42% పెరిగిన కిమ్స్‌ హాస్పిటల్స్‌ లాభం

కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ. 380.5 కోట్ల ఆదాయాన్ని, రూ.83.3 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Updated : 20 May 2022 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ. 380.5 కోట్ల ఆదాయాన్ని, రూ.83.3 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.10.08గా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.362.7 కోట్లు, నికరలాభం రూ.58.6 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 5 శాతం, నికరలాభం 42 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) పూర్తికాలానికి కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆదాయం రూ.1671 కోట్లు ఉండగా, దీనిపై రూ.343 కోట్ల నికరలాభం,   రూ.41.88 ఈపీఎస్‌ నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయం 25 శాతం, నికరలాభం 67 శాతం పెరిగాయి. 

నూతన శస్త్రచికిత్సలు ప్రారంభం: గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో రకాల సవాళ్లు ఎదురైనప్పటికీ, మెరుగైన పనితీరు నమోదు చేసినట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ బి.భాస్కరరావు అన్నారు. కొవిడ్‌ ముప్పు తగ్గినందున, అన్ని రకాల వైద్య చికిత్సలు అందించేందుకు వీలు కలుగుతోందని పేర్కొన్నారు. కొత్తగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు, అధునాతన గ్యాస్ట్రోఎంటరాలజీ ఆపరేషన్లు, కాలేయ మార్పిడి చికిత్సలు చేయడం మొదలుపెట్టామని, ఇందువల్ల మరింతమంది రోగులకు సేవలు అందించే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని, ఇటీవల కొనుగోలు చేసిన సన్‌షైన్‌ హాస్పిటల్స్‌కు తోడు కొత్త ఆసుపత్రుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో, సమీప భవిష్యత్తులో వైద్యసేవల రంగంలో అత్యంత క్రియాశీలక సంస్థగా ఎదిగే అవకాశం కిమ్స్‌ హాస్పిటల్స్‌కు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని