OneWeb: ‘వన్‌ వెబ్‌’.. ఓ పెనుమార్పు..!

ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న ఓ సంస్థను భారతీయ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్‌

Updated : 30 Jun 2021 14:52 IST

 కొత్త టెక్నాలజీ వైపు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అడుగులు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న ఓ సంస్థను భారతీయ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్‌ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్‌లైన్‌ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్‌ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు.. అదే ‘వన్‌వెబ్‌’..! దానిని కొనుగోలు చేసిన కంపెనీ పేరు భారతీ ఎంటర్‌ ప్రైజెస్‌‌..!!

అసలు ఏమిటీ ప్రాజెక్ట్‌..?

ప్రపంచంలో అన్ని భౌగోళిక ప్రదేశాలు ఒకేలా ఉండవు. కొన్ని ప్రాంతాలు దుర్భేద్యంగా ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు కేబుల్స్‌ వేయడం, టవర్లు నిర్మించడం అత్యంత ఖర్చుతో కూడుకొన్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్‌ సేవలు అందించనున్నారు. ఇందుకోసం తొలి దశలో 150 కిలోల బరువున్న 648 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 218 ఉపగ్రహాలు కక్ష్యను చేరుకొన్నాయి. ఒక్క 2021 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మొత్తం108 ఉపగ్రహాలను ప్రయోగించారు. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది.  ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌ స్పేస్‌ కంపెనీ రష్యా సోయజ్‌ రాకెట్ల సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేరుస్తోంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. 

వీటిని భూమికి 1,200 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌’లో మోహరిస్తున్నారు. వాస్తవానికి కమ్యూనికేషన్ల కోసం వాడే జియో స్టేషనరీ ఉపగ్రహాలు దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అందుకే వీటి సంకేతాలు భూమికి చేరే సరికి స్వల్ప జాప్యం(లేటెన్సీ) ఉంటుంది. ఇది యుద్ధక్షేత్రాలు, ఆన్‌లైన్‌లో శస్త్రచికిత్సలు వంటి సున్నితమైన సమయాల్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. కానీ, వన్‌వెబ్‌ ఉపగ్రహాలు 1,200 కిలోమీటర్ల ఎత్తులో ఉండటంతో ఈ జాప్యాన్ని నివారిస్తాయి. ఈ ఉపగ్రహాల నుంచి వచ్చే సంకేతాలను రిసీవ్‌ చేసుకోవడానికి కస్టమర్ల వద్ద యాంటీనా వంటి పరికరాన్ని అమరుస్తారు. ఇవి వినియోగదారుల అవసరాలను బట్టి వేర్వేరు సైజుల్లో ఉంటాయి. దీంతో నౌకలు, విమానాలు, దీవులు, పర్వతాలు, దట్టమైన అడవుల్లో నిరంతరాయంగా ఇంటర్నెట్‌ సేవలు అందించడం సాధ్యమవుతుంది.

దివాలా కంపెనీకి జీవం నింపిన భారతీ..!

లండన్‌ కేంద్రంగా పనిచేసే వన్‌వెబ్‌ కంపెనీని 2012లో  జార్జివేలర్‌ అనే వ్యక్తి  స్థాపించాడు. కానీ, తీవ్రమైన ఆర్థిక సమస్యలు తలెత్తడంతో 85శాతం మంది ఉద్యోగులను తొలగించేశారు. ఆ తర్వాత 2020 మార్చిలో దివాలా తీసినట్లు ప్రకటించారు. కానీ, ఈ సృజనాత్మక ప్రాజెక్టును మరుగున పడనీయకూడదని బ్రిటన్‌ ప్రభుత్వం భావించింది. దీంతో ఆ కంపెనీలోకి ఇన్వెస్టర్లను తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో భారతీ ఎంటర్‌ ప్రైజెస్‌ 38.6 శాతం వాటా కొనుగోలు చేయగా.. బ్రిటన్‌ ప్రభుత్వం 19శాతం వాటాను దక్కించుకుంది. ఈ డీల్‌ కోసం 500 మిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు  గతేడాది భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది. నియంత్రణ సంస్థల అనుమతులు వస్తే 2021 ద్వితీయార్ధానికి ఈ డీల్‌ పూర్తికానుంది.  2022లో ఈ కంపెనీ భారత్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

స్టార్‌లింక్‌తో పోటీ..!

స్పేస్‌ఎక్స్‌కు చెందిన ‘స్టార్‌లింక్‌’తో వన్‌వెబ్‌కు పోటీ ఉంది. ఇప్పటికే స్టార్‌లింక్‌ దాదాపు 1,385 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇవి కూడా లోఎర్త్‌ ఆర్బిట్‌లో ఉండటంతో వన్‌వెబ్‌ ఉపగ్రహాలకు ప్రమాదకరంగా మారాయి. దీనిపై ఇరు పక్షాలు న్యాయపోరాటం చేశాయి. చివరికి స్టార్‌లింక్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పటికే స్టార్‌లింక్‌ 500 డాలర్లకు యాంటీనా, ప్రతినెలా 99 డాలర్ల సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు నిర్ణయించింది. మరోపక్క రష్యాకు చెందిన పాతకాలం నాటి సోయజ్‌ రాకెట్లను వన్‌వెబ్‌ వాడుతుండటతో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటోంది. అదే స్టార్‌ లింక్‌కు స్పేస్‌ఎక్స్‌ అభివృద్ధి చేసిన కొత్త రాకెట్లు వాడుతున్నారు. అమెజాన్‌ కూడా క్యూపర్‌ పేరుతో ఇటువంటి ప్రాజెక్టే చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని