TVS Motor: ఏడాది వ్యవధిలో టీవీఎస్‌ నుంచి వరుస ఎలక్ట్రిక్‌ టూవీలర్లు

TVS Motor: వచ్చే ఏడాది వ్యవధిలో 5- 25 కిలోవాట్ల మధ్య శ్రేణిలో వరుస స్కూటర్లను విడుదల చేస్తామని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ డైరెక్టర్‌ సీఈఓ కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ తెలిపారు.

Published : 26 Nov 2023 13:11 IST

దిల్లీ: వచ్చే ఏడాది వ్యవధిలో తమ విద్యుత్‌ ద్విచక్ర వాహన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తామని టీవీఎస్‌ మోటార్‌ (TVS Motor) తెలిపింది. వివిధ ధరల శ్రేణితో కస్టమర్లకు చేరువవుతామని పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ రెండు ఇ-స్కూటర్లను విక్రయిస్తోంది. రాబోయే రోజుల్లో విక్రయ మౌలిక వసతులను సైతం విస్తరిస్తామని తెలిపింది. ఓ ఎలక్ట్రిక్‌ త్రీ-వీలర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.

వచ్చే ఏడాది వ్యవధిలో 5- 25 కిలోవాట్ల మధ్య శ్రేణిలో వరుస స్కూటర్లను విడుదల చేస్తామని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ డైరెక్టర్‌ సీఈఓ కె.ఎన్‌.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌ (TVS Motor iQube)కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని పేర్కొన్నారు. దీంతో నెలవారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 25 వేల యూనిట్లకు పెంచినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పెంచుతామని పేర్కొన్నారు.

ప్రస్తుత త్రైమాసికంలోనే టీవీఎస్ తమ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘టీవీఎస్‌ ఎక్స్‌ (TVS X)’ విక్రయాలను ప్రారంభించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ఇ-స్కూటర్ల కోసం 400 టచ్‌పాయింట్లు ఉన్నాయని రాధాకృష్ణన్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో కొత్త ఉత్పత్తుల వరుస విడుదల నేపథ్యంలో మౌలిక వసతులను మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు ఎగుమతుల గురించి మాట్లాడుతూ.. వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో ఐక్యూబ్‌ చాలా మార్కెట్లలోకి విస్తరిస్తుందని రాధాకృష్ణన్‌ తెలిపారు. ఐరోపా మార్కెట్‌లోకీ ప్రవేశిస్తామన్నారు. స్పష్టమైన వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని.. దశలవారీగా ఇతర మార్కెట్లకూ విస్తరిస్తామని పేర్కొన్నారు. దేశీయ, విదేశీ విపణుల్లో ‘టీవీఎస్‌ ఎక్స్‌’ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని