Tax deduction: ఈ సెక్షన్ల కింద ₹57,000 వరకు పన్ను మినహాయింపు

ఈ సెక్షన్‌ (Section 80TTA) కింద పన్ను చెల్లింపుదారులు రూ.10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను రాయితీ (Tax Deduction) పొందవచ్చు....

Updated : 18 Oct 2022 12:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముందుగానే నింపిన ఆదాయ పన్ను రిటర్ను (ITR) పత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రిటర్నుల దాఖలు సులభమైంది. దీంతో పన్ను చెల్లింపుదారులు (Taxpayers) ప్రతి సమాచారాన్ని నింపాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ, ఏదైనా కారణంతో ఆర్జించిన ఆదాయం లెక్కలోకి రాకపోతే మాత్రం చట్టపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు తెలిసి చేసినా.. తెలియక చేసినా.. ముందుగానే నింపిన రిటర్నుల పత్రాల్లోని సమాచారాన్ని సరిచూసుకోవడం మీ బాధ్యత. ఏదైనా సమాచారం పరిగణనలోకి రాకపోతే దాన్ని పొందుపరచాల్సిన బాధ్యతా మీదే. కాబట్టి ఏయే సందర్భాల్లో పన్ను చెల్లించాలి? ఎప్పుడు మినహాయింపు (Tax exemption) లభిస్తుంది వంటి అంశాలపై కచ్చితంగా అవగాహన ఉండాలి.

ముఖ్యంగా వడ్డీ ఆదాయం (Interest Income)పై లభించే పన్ను ప్రయోజనాల గురించి ముందే తెలిసి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

సెక్షన్‌ 80 టీటీఏ..

ఈ సెక్షన్‌ (Section 80TTA) కింద పన్ను చెల్లింపుదారులు రూ.10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను రాయితీ (Tax Deduction) పొందవచ్చు. వ్యక్తిగత, హిందూ అవిభాజ్య కుటుంబాలకు ఈ అవకాశం ఉంది. ఏదైనా బ్యాంకు, కో-ఆపరేటివ్‌ సొసైటీ, పోస్టాఫీసు, కో-ఆపరేటివ్‌ ల్యాండ్‌ మోర్టగేజ్‌ బ్యాంక్‌, కో-ఆపరేటివ్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌లోని పొదుపు ఖాతా నుంచి లభించే వడ్డీకి ఈ రాయితీ వర్తిస్తుంది. అయితే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి మాత్రం ఈ రాయితీ లభించదు.

సెక్షన్‌ 80టీటీబీ..

ఈ సెక్షన్‌ (Section 80TTB) కింద రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను రాయితీ పొందవచ్చు. ఈ సెక్షన్‌ కేవలం సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే. పొదుపు ఖాతాలతో పాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి లభించే వడ్డీ ఆదాయం కూడా పన్ను రాయితీ పరిధిలోకి వస్తుంది. బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ సొసైటీ, పోస్టాఫీసుల్లో చేసిన డిపాజిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

సెక్షన్‌ 10(15)(ఐ)..

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 10(15)(ఐ) (Section 10(15)(i))  కింద అదనపు పన్ను మినహాయింపు (Tax exemption)ను పొందొచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. పోస్టాఫీసు పొదపు ఖాతా నుంచి లభించే రూ.3,500 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. జాయింట్‌ ఖాతా అయితే, రూ.7,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీ ఆదాయంతో పాటు రిడెమ్షన్‌లపై ప్రీమియం; నోటిఫైడ్‌ సెక్యూరిటీలు, బాండ్లు, యాన్యుటీ సర్టిఫికెట్లు, సేవింగ్స్‌, ఇతర సర్టిఫికెట్ల నుంచి లభించే చెల్లింపులకు కూడా ఈ సెక్షన్‌ కింద పన్ను మినహాయింపు కోరవచ్చు.

రెండూ వర్తించవు..

సెక్షన్‌ 80టీటీబీ, 80టీటీఏ.. రెండింట్లో ఏదో ఒక దాని నుంచి మాత్రమే పన్ను రాయితీ ఉంటుంది. రెండింటి నుంచి రాయితీ కోరడం కుదరదు. అయితే, సెక్షన్‌ 10(15)(ఐ) ద్వారా లభించే పన్ను మినహాయింపు మాత్రం సెక్షన్‌ 80టీటీబీ, 80టీటీఏ పన్ను రాయితీకి అదనం. ఈ నేపథ్యంలో వ్యవక్తిగత హాదాలో రూ.13,500, జాయింట్‌గా రూ.17,000పై పన్ను మినహాయింపు పొందేందుకు అనుమతి ఉంది. అదే సీనియర్‌ సిటిజన్లయితే రూ.57,000పై పన్ను ప్రయోజనాలు ఉంటాయి. అయితే, పోస్టాఫీసు డిపాజిట్ల నుంచి లభించే వడ్డీకి సెక్షన్‌ 80టీటీబీ, 80టీటీఏతో పాటు సెక్షన్‌ 10(15)(ఐ) కింద కూడా పన్ను ప్రయోజనం ఉంది. తొలుత సెక్షన్‌ 10(15)(ఐ)ని వర్తింపజేసి మిగిలిన మొత్తానికి రాయితీ కింద పరిగణిస్తారు. ఉదాహరణకు పోస్టాఫీసు పొదుపు ఖాతాపై మీకు రూ.10,000 వడ్డీ వస్తే దాంట్లో రూ.3,500పై పన్ను మినహాయింపు.. మిగిలిన రూ.6,500ను పన్ను రాయితీ కింద లెక్కలోకి తీసుకోవచ్చు.

ఇవి గుర్తుంచుకోండి..

* సెక్షన్‌ 80టీటీఏ కింద పన్ను రాయితీ పొందాలంటే.. వడ్డీ ఆదాయాన్ని కచ్చితంగా ‘ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం (income from other sources)’గా చూపించాలి.

* సెక్షన్‌ 10(15)(ఐ) కింద పన్ను మినహాయింపు కావాలంటే.. వడ్డీ ఆదాయాన్ని ‘మినహాయింపు ఆదాయం (exempted income)’ కింద పొందుపర్చాలి.

* సెక్షన్‌ 80టీటీబీ కింద పన్ను మినహాయింపు పొందలేని సీనియర్‌ సిటిజన్లు సెక్షన్‌ 80టీటీఏని ఉపయోగించుకోవచ్చు.

* సంస్థ లేదా వ్యక్తుల బృందం పేరిట చేసిన డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయానికి సెక్షన్‌ 80టీటీఏ, సెక్షన్‌ 80టీటీబీ వర్తించవు.

* సెక్షన్‌ 80టీటీఏ, సెక్షన్‌ 80టీటీబీలు కొత్త పన్ను విధానానికి వర్తించవు. సెక్షన్‌ 10(15)(ఐ) మాత్రం కొత్త, పాత పన్ను విధానాల్లోనూ అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని