గోధుమల ఎగుమతులపై ఆంక్షల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఉండదు

గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర వాణిజ్య,

Updated : 26 May 2022 03:24 IST

 మంత్రి పీయూశ్‌ గోయల్‌

దిల్లీ: గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత గోధుమల ఎగుమతుల వాటా 1 శాతం కంటే తక్కువగా ఉంటుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. పేద, పొరుగు దేశాలకు ఎగుమతులు కొనసాగుతాయని చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు భారత్‌ గోధుమలను ఎగుమతే చేయలేదని గోయల్‌ వెల్లడించారు. 2 మిలియన్‌ టన్నులతో భారత్‌ ఎగుమతులు ప్రారంభించిందని, కిందటేడాది 7 మిలియన్‌ టన్నుల గోధుమలను ఎగుమతి చేసినట్లు తెలిపారు. ‘గోధుమల ఉత్పత్తి 7- 8 శాతం మేర పెరగొచ్చని మేం అంచనా వేశాం. కానీ ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వేడి గాలుల కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడింద’ని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడుతూ గోయల్‌ వెల్లడించారు. దేశీయంగా అధిక ధరలను నియంత్రించే ఉద్దేశంతో గోధుమల ఎగుమతులపై మే 13న ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.


అభివృద్ధి చెందిన దేశాలు 2024 కల్లా పుంజుకుంటాయ్‌

ఐఎమ్‌ఎఫ్‌ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్‌

దావోస్‌: అభివృద్ధి చెందిన దేశాలు 2024 కల్లా గాడిలో పడతాయని.. అయితే వర్థమాన దేశాలు మాత్రం తాము ఉండాల్సిన స్థాయి కంటే 5 శాతం వెనకబడి ఉండొచ్చని ఐఎమ్‌ఎఫ్‌ తొలి డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై కరోనా పరిణామాలు తీవ్ర ప్రభావం చూపగా.. నెమ్మదిగా రికవరీ బాట పడుతున్నాయి. అంతర్జాతీయ రికవరీకి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం పెద్ద అడ్డంకిగా మారిందని ‘ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం 2022’లో జరిగిన ‘వాట్‌ నెక్స్ట్‌ ఫర్‌ గ్లోబల్‌ గ్రోత్‌’ అనే ప్రత్యేక సదస్సులో ఆమె అన్నారు. ‘అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలను బాగా తగ్గించాల్సి వచ్చింది. జీవన వ్యయాల కారణంగా ప్రపంచం ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. అన్ని దేశాల్లోనూ ఇంధన, ఆహార ధరలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయ’ని గోపీనాథ్‌ అన్నారు. ‘ఈ అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇందువల్ల అంతర్జాతీయ ఆర్థికం, వాణిజ్యంపై ప్రభావం పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా రికవరీ స్థాయి వివిధ రకాలుగా ఉండొచ్చు. కరోనా లేని పక్షంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ 2024 కల్లా సాధారణ స్థాయికి చేరతాయని మా అంచనా. అయితే వర్థమాన దేశాలు మాత్రమే సాధారణ స్థాయి కంటే 5 శాతం దిగువన ఉండొచ్చ’ని అన్నారు.


82% తగ్గిన బీపీసీఎల్‌ లాభం

దిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,130.53 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.11,940.13 కోట్లతో పోలిస్తే ఇది 82 శాతం తక్కువ. అధిక చమురు ధరలతో కార్యకలాపాల ఆదాయం 25 శాతం పెరిగి రూ.1.23 లక్షల కోట్లకు చేరింది. బీపీసీఎల్‌తో పాటు ఇతర ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు చాలా రోజుల పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచకపోవడం, ఇదే సమయంలో ముడి చమురు ధరలు 14 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరడంతో లాభాలపై ప్రభావం పడింది. జనవరి-మార్చి త్రైమాసికంలో 8.12 మిలియన్‌ టన్నుల ముడి చమురును శుద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 8.39 మి.టన్నులను శుద్ధి చేసింది. విక్రయాలు 11.17 మి.టన్నుల నుంచి 11.82 మి.టన్నులకు చేరాయి. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బీపీసీఎల్‌ నికర లాభం రూ.9,076.50 కోట్లకు తగ్గింది. 2020-21 నికరలాభం రూ.19,110.06 కోట్లు. ప్రతి బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా బీపీసీఎల్‌ 9.09 డాలర్లను ఆర్జించింది. 2021-22లో ఇది 4.06 డాలర్లు మాత్రమే.


హలాకు రూ.7.7 కోట్ల పెట్టుబడులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ వాహనాలను అద్దెకు తీసుకునే సేవలు అందిస్తున్న హైదరాబాదీ సంస్థ హలా రూ.7.7 కోట్ల నిధులను సమకూర్చుకుంది. మాగ్నిఫిక్‌ సెక్యూరిటీస్‌ ఈ మొత్తాన్ని అందించినట్లు సంస్థ వెల్లడించింది. విద్యుత్‌ వాహనాల సంఖ్యను 5 రెట్లు పెంచేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. విద్యుత్‌ వాహనాల వినియోగం పెంచడంతో పాటు, అవసరమైన వారికి వీటిని మరింత సులువుగా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టి-హబ్‌ సీఈఓ ఎంఎస్‌ఆర్‌ మాట్లాడుతూ.. షేర్డ్‌ మొబిలిటీ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. టి-ఏంజిల్‌ స్టార్టప్‌ కీలకమైన పెట్టుబడులను సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.


విజ్‌క్లబ్‌ను కొనుగోలు చేసిన ఇన్ఫినిటీ లెర్న్‌

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన ఎడ్యుటెక్‌ సంస్థ ఇన్ఫినిటీ లెర్న్‌ 6-14 ఏళ్ల పిల్లలకు నైపుణ్యాలను నేర్పించే అంకుర సంస్థ విజ్‌క్లబ్‌ను స్వాధీనం చేసుకుంది. దీనికోసం రూ.77 కోట్లు వెచ్చించింది. ఈ కొనుగోలు ద్వారా ఇన్ఫినిటీ ఫ్యూచర్జ్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టీచర్‌, డోంట్‌ మెమొరైజ్‌లను  ఇన్ఫినిటీ లెర్న్‌ స్వాధీనం చేసుకుంది. 21వ శతాబ్దపు నైపుణ్యాలతో ప్రతి విద్యార్థినీ సిద్ధం చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఇన్ఫినిటీ లెర్న్‌ ఫౌండర్‌ డైరెక్టర్‌ సుష్మా బొప్పన పేర్కొన్నారు. విజ్‌క్లబ్‌ బృందం మా సంస్థలో చేరడం ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.


‘ గ్లాటిరామర్‌ ఎసిటేట్‌’పై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన  జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మొమెంటా ఫార్మా  

ఈనాడు, హైదరాబాద్‌: నాట్కో ఫార్మాతో పాటు యూఎస్‌లో ఈ సంస్థకు మార్కెటింగ్‌ భాగస్వామిగా వ్యవహరించిన మైలాన్‌ ఫార్మాస్యూటికల్స్‌పై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మొమెంటా ఫార్మా న్యాయస్థానంలో కేసు వేశాయి. మల్టిపుల్‌ స్కెలరోసిస్‌ వ్యాధికి చికిత్సలో వినియోగించే గ్లాటిరామర్‌ ఎసిటేట్‌ అనే ఇంజెక్షన్‌కు సంబంధించి తమకు చెందిన రెండు పాత పేటెంట్లను నాట్కో ఫార్మా, మైలాన్‌ ఉల్లంఘించినట్లు ఆ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై యూఎస్‌లోని పెన్సిల్వేనియా ఫెడరల్‌ కోర్టులో కేసు దాఖలు చేశాయి. ఈ ఆరోపణలో పస లేదని నాట్కో ఫార్మా, మైలాన్‌ కొట్టివేస్తున్నాయి. ఈ ఔషధం గత అయిదేళ్లుగా మార్కెట్లో ఉండగా, ఇప్పుడు కేసు వేయటం ఏమిటని నాట్కో, మైలాన్‌ అభిప్రాయపడ్డాయి. న్యాయస్థానంలో దీన్ని ఎదిరిస్తామని పేర్కొన్నాయి.


2 బ్యాంకుల ప్రైవేటీకరణపై ముందుకే

 రాబోయే నెలల్లో చర్యలు!

దిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ముందడుగు వేయనుందని.. రాబోయే నెలల్లో అందుకు తగ్గట్లు చర్యలు చేపట్టగలదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాదిలో రెండు పీఎస్‌బీల ప్రైవేటీకరణను చేపట్టనున్నట్లు 2021-22 బడ్జెట్‌లో కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణకు తోడు బీపీసీఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ కూడా జరుగుతుందని.. తాజాగా బిడ్లు పిలుస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీపీసీఎల్‌లో వాటా విక్రయానికి ఒక బిడ్డరు మాత్రమే రావడంతో, గతంలో నిర్వహించే ప్రక్రియ రద్దు దిశగా నడుస్తున్న సంగతి తెలిసిందే. బీపీసీఎల్‌లో ప్రభుత్వం తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడం కోసం మార్చి 2020న బిడ్డర్లకు ఆహ్వానం పలికింది. నవంబరు 2020 కల్లా మూడు బిడ్లు దాఖలైనా.. రెండు ఉపసంహరించారు. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాన్‌కర్‌)లో వ్యూహాత్మక అమ్మకం విషయంలో కొన్ని సమస్యలున్నాయని.. అవి పరిష్కారమయ్యాక విక్రయ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ వర్గాల సమాచారం. కాన్‌కర్‌లో ప్రభుత్వానికి 54.80 శాతం వాటా ఉండగా.. 30.8 శాతం అమ్మకానికి నవంబరు 2019న కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రెండు బ్యాంకులు, ఒక బీమా కంపెనీని ప్రైవేటీకరించాలని నీతిఆయోగ్‌ ఇప్పటికే కోర్‌ గ్రూప్‌ ఆఫ్‌ సెక్రటరీస్‌కు సూచించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లను ప్రైవేటీకరణ చేయొచ్చు. జరగాల్సిన ప్రక్రియ ప్రకారం.. ప్రత్యామ్నాయ వ్యవస్థ(ఏఎమ్‌)కు తమ సిఫారసులను కోర్‌ గ్రూప్‌ ఆఫ్‌ సెక్రటరీస్‌ పంపనుంది. తుది ఆమోదానికి ప్రధాని ఆధ్వర్యంలోని కేబినెట్‌కు పంపుతారు.


‘పెట్రో’ రాబడి తగ్గినా సరే..

 ద్రవ్యలోటు అదుపునకు అదనపు అప్పులేమీ తీసుకోవట్లేదు!

 అధికార వర్గాల వెల్లడి

దిల్లీ: అదనపు రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు రచించడం లేదని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించుకున్న రుణ లక్ష్యానికే కట్టుబడి ఉండనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇతర వస్తువులపై సుంకం తగ్గింపుల వల్ల ఆదాయాన్ని కోల్పోయినా సరే అదనపు రుణాలేవీ తీసుకోకపోవచ్చని బుధవారం ఆ వర్గాలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ప్రభుత్వం గత వారం లీటరు పెట్రోలుపై రూ.8; డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. సబ్సిడీ ఎల్‌పీజీ ధరను పేదలకు రూ.200 చొప్పున తగ్గించింది. పెట్రోలు, డీజిల్‌పై పన్ను తగ్గింపు వల్ల ఏడాదికి రూ.లక్ష కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లనుంది. మరో వైపు బడ్జెట్‌ (ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి)లో ఎరువుల సబ్సిడీ రూ.1.05 లక్షల కోట్లతో పాటు; పెరిగిన ధరల నేపథ్యంలో అదనంగా రూ.1.10 లక్షల కోట్లను ప్రభుత్వం రైతులకు సబ్సిడీగా అందించనుంది. ఈ ప్రోత్సాహకాల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యమైన 6.4 శాతాన్ని సాధించడం కోసం ప్రభుత్వం అదనపు రుణాలు తీసుకోవాల్సి వస్తుందన్న భయాలు కలిగాయి. అయితే అధికార వర్గాలు వాటిని కొట్టిపారేశాయి.


డబ్ల్యూటీఓ కమిటీ ఛైర్‌గా అన్వర్‌ హుస్సేన్‌ షేక్‌

దిల్లీ: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ట్రేడ్‌ టెక్నికల్‌ బ్యారియర్స్‌ కమిటీ కొత్త ఛైర్‌గా అన్వర్‌ హుస్సేన్‌ షేక్‌ నియమితులయ్యారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఒక భారత ప్రభుత్వ అధికారి డబ్ల్యూటీఓ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. మెక్సికోకు చెందిన ఎలీసా మరియా ఒల్మెడా డీ అలెజాండ్రో స్థానాన్ని అన్వర్‌ హుస్సేన్‌ భర్తీ చేయనున్నారు. వాణిజ్యానికి సంబంధించిన సాంకేతిక నిబంధనలు, ప్రమాణాలు, ఇతర అంశాలను ట్రేడ్‌ టెక్నికల్‌ బ్యారియర్స్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది. డబ్ల్యూటీఓలో 164 సభ్య దేశాలు ఉండగా.. భారత్‌ 1995 నుంచి సభ్యదేశంగా కొనసాగుతోంది.


పీఎఫ్‌సీ లాభంలో 10% వృద్ధి

దిల్లీ: ప్రభుత్వ రంగ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ జనవరి- మార్చిలో ఏకీకృత ప్రాతిపదికన రూ.4,295.90 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం  రూ.3,906.05 కోట్లతో పోలిస్తే ఈసారి 10 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం కూడా రూ.18,155.14 కోట్ల నుంచి రూ.18,873.55 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2021-22) నికర లాభం రూ.18,768.21 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సర లాభం రూ.15,716.20 కోట్లే. మొత్తం ఆదాయం కూడా రూ.71,700.67 కోట్ల నుంచి పెరిగి రూ.76,344.92 కోట్లకు చేరింది. నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.09 శాతం నుంచి 1.76 శాతానికి తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.1.25ను తుది డివిడెండుగా కంపెనీ ప్రకటించింది.


జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ ఆలస్యం!

దిల్లీ: జీఎస్‌టీ రేట్లను హేతుబద్దీకరించే ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళనలే ఇందుకు కారణమని తెలిపాయి. ప్రస్తుతం జీఎస్‌టీ విధానంలో 5%, 12%; 18%, 28% పన్ను శ్లాబులున్నాయి. ఈ శ్లాబుల సంఖ్యను మూడుకు పరిమితం చేయాలనే ప్రతిపాదన ఉంది. ఇందువల్ల కొన్ని ఉత్పత్తుల పన్ను రేట్లు పెరగొచ్చు.. మరికొన్నింటిపై తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిల వద్ద కొనసాగుతున్నందున, జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ ప్రక్రియ ఆలస్యం కావొచ్చని ఆ వర్గాలు తెలిపాయి.


2021-22లో 9.2 శాతం వృద్ధి: బీఓబీ

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 9.2 శాతంగా నమోదు కావొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వెల్లడించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, బ్యాంక్‌ రుణాలు, జీఎస్‌టీ వసూళ్లు పెరగడం ఇందుకు దోహదం చేయనున్నాయని అంచనా వేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం జ్ఞక్షీణించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ముందస్తు అంచనాల ప్రకారం 2021-22లో జీడీపీ వృద్ధి 8.9 శాతంగా నమోదు కావొచ్చు. ఈ నెల 31న జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) జీడీపీ వృద్ధి గణాంకాలను వెల్లడించనుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) 9 శాతంగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ (ఏడీబీ) 7.5 శాతంగా దేశ వృద్ధిరేటు ఉంటుందని అంచనా వేశాయి.


పసిడి దిగుమతికి ఆర్‌బీఐ నిబంధనలివీ

ముంబయి: ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ (ఐఐబీఎక్స్‌) లేదా అదే తరహా అధీకృత ఎక్స్ఛేంజీ ద్వారా పసిడిని భౌతికంగా దిగుమతి చేసుకునేందుకు భారత్‌లోని అర్హత గల ఆభరణాల తయారీదార్లకు బుధవారం ఆర్‌బీఐ నిబంధనలను జారీ చేసింది. ఆర్‌బీఐ, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌(డీజీఎఫ్‌టీ) నామినేట్‌ చేసిన ఏజెన్సీలతో పాటు అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అధీకృత సంస్థ(ఐఎఫ్‌ఎస్‌సీఏ) ఆమోదం పొందిన అర్హతగల ఆభరణ తయారీదార్లకు పసిడి దిగుమతికి జనవరిలో అనుమతులు ఇచ్చింది. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఐబీఎక్స్‌ ద్వారా దిగుమతి చేసుకునే పసిడికి ముందస్తు చెల్లింపులు చేయడం కోసం 11 రోజుల వరకు ఆభరణాల తయారీదార్లకు బ్యాంకులు అనుమతులు ఇవ్వవచ్చు. ఒక వేళ దిగుమతి చేసుకునే బంగారం కంటే ఎక్కువ మొత్తంలో ముందుస్తుగా బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని ఉంటే.. నిర్దిష్ట కాలపరిమితి అయిన 11 రోజుల్లో వినియోగించని మొత్తాన్ని వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. పసిడి దిగుమతి కోసం చేసే అన్ని చెల్లింపులనూ ఐఎఫ్‌ఎస్‌సీఏ ఆమోదం పొందిన ఎక్స్ఛేంజ్‌ వ్యవస్థ ద్వారా జరగాలి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో పసిడి దిగుమతులు 72% తగ్గి.. 1.72 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.


ఈఎస్‌ఐసీ పథకంలోకి మార్చిలో 14.05 లక్షల మంది

దిల్లీ: ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకంలోకి మార్చిలో కొత్తగా 14.05 లక్షల మంది సభ్యులు చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 12.70 లక్షల మంది చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021-22 మొత్తం మీద కొత్త చందాదార్లు 1.49 కోట్లుగా నమోదయ్యారు. 2018-19లో 1.49 కోట్లు, 2019-20లో 1.51 కోట్లు, 2020-21లో 1.15 కోట్ల మంది స్థూలంగా కొత్త సభ్యులు చేరారు. 2017 సెప్టెంబరు -2018 మార్చిలో ఈఎస్‌ఐసీ పథకంలో 83.35 లక్షల మంది చేరగా.. 2017 సెప్టెంబరు -2022 మార్చిలో వీరి సంఖ్య 6.48 కోట్లుగా ఉంది. ఈఎస్‌ఐసీ నిర్వహించే పలు పథకాలు, ఈపీఎఫ్‌ఓ, పీఎఫ్‌ఆర్‌డీఏలో చేరిన కొత్త చందాదారుల ఆధారంగా ఎన్‌ఎస్‌ఓ నివేదిక రూపొందించింది. మరో వైపు, ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)లో 2022 మార్చిలో 15.32 లక్షల మంది చేరారు. ఫిబ్రవరిలో నమోదైన 12.84 లక్షలతో పోలిస్తే ఇది ఎక్కువే. 2017 సెప్టెంబరు- 2022 మార్చి మధ్య ఈపీఎఫ్‌లోకి 5.28 కోట్ల మంది కొత్త సభ్యులొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని