LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనాలనుకునే పాలసీదారులకు ముఖ్య గమనిక!

ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనాలనుకునే పాలసీదారుల కోసం ఆ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది...

Updated : 01 Dec 2021 20:24 IST

దిల్లీ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ప్రభుత్వం, అందుకోసం తగిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. ఐపీఓ పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదార్లకు కేటాయించ తలపెట్టిన నేపథ్యంలో బుధవారం కీలక ప్రకటన జారీ చేసింది. ఐపీఓలో పాల్గొనాలనుకునేవారు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌-PAN)ను అప్‌డేట్‌ చేయాలని కోరింది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ కోసం డీమాట్‌ ఖాతాను సైతం కలిగి ఉండాలని గుర్తుచేసింది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటనలు కూడా ఇస్తున్నామని తెలిపింది. పాన్‌ను పొందడం, డీమాట్‌ ఖాతాను ప్రారంభించడానికి అయ్యే ఖర్చులను పాలసీదారులే భరించాలని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది.

ఎల్‌ఐసీ ఐపీఓకి వీలుగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ చట్టానికి ఇప్పటికే కొన్ని మార్పులు చేశారు. అవన్నీ జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చినట్లు గతంలో నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి అనువుగా, లిస్టింగ్‌ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనుంది. దీంతోపాటు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవీ విరమణ వయసు నిబంధనలనూ సవరించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరేందుకు ఎల్‌ఐసీ ఐపీఓని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.25,000 కోట్లను సమీకరించేందుకు రూ.10 ముఖ విలువతో 2,500 కోట్ల షేర్లను ఎల్‌ఐసీ జారీ చేయనుందని సమాచారం. ఒకసారి మార్కెట్లో లిస్ట్‌ అయిన తర్వాత మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా రూ.8-10 లక్షల కోట్ల విలువైన కంపెనీగా అవతరించనుంది. ఈ సంస్థ నిర్వహణలో ప్రస్తుతం దాదాపు రూ.32 లక్షల కోట్ల ఆస్తులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని