తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద కవరేజ్ గురించి మీకు తెలుసా?

బీమా సంస్థలు సవరించిన పాలసీలను తక్షణం జారీ చేయడం ప్రారంభించవచ్చు

Published : 22 Dec 2020 15:25 IST

ద్విచక్ర, నాలుగు చక్రాల ప్రైవేటు వాహన యజమానులు, వారి ప్రస్తుత పాలసీని పునరుద్ధరించుకోవడం లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో మోటారు బీమా ప్రీమియం కోసం మరింత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ పర్సనల్ యాక్సిడెంట్ (సీపీఏ) కవర్ ప్రీమియం సంవత్సరానికి రూ. 750 లకు పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్రీమియం ద్విచక్ర వాహనాలకు రూ. 50, అలాగే నాలుగు చక్రాల వాహనాలకు రూ. 100గా ఉంది. ప్రీమియం పెరుగుదల అనేది సీపీఏ కవర్ పెరుగుదల ఆధారంగా ఉంటుంది. ఇది ద్విచక్ర వాహనాలకు రూ. లక్ష రూపాయలు, అలాగే నాలుగు చక్రాల వాహనాలకు రూ. 2 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెరిగింది. దీనికి సంబంధించిన ప్రకటనను సెప్టెంబర్ 20న ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) జారీ చేసింది.

బీమా సంస్థలు సవరించిన పాలసీలను తక్షణం జారీ చేయడం ప్రారంభించవచ్చు.

డ్రైవింగ్ చేసే వాహన యజమానుల కోసం సీపీఏ కవర్ కింద రూ. 15 లక్షల కనీస క్యాపిటల్ హామీ బీమా (సీఎస్ఐ) ను అందిస్తారు, సెక్షన్ III ప్యాకేజీ పాలసీల కింద అన్ని రకాల వాహనాలకు సంవత్సరానికి రూ. 750 ప్రీమియం రేటు వర్తిస్తుంది. తదుపరి నోటీసు విడుదల అయ్యే వరకు ఈ రేటు చెల్లుతుందని ఐఆర్డీఏఐ తెలిపింది.

తప్పనిసరి ప్రమాద కవర్ అంటే ఏమిటి?

డ్రైవింగ్ చేసే వాహన యజమానుల కోసం తప్పనిసరి వ్యక్తిగత ప్రమాదం కవర్ ను 2002లో ప్రవేశపెట్టారు. ఇది ఒక వ్యక్తి పేరుతో నమోదు చేసిన వాహనాలకు వర్తిస్తుంది. ఈ కవర్ ను ఇప్పుడు రూ. 15 లక్షలకు పెంచారు. బైకులు, కార్లను నడిపే సమయంలో జరిగే ప్రమాదాల కారణంగా నష్టపోయిన వారికి ఈ మొత్తం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఏస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ హెడ్ పునీత్ సాహ్ని తెలిపారు.

ఈ ప్రీమియంను థర్డ్ పార్టీ ప్రీమియంలో భాగంగా సేకరిస్తారు. ఇది తప్పనిసరి. మోటార్ బీమాలోని మరొక రకం వాహన నష్టం, ఇది ఆప్షనల్గా ఉంటుంది. ఒక సమగ్ర మోటార్ బీమాలో వాహన నష్టం, థర్డ్ పార్టీ, సీపీఏ కవర్ మూడింటినీ కలిగి ఉంటుంది.

బీమా సంస్థలు కూడా అధిక ప్రీమియం కోసం సీపీఏ కింద అధిక హామీ మొత్తాన్ని (రూ. లక్ష లేదా రూ.5 లక్షల గుణకాలలో) అందిస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు ఈ ఆప్షన్ లను వినియోగదారులకు యాడ్-ఆన్ కవర్ల ద్వారా అందిస్తున్నాయని రెగ్యులేటరీ తెలిపింది.

ఈ ప్రకటన రాక ముందు రూ. 2 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అదనపు వ్యక్తిగత ప్రమాద కవర్ ను యాడ్-ఆన్ కవర్ లా అందించాము. కానీ కొంతమంది మాత్రమే రూ. 50 లక్షల బీమా కవరేజ్ తీసుకున్నారు. చాలా మంది రూ. 10 లక్షల వరకు మాత్రమే తీసుకునేవారని సాహిని తెలిపారు.

అదనపు ప్రీమియం ఛార్జ్ అనేది హామీ మొత్తంలో 0.05 శాతంగా ఉంటుంది, ఇది ఐఆర్డీఏఐ ఫిక్స్ చేసినదానికి సమానమని సాహిని తెలిపారు.

బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తపన్ సింగ్హెల్ మాట్లాడుతూ, ఈ చర్య సరైనది. ఒకవేళ పాలసీదారుడు ప్రమాదానికి గురై, గాయపడినా లేదా వైకల్యానికి గురైన సందర్భాల్లో పాలసీదారుడికి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగత ప్రమాద కవరేజ్ అందిస్తుందని తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో వాహన యజమాని డ్రైవింగ్ చేయకుండా ప్రయాణికుల సీటులో కూర్చున్నప్పటికీ, పాలసీ కవరేజ్ లభిస్తుంది. ప్రమాదం కారణంగా వైకల్యం లేదా మరణం సంభవించినట్లైతే హామీ ఇచ్చిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తారని పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్-జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ తరుణ్ మాథుర్ తెలిపారు. సాధారణంగా వినియోగదారులు కారు బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, వారి దృష్టి మొత్తం కారు వైపే ఉంటుంది. ఒకవేళ మీరు కేవలం థర్డ్ పార్టీ బీమాని కొనుగోలు చేస్తే, సీపీఏ కవరేజ్ తప్పనిసరిగా అందుబాటులో ఉంటుంది, అందుకే ప్రజలు దాని గురించి పెద్దగా పెట్టించుకోరని మాథుర్ తెలిపారు.

సీపీఏ కవరేజ్ ఉపయోగం పరిమితంగా ఉండడం వలన, వినియోగదారులు అదనపు సీపీఏ కవర్ ను కొనుగోలు చేయడానికి బదులుగా, ప్రత్యేక టర్మ్ జీవిత బీమా లేదా వ్యక్తిగత ప్రమాద కవరేజ్ కోసం ఎంపిక చేసుకోవాలని మాథుర్ తెలిపారు. ప్రజలు కేవలం కారు ప్రమాదాలకు మాత్రమే కాకుండా అన్ని రకాల ప్రమాదాలకు కవరేజ్ ఉండాలని కోరుకుంటారని మాథుర్ తెలిపారు.

ఖర్చు పెరుగుతుందా?

ఇకపై వినియోగదారులు సీపీఏ కవర్ ను దీర్ఘ కాలం పాటు కొనుగోలు చేయవలసి ఉంటుంది. దీర్ఘకాలిక థర్డ్ పార్టీ కవర్ తో పాటు నాలుగు చక్రాల వాహనాల కోసం మూడు సంవత్సరాలు, అలాగే ద్విచక్ర వాహనాల కోసం ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఇలా చేయడం ద్వారా ధర పెరుగుతుంది.
ధర పెరగడం నిజమే, కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినట్లయితే, ఈ కవరేజ్ వినియోగదారుడికి రక్షణగా ఉంటుందని సాహినీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని