Sudha Murthy: నా భర్త వారానికి 80 నుంచి 90 గంటలు పనిచేసేవారు: సుధా మూర్తి

ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారతలోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన భార్య సుధా మూర్తి స్పందించారు.

Published : 30 Oct 2023 19:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొద్దిరోజుల క్రితం వర్క్‌ కల్చర్‌ గురించి ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విభేదించారు. ఈ నేపథ్యంలో నారాయణ మూర్తి భార్య, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి (Sudha Murthy) స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. నారాయణ మూర్తి వారానికి 80 నుంచి 90 గంటలు కష్టపడే వారని తెలిపారు.  

‘‘ఆయన వారానికి 80 నుంచి 90 గంటలు కష్టపడి పనిచేసేవారు. అంతకంటే తక్కువగా పనిచేయడం ఆయనకు తెలియకపోవచ్చు. కష్టపడి పనిచేయడాన్ని ఆయన నమ్మేవారు. ఆయన అభిరుచి కూడా అదే. అలాగే జీవించారు. తనకు తోచిన విషయాన్నే ఆయన చెప్పారు’’ అని సుధా మూర్తి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ ప్రపంచంలో పని విధానం గురించి మీరు ఎప్పుడైనా భర్తకు చెప్పేందుకు ప్రయత్నించారా? అన్న ప్రశ్నకు.. ‘‘కొంతమంది విభిన్న మార్గాల్లో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. ఆయన నమ్మినదాన్నే ఆచరించారు. తన అనుభవాన్నే వెల్లడించారు’’ అని సుధా మూర్తి సమాధానమిచ్చారు. 

వర్క్‌కల్చర్‌పై నారాయణమూర్తి కామెంట్స్.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన

కొద్దిరోజుల క్రితం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్‌’ అనే పాడ్‌కాస్ట్‌ తొలి ఎపిసోడ్‌లో మాట్లాడిన నారాయణ మూర్తి.. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అన్నారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు బాస్‌లు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

ఉత్పాదకత పెరగాలంటే ఎక్కువ సమయం పనిచేయాల్సిన అవసరం లేదని.. నైపుణ్యాలకు పదునుపెట్టి, మెరుగైన పని వాతావరణం, సరిపడా వేతనం అందిస్తే.. ఇంకా ఎక్కువ ఉత్పాదకత రాబట్టొచ్చని అప్‌గ్రాడ్‌ వ్యవస్థాపకుడు రోనీ స్క్య్రూవాలా పేర్కొన్నారు. మరోవైపు నారాయణమూర్తితో తాను ఏకీభవిస్తున్నట్లు ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. తక్కువ పనిచేసి కాలం గడిపేయాల్సిన సమయం కాదని.. గతంలో ఇతర దేశాలు కొన్ని తరాల పాటు చేసిన పనిని ఇప్పుడు మనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని