Retirement Plan: 30ల్లో పదవీ విరమణ ప్రణాళిక.. ‘టూ ఎర్లీ’ అంటారా? ఇది చదవండి..

Retirement Plan: చాలా మంది పదవీ విరమణ ప్రణాళిక గురించి ఆలోచించరు. పైగా 30ల్లో అంటే టూ ఎర్లీ అంటారు. అయితే, చిన్న వయసులోనే పదవీ విరమణకు డబ్బును పొదుపు చేస్తే వచ్చే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

Updated : 05 Sep 2023 16:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పదవీ విరమణ (Retirement) ప్రతి ఉద్యోగి జీవితంలో భాగం. పదవీ విరమణ అనంతరం ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పదవీ విరమణ అనంతర జీవితమూ సౌకర్యంగా ఉండాలని ఆశిస్తారు. కానీ దాని కోసం పొదుపు (Retirement plan) చేయడంలో మాత్రం అలస్యం చేస్తారు. 35-36 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంకా పదవీ విరమణకు చాలా సమయం ఉందిలే నిదానంగా పొదుపు చేయొచ్చని అనుకుంటారు.

కానీ, చిన్న వయసులోనే పొదుపు చేస్తే వచ్చే ప్రయోజనాలెన్నో ఉన్నాయన్న సంగతి తెలీక కొందరు అలా వ్యవహరిస్తారు. ఒకవేళ మీరూ ఆలస్యంగా పొదుపు చేయాలనుకుంటే చాలా ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు  ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే అంత మంచిది. దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో నిధిని సమకూర్చుకోగలరు. అప్పుడే ద్రవ్యోల్బణాన్ని అధిగమించగలరు. ఇందుకోసం జీవన శైలి, ఇతర ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని ఎంత మొత్తంలో డబ్బును పొదుపు చేయాలో నిర్ణయించుకోవాలి. 

క్రెడిట్ స్కోర్‌ దేనివల్ల దెబ్బతింటుంది?

ఏంటీ 20X రూల్‌?

పదవీ విరమణ అనంతరం అవసరాన్ని అంచనా వేయడానికి 20X రూల్‌ ఉపయోగపడుతుంది. పదవీ విరమణకు ముందు ఖర్చు చేసే సొమ్ముపై 20 రెట్లు అధికంగా మీ రిటైర్మెంట్‌ డబ్బు ఉండాలని ఈ రూల్‌ సూచిస్తుంది. అంటే ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ, అనుకోని పరిస్థితులను ఎదుర్కోవడానికి అయ్యే ఖర్చులను ఈ విధానం పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ రూల్‌ సాయంతో మీ పొదుపును ప్రారంభించండి.

ఇవీ ప్రయోజనాలు..

  • కాంపౌండింగ్‌: పదవీ విరమణ అనంతరం కావల్సిన సొమ్ము కోసం ఎంత త్వరగా డబ్బును పొదుపు చేయడం ప్రారంభిస్తే అంత ఎక్కువ కాలం కాంపౌండింగ్‌ (చక్రవడ్డీ) ప్రయోజనాన్ని పొందుతారు. చక్రవడ్డీ అనేది మీ డబ్బు త్వరగా పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. దీంతో మీ పదవీవిరమణ సమయానికి మీ పొదుపు గణనీయంగా పెరుగుతుంది.
  • ఆర్థిక ఒత్తిడి అధిగమించొచ్చు: చిన్న వయసులో పదవీ విరమణకు డబ్బు ఆదా చేయడంతో రిటైర్మెంట్‌ నిధిని ఎక్కువగా సమకూర్చుకోవచ్చు. దీంతో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. మిగిలిన జీవితాన్ని హాయిగా గడిపేందుకు సాయపడుతుంది.
  • వ్యూహాలు మార్చుకోవచ్చు:  ముందుగా పొదుపును ప్రారంభిస్తే అనుకోని పరిస్థితులు ఎదురైతే వ్యూహాలను మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్ ట్రెండ్‌లు, వ్యక్తిగత లక్ష్యాలు, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేయొచ్చు.
  • ఊహించని సంఘటనలు ఎదురైనా..: జీవితంలో ఊహించని సంఘటనలు ఎదురైన సమయాల్లో పదవీ విరమణ పొదుపు లక్ష్యాలపై ప్రభావం చూపుతాయి. ముందుగానే పొదుపు ప్రారంభించడం  వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురైనా మీ పొదుపునకు ఎలాంటి ముప్పూ ఉండదు.
  • లక్ష్యాలను చేరుకోవటంలో..: పదవీవిరమణ అనంతరం ప్రపంచాన్ని చుట్టిరావాలనో, దేన్నైనా నేర్చుకోవాలనో చాలా మందికి లక్ష్యం ఉంటుంది. కొందరికి వ్యాపారం చేయాలని ఉంటుంది. ఇటువంటి లక్ష్యాలను చేరుకోవటానికి ముందస్తు పొదుపు చక్కగా ఉపయోగపడుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని