కొవిషీల్డ్‌ ఎగుమతులు మళ్లీ ప్రారంభం

కొవిడ్‌-19 టీకా ‘కొవిషీల్డ్‌’ ఎగుమతులను మళ్లీ ప్రారంభించినట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) శుక్రవారం వెల్లడించింది. కొవ్యాక్స్‌ కార్యక్రమం కింద తక్కువ, మధ్య ఆదాచ దేశాలకు

Published : 27 Nov 2021 03:41 IST

దిల్లీ: కొవిడ్‌-19 టీకా ‘కొవిషీల్డ్‌’ ఎగుమతులను మళ్లీ ప్రారంభించినట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) శుక్రవారం వెల్లడించింది. కొవ్యాక్స్‌ కార్యక్రమం కింద తక్కువ, మధ్య ఆదాచ దేశాలకు కొవిషీల్డ్‌ టీకాలను పుణె ప్లాంటు నుంచి పంపించామని పేర్కొంది. 2022 తొలి త్రైమాసికం నుంచి కొవ్యాక్స్‌ కింద టీకాల సరఫరా మరింతగా పెరుగుతుందని తెలిపింది. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొవిడ్‌-19 టీకా ఎగుమతులను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం నిలిపేసింది. ఇప్పటివరకు 125 కోట్ల టీకా డోసులను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసింది. ఈ ఏడాది ఆఖరుకు 100 కోట్ల డోసులు తయారు చేయాలన్న లక్ష్యాన్ని ముందుగానే సాధించామని కంపెనీ తెలిపింది. పుణె ప్లాంటు సామర్థ్యాన్ని వేగంగా విస్తరించడం ఇందుకు దోహదం చేసిందని పేర్కొంది. కొవ్యాక్స్‌ కింద తక్కువ ఆదాయమున్న 92 దేశాలకు టీకాలను ఎస్‌ఐఐ సరఫరా చేయనుంది. దేశాలన్నింటికీ కొవిడ్‌-19 టీకాలను అందించాలనే ఉద్దేశంతో గ్లోబల్‌ వ్యాక్సిన్‌ అలయెన్స్‌ (గవి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), కొలిషన్‌ ఫర్‌ ఎపెడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌ (సీఈపీఐ)లు కొవ్యాక్స్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. ‘మన దేశం ఎగుమతి చేసే అత్యున్నత నాణ్యత, తక్కువ ధరతో కూడిన ఔషధాలు, టీకాలపై ప్రపంచం ఎంతగానో ఆధారపడి ఉంద’ని ఎస్‌ఐఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అదర్‌ పూనావాలా తెలిపారు. ఇతర కంపెనీల కొవిడ్‌ టీకాల ఉత్పత్తినీ ఎస్‌ఐఐ చేపట్టనుంది. అమెరికాకు చెందిన నొవావ్యాక్స్‌ టీకా కొవొవ్యాక్స్‌ ఇందులో ఒకటి. ఈ టీకాకు ఇండోనేషియా, ఫిలిప్పిన్స్‌ దేశాల ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అత్యవసర వినియోగం నిమిత్తం ఈ నెలలోనే అనుమతులు లభించాయి. భారత్‌, డబ్ల్యూహెచ్‌ఓ నుంచి నియంత్రణపరమైన సమీక్షలు ఇంకా రాలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ నియంత్రణ సంస్థల వద్ద ఈ టీకాకు అనుమతుల కోసం, ఆ టీకాను అభివృద్ధి చేసిన నొవావ్యాక్స్‌ దరఖాస్తులు పెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని