
శ్రేయీ రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కారం
డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ
దిల్లీ: మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కోసం విజన్ ఇండియా ఫండ్- శ్రేయీ మల్టీపుల్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఇచ్చిన రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదిస్తూ ఎన్‌సీఎల్‌టీ తీసుకున్న నిర్ణయాన్ని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) పక్కనపెట్టింది. రుణదాతలకు నిధుల కేటాయింపులో వివక్ష చోటుచేసుకుందని ఎన్‌సీఎల్‌ఏటీ అభిప్రాయపడింది. 2019 జూన్ 3న శ్రేయీ బిడ్‌ను ఆమోదిస్తూ ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు చట్టప్రకారం చెల్లవని ఇద్దరు సభ్యులతో కూడిన ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ పేర్కొంది. ఈ అంశాన్ని డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రుణదాతల కమిటీ (సీఓసీ)కి వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపింది. 2016 ఐబీబీఐ నిబంధనల ప్రకారం రుణ పరిష్కార మొత్తాన్ని సమానంగా పంపిణీ చేయాల్సిందిగా సీఓసీని అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఐడీబీఐ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఎన్‌సీఎల్‌ఏటీ తాజా ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 37 మంది రుణదాతలకు డెక్కన్ క్రానికల్ రూ.8180 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం.. రుణదాతలకు రూ.350 కోట్ల నగదు ఆఫర్ చేశారు.