Paytm Share: పేటీఎం షేరు ఢమాల్‌.. కారణం ఇదే!

Paytm Share: పేటీఎం షేరు విలువ గురువారం ఇంట్రాడేలో 20 శాతం నష్టపోయి బీఎస్‌ఈలో రూ.650.50 దగ్గర ‘లోయర్‌ సర్క్యూట్‌’ను తాకింది.

Updated : 07 Dec 2023 17:33 IST

Paytm Share | ముంబయి: ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ ‘పేటీఎం’ (Paytm) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’ షేరు విలువ భారీగా పతనమైంది. గురువారం ఇంట్రాడేలో 20 శాతం నష్టపోయి బీఎస్‌ఈలో రూ.650.45 దగ్గర ‘లోయర్‌ సర్క్యూట్‌’ను తాకింది. కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయిన తర్వాత ఒకరోజులో నమోదైన అత్యధిక నష్టం ఇదే. చివరకు 18.69% (రూ.152) నష్టపోయి రూ.661.30 దగ్గర ముగిసింది.

రూ.50 వేల్లోపు ఉండే వ్యక్తిగత రుణాల జారీని తగ్గించుకుంటామని కంపెనీ బుధవారం ప్రకటించింది. కేవలం పెద్ద టికెట్‌ రుణాలపైనే దృష్టి సారిస్తామని తెలిపింది. ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి’ (Buy Now Pay Later- BNPL) వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే షేరు విలువ (Paytm Share Price) కుంగినట్లు తెలుస్తోంది.

వ్యక్తిగత రుణాల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఇటీవల నిబంధనలను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. హామీలేని వ్యక్తిగత రుణాలకు రిస్క్‌ వెయిట్‌ను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఈ నేపథ్యంలోనే రిటైల్‌ రుణాల జారీని తగ్గించాలని పేటీఎం (Paytm) నిర్ణయించింది.

చిన్న రుణాల జారీని తగ్గించాలనే నిర్ణయం వల్ల పోస్ట్‌-పెయిడ్‌ ప్రోడక్ట్‌ ద్వారా పేటీఎం (Paytm) అందిస్తున్న లోన్ల సంఖ్య పడిపోయే అవకాశం ఉందని అనలిస్ట్‌లతో జరిగిన సమావేశంలో కంపెనీ సీఓఓ, అధ్యక్షుడు భవీష్‌ గుప్తా బుధవారం తెలిపారు. అయితే, దీనివల్ల రెవెన్యూ వృద్ధిపై మాత్రం పెద్ద ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొన్నారు.

ప్రతినెలా పేటీఎం (Paytm) సగటున 3.5-4 లక్షల కొత్త పోస్ట్‌-పెయిడ్‌ కస్టమర్లను చేర్చుకుంటోంది. దీంట్లో 70 శాతం మంది రూ.50 వేల్లోపు తీసుకుంటున్నవారే. తాజా నిర్ణయం వల్ల కొత్తగా రుణం తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశముందని గుప్తా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తమ దగ్గర రుణాలు పొందుతున్న వారిలో 60 శాతం మంది పాత కస్టమర్లేనని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని