కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు రూ. 35వేల కోట్లు

2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు.

Updated : 01 Feb 2021 12:15 IST

దిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడిచేసే వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూ. 35వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. 

‘కరోనాపై పోరులో భాగంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం రూ. 35వేల కోట్లు కేటాయిస్తున్నాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ డోసుల ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతాం’ అని సీతారామన్‌ వెల్లడించారు. 

త్వరలో మరో రెండు వ్యాక్సిన్లు..

‘కరోనా మహమ్మారిని దేశం సమర్థంగా ఎదుర్కొంది. ప్రస్తుతం ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు, క్రియాశీల రేటు అత్యంత తక్కువగా ఉంది. భారత్‌లో ప్రతి పదిలక్షల మంది జనాభాకు 130 యాక్టివ్‌ కేసులుండగా.. ప్రతి మిలియన్‌కు  112 మంది కొవిడ్‌తో మరణించారు. ప్రభుత్వ చర్యల వల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడింది’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, భారతీయులకే గాక, ఇతర దేశాలకు కూడా టీకాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. అతి త్వరలోనే మరో రెండు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. 

ఇదీ చదవండి..

కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని