మారుతోందన్నారు. ప్రసంగం మధ్యలో పలుమార్లు ‘హరహర మహాదేవ’ అని ఆయన నినదించారు.

మహాత్ముని కల నెరవేరింది: ఆదిత్యనాథ్‌

యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ- మహత్తరమైన కాశీ విశ్వనాథ్‌ ధామ్‌ కోసం మహాత్మా గాంధీ కన్న కల మోదీ నాయకత్వంలో సాకారమైందని పేర్కొన్నారు. వందేళ్ల క్రితం కాశీలో ఇరుకిరుకు వీధులు, మురికి ఆవరించిన పరిస్థితులపై గాంధీ ఆవేదన చెందారని చెప్పారు.


కార్మికులతో కలిసి ప్రధాని భోజనం

కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగస్వామ్యులైన కార్మికులతో మోదీ కలగలిసిపోయారు. సాధారణ పౌరుడిలా వారిమధ్య కూర్చొని భోజనం చేశారు. వారితో కాసేపు ముచ్చటించారు. కరోనాకు కూడా వెరవక వారు ఏకధాటిగా పనులు కొనసాగించారని ప్రశంసించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా మోదీ వెంట ఉన్నారు. ఆ తర్వాత.. ఇద్దరూ పడవలో విహరించారు. నడవా పనులను పరిశీలించారు. అంతకుముందు కార్మికులపై పూరేకుల వర్షం కురిపించిన మోదీ.. వారితో కలిసి బృంద చిత్రం తీసుకున్నారు. పర్యటన మధ్యలో ఒకచోట స్థానికుడొకరు ‘పీతాంబరి’ (కాషాయ అంగవస్త్రం) ఇవ్వబోగా ఎస్పీజీ బలగాలు పక్కకు నెట్టేసే ప్రయత్నం చేశాయి. ఆ వ్యక్తిని గమనించిన మోదీ తన దగ్గరకు పిలిపించి చిరునవ్వుతో నమస్కరిస్తూ దానిని స్వీకరించారు. కాసేపు వారణాసి వీధుల్లోనూ ఆయన నడిచారు. గంగా హారతి సందర్భంగా దీపాల కాంతుల్లో గంగా ఘాట్‌ మెరిసిపోయింది. యాత్రికుల సౌకర్యం కోసం నిర్మించిన 23 భవనాలు సోమవారం అందుబాటులోకి వచ్చాయి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని