Moonlighting: మూన్‌లైటింగ్ ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు..!

IT Notices: కరోనా సమయంలో మూన్‌లైటింగ్ ద్వారా అదనపు ఆదాయం సంపాదించి ఆ మొత్తాన్ని ఐటీ ఆదాయంలో చూపించని వారికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 08 Aug 2023 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూన్‌ లైటింగ్‌ (Moonlighting) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్‌ ద్వారా ఆదాయం పొందిన ఉద్యోగుల్లో కొందరు.. తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో (IT Returns) చూపించకపోవడమే ఇందుక్కారణం. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ (IT Notices) నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆంగ్ల పత్రిక ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ పేర్కొంది.

కరోనా సమయంలో మూన్‌లైటింగ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ రంగంలో ఈ పదం ఎక్కువగా వినిపించింది. ఒక కంపెనీలో పూర్తి స్థాయిలో ఉద్యోగిగా పనిచేస్తూనే అదనపు ఆదాయం కోసం మరో సంస్థలో పనిచేసి కొందరు జీతం తీసుకున్నారు. మరి కొందరు నెలవారీ, ఇంకొందరు మూడు నెలలకోసారి చొప్పున ఆదాయం పొందారు. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వారిని కొన్ని సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించాయి. 

రైల్లో లోయర్‌ బెర్త్‌ కావాలా? ఈసారి ఇలా చేయండి..

ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు కేవలం ప్రధాన కంపెనీ ఆదాయాన్ని మాత్రమే రిటర్నుల్లో చూపించినట్లు ఐటీశాఖ గుర్తించింది. దీంతో ఆయా ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. తొలుత రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య దాదాపు వెయ్యికిపైనే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారంటూ కొన్ని కంపెనీలే స్వయంగా ఐటీ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మున్ముందు మరింత మందికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని