ఆర్థిక నిర్వహణలో ఇవి పాటించండి!

డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే, కొత్త వస్తువులను కొనుక్కోవాలనే

Published : 08 Jul 2021 10:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డబ్బులు చేతిలో ఉన్నప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే, కొత్త వస్తువులను కొనుక్కోవాలనే ఆలోచనలు రావడం సహజం. దాదాపు చాలామంది మదిలో ఇలాంటి ఆలోచనలే మెదులుతుంటాయి. కానీ కొవిడ్‌ మహమ్మారి డబ్బు అవసరాన్ని, పొదుపు ప్రాముఖ్యతను తెలియజెప్పింది. జీవితంలో తారసపడే గడ్డు పరిస్థితులను అధిగమించాలంటే ఆర్థిక నిర్వహణ చాలా ముఖ్యం. మన భవిష్యత్‌ ప్రణాళిక కుదుపులకు లోనుగాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బడ్జెట్‌ ఎంత?ఖర్చెంత?

చాలామంది తాము పొదుపుగా ఖర్చు చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. కానీ, తీరా లెక్కలు వేశాక గానీ తాము చేస్తున్న ఖర్చెంత అనేది తెలీదు. అందుకే ప్రతి ఒక్కరూ తమ నెలవారీ బడ్జెట్‌ను ముందుగానే నిర్ణయించుకోవడం ముఖ్యం. ఆ బడ్జెట్‌కు తగినట్లే చెల్లింపులు చేస్తున్నామా? లేదంటే అంతకుమించి ఖర్చు చేస్తున్నామా? అనేది తెలుసుకోవాలి. ఒకటి, రెండుకు మించి క్రెడిట్‌కార్డులు, బ్యాంకు ఖాతాల ద్వారా ఇలాంటి చెల్లింపులు చేస్తే అన్నింటినీ క్రోడీకరించుకోవడం కష్టం. కాబట్టి ఏదైనా ఒకట్రెండు కార్డుల ద్వారానే లావాదేవీలు జరపండి.

వీలైనంత పొదుపు పెంచండి..

కొవిడ్‌ మహమ్మారి ‘అత్యవసరం’ అంటే ఏంటో నేర్పింది. అందుకే నెలవారీ పొదుపుతో పాటు అత్యవసరాలకు కూడా పొదుపు చేయడం మంచిది. పొదుపు చేయడంతో పాటు, అందులోని కొంత భాగాన్ని పెట్టుబడికి వినియోగించండి. అది మీ నిధిని మరింత పెంచేందుకు దోహదపడుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల ఎప్పుడైనా ఎదురయ్యే అత్యవసరాలు తీరడంతో పాటు మీ ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది.

క్రెడిట్‌స్కోరు పరిస్థితేంటి.?

చాలామంది క్రెడిట్‌ స్కోరు గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, మీ ఆర్థిక క్రమశిక్షణకు అద్దమే ఈ క్రెడిట్‌ స్కోరన్న విషయాన్ని మరచిపోవద్దు. భవిష్యత్తులో మీకు తక్షణమే రుణాలు లభించాలన్నా.. తక్కువ వడ్డీకే లోన్‌ దొరకాలన్నా ఈ స్కోరు ఎంతోముఖ్యం. సకాలంలో బిల్లులు చెల్లించారా? లేదా?అన్నదానిపై ఈ స్కోరు ఆధారపడి ఉంటుంది. 700-750 వరకు స్కోరు ఉండడం మంచిది. ఒకవేళ మీ స్కోరు అంతకంటే తక్కువగా ఉంటే.. మెరుగుపరచుకునే ప్రయత్నాలు ఇప్పటి నుంచైనా చేయండి.

క్యాష్‌బ్యాక్‌లు వదులుకోవద్దు!

చాలామంది క్యాష్‌బ్యాక్‌లు, కూపన్ల గురించి పట్టించుకోరు. వచ్చే కొద్దిమొత్తానికి ఆత్రం ఎందుకులే అనేవాళ్లు మనలో లేకపోలేదు. అయితే, మీరు చేసే ప్రతి కొనుగోలుపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, కూపన్లు లభించే అవకాశం ఉంటే ఏమాత్రం వాటిని వదులుకోవద్దు. అలా వచ్చిన చిన్నపాటి మొత్తమైనా ఆర్థికంగా ఎంతో కొంత ప్లస్‌ అవుతుంది. అయితే, కూపన్లు, డిస్కౌంట్లు లభిస్తున్నాయన్న కారణంతో అవసరం లేకపోయినా కొనుగోలు మాత్రం చేయొద్దు.

అప్పుల సంగతేంటి..?

ప్రతి వ్యక్తికీ పొదుపుతో పాటు ఎంతో కొంత అప్పు ఉంటుంది. అది బ్యాంకు రుణంగానో, ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకున్న మొత్తమో అయ్యుండొచ్చు. మన ఆర్థిక అవసరాలు తీరగా ఉండే మిగులు మొత్తాన్ని ముందు అప్పులు తీర్చడానికి వినియోగించాలి. అందులో ఏవి ఎక్కువ వడ్డీకి ఉన్నాయో చూసుకుని అలాంటి వాటిని ముందు పూర్తిచేయాలి. లేదంటే వాటికి చెల్లించే వడ్డీ మీ పొదుపు ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.

ప్రణాళిక మరోసారి..

ఇన్నేళ్ల తర్వాత ఇల్లు కొనాలనో.. కారు సమకూర్చుకోవాలనో ప్రణాళిక వేసుకోవడం మంచిదే. అయితే, ఎప్పుడో కొన్ని నెలల కిందట వేసుకున్న ప్రణాళికలను అలానే వదిలేయడం ఎంతమాత్రం మంచిది కాదు. ప్రణాళిక లక్ష్యాలు ఎక్కడి వరకు వచ్చాయి? ఒకవేళ వాటిని చేరుకోలేమనే అనుమానాలు ఉంటే పొదుపు పెంచడం, ఖర్చులు తగ్గించుకోవడం వంటివి చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్లాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని