GST: జూన్‌ 28, 29 తేదీల్లో జీఎస్టీ మండలి భేటీ.. అజెండా ఇదేనా?

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి (GST council) సమావేశాలు ఈసారి రెండు రోజుల పాటు జరగనున్నాయి......

Published : 16 Jun 2022 17:27 IST

దిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి (GST council) సమావేశాలు ఈసారి రెండు రోజుల పాటు జరగనున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitaraman) అధ్యక్షతన ఈ నెల 28, 29 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయని ఆమె కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది. శ్రీనగర్‌ వేదికగా జరిగే 47వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై రాష్ట్రాల మంత్రుల ప్యానెల్‌ సమర్పించే నివేదికతో పాటు క్యాసినోలు, గుర్రపు పందేలు (రేస్‌ కోర్సులు), ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్టీ రేటు నిర్ణయించే అంశంపైనా చర్చించే అవకాశం ఉండటంతో ఈసారి భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకొంది. 

జీఎస్టీ రేట్లపై మంత్రుల బృందం సమీక్ష రేపే..! 
పన్ను రేట్లలో ఏమైనా మార్పుచేర్పులకు అవకాశం ఉందా అనే విషయంపై చర్చించేందుకు ఈనెల 17న (శుక్రవారం) మంత్రుల బృందం సమావేశం కానున్నట్టు సమాచారం. అయితే పన్నుల శ్లాబులపై మంత్రుల బృందం తుది నివేదిక ఖరారు చేసే అవకాశం ఉంది. జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణపై మంత్రుల బృందం సమర్పించే తాత్కాలిక నివేదికతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టీ మండలి సమావేశం జూన్‌ 28 నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయుల్లో కొనసాగుతున్నందున, జీఎస్‌టీ రేట్లలో ప్రస్తుతానికి మార్పులు చేసే అవకాశాలు తక్కువేనని పలువురు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని