Google: ‘గూగుల్‌ ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఎలా?’.. పిచాయ్‌ స్వయంగా సెర్చ్‌ చేసిన వేళ..!

Google: గూగుల్‌ అందుబాటులోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాశారు. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 06 Sep 2023 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెర్చింజన్‌ అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు గూగుల్‌ (Google). టెక్నాలజీపై అంతగా అవగాహనలేని వారు ఇంటర్నెట్‌ అంటే గూగుల్‌ (Google)లో వెతకడమనే అనుకుంటుంటారు! శోధించడం అనే పదానికి ‘గూగుల్‌ చేయడం’ పర్యాయపదంగా మారిందంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు. అలాంటి గూగుల్‌ (Google) ప్రారంభమై 25 సంవత్సరాలైంది. ఈ నేపథ్యంలో సీఈఓ సుందర్‌ పిచాయ్‌ (Sunder pichai) ఉద్యోగులనుద్దేశించి సుదీర్ఘ లేఖ రాశారు. అందులో ఆయన వ్యక్తిగత అనుభవాలతో పాటు గూగుల్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కొన్ని సంవత్సరాల క్రితం తన తండ్రితో ఎలా కమ్యూనికేట్ చేసేవారో ఈ సందర్భంగా సుందర్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తన పిల్లలు సమాచారాన్ని క్షణాల్లో ఎలా బదిలీ చేయగలుగుతున్నారో చెప్పారు. ఈ విషయంలో వచ్చిన మార్పులే తరాలు మారుతున్న కొద్దీ వస్తున్న మార్పులకు నిదర్శనమని వివరించారు. ఒకప్పుడు అలవాటు పడటానికి సంవత్సరాలు పట్టిన సాంకేతికత.. నేటి పిల్లలు క్షణాల్లో ఆకళింపు చేసుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ కథల్లా విన్నవే.. ఇప్పుడు పిల్లల కళ్లముందున్నాయని పిచాయ్‌ పేర్కొన్నారు.

నల్లా మరమ్మతు నుంచి గూగుల్‌ ఇంటర్వ్యూ వరకు..

కుప్పలు తెప్పలుగా ఉన్న సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక క్రమ పద్ధతిలో అందించాలన్న లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ ఆలోచనతోనే గూగుల్‌ మిషన్ ప్రారంభమైందని సుందర్‌ గుర్తు చేశారు. అలా గూగుల్‌ సెర్చ్‌ పేరిట తీసుకొచ్చిన ప్రొడక్ట్‌ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పరిష్కారాలను వెతికి పెట్టిందని తెలిపారు. సరైన సమాధానాలు వెతికి పెట్టే గూగుల్‌ సామర్థ్యాన్ని చూసిన తాను ఆశ్చర్యపోయేవాడినని తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ‘కారుతున్న నల్లాను మరమ్మతు చేయడం ఎలా?’ దగ్గరి నుంచి తాను ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ‘గూగుల్‌ ఇంటర్వ్యూని ఎదుర్కోవడం ఎలా?’ వరకు అనేక ప్రశ్నలకు గూగుల్‌ తనకు సమాధానమిచ్చినట్లు తెలిపారు. సమయం గడుస్తున్న కొద్దీ తాను ప్రశ్నలు అడిగిన తీరుతో పాటు గూగుల్‌ సమాధానం ఇచ్చే విధానంలోనూ చాలా మార్పులు వచ్చాయని వివరించారు.

అప్పట్లో నిద్ర ‘అనవసరం’ అనుకున్నా..: బిల్‌ గేట్స్‌

సమాచారంలో సమానత్వం..

ప్రఖ్యాత యూనివర్శిటీలో ఓ ప్రొఫెసర్‌కు.. వెనుకబడ్డ దేశంలో ఓ పేద విద్యార్థికీ ఒకే తరహా సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం గూగుల్‌ వల్లే సాధ్యమైందని పిచాయ్‌ తెలిపారు. ఈ క్రమంలో చిన్న వ్యాపారాలకు సైతం ప్రకటనల ద్వారా గూగుల్‌ పెద్ద అవకాశాలను తీసుకొచ్చిందని వివరించారు. ఓ కంపెనీ అందిస్తున్న సేవలు.. ఆ సేవలు అవసరమైన కస్టమర్లను ఒకే వేదిక మీదకు తీసుకురావడం గూగుల్‌తో సాధ్యమైందని తెలిపారు.

సక్సెస్‌లే కాదు..

గూగుల్‌ ఇప్పుడు కేవలం సెర్చ్‌ బాక్స్‌ మాత్రమే కాదని సుందర్‌ తెలిపారు. పదుల సంఖ్యలో గూగుల్‌ ప్రొడక్ట్స్‌ అందుబాటులోకి వచ్చాయన్నారు. రోజుకి కోట్లాది మందికి వీటి సేవలు ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. ఈ క్రమంలో వచ్చిన క్రోమ్‌, యూట్యూబ్‌ జ్ఞాన సముపార్జనకు శక్తిమంతమైన వేదికలుగా మారాయని తెలిపారు. టెక్నాలజీ రంగంలో గూగుల్‌ క్లౌడ్‌ సృష్టించిన సంచలనాన్ని వివరించారు. అయితే, ఈ 25 ఏళ్ల ప్రయాణంలో అనేక ఆటుపోట్లూ ఎదుర్కొన్నట్లు తెలిపారు. తాము చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్‌ సక్సెస్‌ కాలేదని వెల్లడించారు. అందుకు గూగుల్‌వేవ్‌ను ఉదాహరణగా చెప్పారు.

ఈ ప్రయాణంలో ప్రతిదశలో తమ భవిష్యత్‌పై కఠినమైన ప్రశ్నలు ఎదురయ్యేవని సుందర్ తెలిపారు. 2000ల్లో అసలు ఒక వెబ్‌ బ్రౌజర్‌గా ఎన్నాళ్లు మనగ్గలమనే ప్రశ్న ఉత్పన్నమైందన్నారు. 2010లో మొబైల్‌ కంప్యూటింగ్‌కు అనుగుణంగా సెర్చ్‌ను మార్చగలమా అనే అనుమానాలు తలెత్తాయని తెలిపారు. కానీ, ప్రతిసారీ బలమైన సమాధానాలు, పరిష్కారాలతో యూజర్ల ముందుకు వచ్చినట్లు వివరించారు.

30ల్లో పదవీ విరమణ ప్రణాళిక..‘టూ ఎర్లీ’ అంటారా? ఇది చదవండి..

అసాధ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే..

అసాధ్యం అనే పదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇతరులెవరూ పరిష్కరించలేని అనేక సమస్యల్ని తాము చేయగలిగామని సుందర్‌ తెలిపారు. అందుకు ఆండ్రాయిడ్‌ రూపంలో ప్రతి ఒక్కరి జేబులో కంప్యూటర్‌ను పెట్టడమే నిదర్శనమని పేర్కొన్నారు. తద్వారా ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ సేవల్ని చేరువ చేశామన్నారు. గూగుల్‌ పిక్సెల్‌ ద్వారా మెషీన్‌ లెర్నింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలను యూజర్ల దగ్గరకు తీసుకెళ్లగలుగుతున్నామన్నారు. ఇలా ఏఐ, న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, డీప్‌మైండ్‌, టీపీయూ వంటి అత్యాధునిక సాధనాలు అందుబాటులోకి తీసుకురావడంలో గూగుల్‌ ముందుందని తెలిపారు.

తొలి నుంచీ బాధ్యతతో..

అనేక రకాల ప్రొడక్ట్‌లను తీసుకురావడం ఒక సవాలైతే.. యూజర్ల విశ్వాసాన్ని పొందడం అత్యంత ప్రధానమైన విషయమని సుందర్‌ తెలిపారు. ఈ క్రమంలోనే గూగుల్‌ మొదటి నుంచీ సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించిదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సమాచారం, గోప్యతకు భద్రత కల్పించడాన్ని ప్రాధాన్యంగా ఎంచుకున్నామన్నారు. అలాగే, కృత్రిమ మేధ (Artificial Intelligence) రూపంలో వస్తున్న మరో సాంకేతిక విప్లవానికి ఆరంభంలో ఉన్నామని పిచాయ్‌ తెలిపారు. వీలైనంత మంది జీవితాలను మెరుగుపర్చే ఉత్పత్తులను అభివృద్ధి చేయాలంటూ 2004లో గూగుల్‌ వ్యవస్థాపకులు నిర్దేశించిన లక్ష్యాన్నే మళ్లీ పునఃనిర్వచించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏఐని ప్రతి ఒక్కరికీ మరింత సహాయకారిగా మార్చడం, దానిని బాధ్యతాయుతంగా అమలు చేయడంమే రాబోయే 10 సంవత్సరాలు ఆపై మన లక్ష్యమని పిచాయ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్న.. దాని సమాధానం కోసం చేసే శోధనే రాబోయే 25 సంవత్సరాలలో అసాధారణ సాంకేతిక పురోగతిని అందిస్తుందని పిచాయ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని