Spotify: స్పోటిఫైలోనూ తొలగింపులు.. ఈవారంలోనే!

ఇతర టెక్ కంపెనీల బాటలోనే డిజిటల్‌ మ్యూజిక్‌ సేవల సంస్థ స్పోటిఫై కూడా పయనిస్తోంది. ఈ వారం నుంచి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.

Published : 23 Jan 2023 14:15 IST

వాషింగ్టన్‌: ఒకప్పుడు కంపెనీలు నియామకాల్లో పోటీ పడ్డాయి. ఇప్పుడేమో తొలగింపుల్లో నువ్వా- నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా టెక్‌ ఆధారిత కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి (Layoffs). తాజాగా ఈ జాబితాలో ప్రముఖ డిజిటల్‌ మ్యూజిక్‌ సర్వీస్‌ స్పోటిఫై (Spotify) కూడా చేరింది.

ఈ వారంలోనే స్పోటిఫై (Spotify) కొంతమంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. అయితే, ఎంతమందికి ఉద్వాసన పలకనున్నారనేది మాత్రం తెలియరాలేదు. అక్టోబరులోనే స్పోటిఫై (Spotify) తమ ‘గిమ్‌లెట్‌ మీడియా అండ్‌ పాడ్‌కాస్ట్‌ స్టూడియోస్‌’ నుంచి 38 మందిని తొలగించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో స్పోటిఫై (Spotify)లో 9,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కరోనా సంక్షోభ సమయంలో టెక్‌ ఆధారిత సేవలకు గిరాకీ భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. దీంతో కంపెనీలు ఉద్యోగులను భారీ ఎత్తున నియమించుకున్నాయి. కానీ, మహమ్మారి సంక్షోభం ముగిసిన తర్వాత పరిస్థితులు మారాయి. ఆదాయాలు పడిపోవడం, అస్థిర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యలకు దిగుతున్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. అమెజాన్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి బడా సంస్థలు భారీ ఎత్తున సిబ్బందిని ఇంటికి పంపాయి.

2019లో పాడ్‌కాస్టింగ్‌పై స్పోటిఫై (Spotify) పెద్ద ఎత్తున ప్రణాళికలను ప్రకటించింది. పాడ్‌కాస్ట్‌ నెట్‌వర్క్‌లు, క్రియేషన్‌ సాఫ్ట్‌వేర్‌, సర్వీసుల హోస్టింగ్‌, జో రోగన్‌ ఎక్స్‌పీరియెన్స్‌, ఆర్మ్‌చైర్‌ ఎక్స్‌పర్ట్‌ వంటి ప్రఖ్యాత షోల ప్రసార హక్కుల కోసం ఈ కంపెనీ దాదాపు 1 బిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించింది. అయితే, ఇప్పటి వరకు వాటాదారులకు మాత్రం ఎలాంటి లాభాలను చూపించలేకపోయింది. పైగా సమీప భవిష్యత్తుల్లో లాభాల్లోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కంపెనీ షేరు 66 శాతం పతనమైంది. వచ్చే రెండేళ్లలో తమ కంపెనీ లాభదాయకతను సాధిస్తుందని గత జూన్‌లో స్పోటిఫై ప్రతినిధులు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని