Jio-Vodafone Idea: 2జీ, 3జీ సేవలను నిలిపివేయాలని జియో, వొడా ఎందుకు కోరుతున్నాయ్‌?

jio and VI on 2G: 2జీ, 3జీ నెట్‌వర్క్‌ను నిలిపివేయాలని జియో, వొడాఫోన్‌ ఐడియా కోరుతున్నాయి. ఈ మేరకు ట్రాయ్‌కు తమ అభిప్రాయాన్ని తెలియజేశాయి.

Published : 30 Jan 2024 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభమైనప్పటికీ.. 2జీ, 3జీ సర్వీసులు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌పై పనిచేసే ఫీచర్‌ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. దేశీయంగా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 2జీ, 3జీ సేవలను పూర్తిగా నిలిపివేయాలని జియో (Jio), వొడాఫోన్‌ ఐడియా (VI) తాజాగా ప్రతిపాదించాయి. ప్రభుత్వమే ఇందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటూ ట్రాయ్‌కు (TRAI) తెలియజేశాయి. ఇంతకీ 2జీ, 3జీ సర్వీసులను
మూసివేయాలని ఈ రెండు కంపెనీలు ఎందుకు కోరుతున్నాయి?

దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చి ఏడాది దాటింది. జియో, ఎయిర్‌టెల్‌.. 5జీ సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. మరో ప్రైవేటు టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా మాత్రం 5జీ సేవలను ప్రారంభించే విషయంలో ఇంకా ముందడుగు వేయలేదు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ విషయంలో చాలా దూరంలో ఉంది. తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI).. 5జీ ఎకోసిస్టమ్‌కు మారేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంప్రదింపుల పత్రాన్ని జారీ చేసింది. దీనిపై జియో, వొడాఫోన్‌ ఐడియా దాదాపు ఒకే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి.

Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియమే ఎందుకు?

2జీ/3జీ సేవలను పూర్తిగా మూసివేయాలని, ఇందుకోసం ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని జియో ట్రాయ్‌కు తెలిపింది. అప్పుడు 4జీ, 5జీ సర్వీసులకు వినియోగదారులు మారతారని అభిప్రాయం వ్యక్తంచేసింది. అనవసర నెట్‌వర్క్‌ వినియోగ భారమూ తగ్గుతుందని పేర్కొంది. దేశంలో 4జీ, 5జీ అందుబాటులో ఉన్నా.. ఇప్పటికీ పాతకాలపు టెక్నాలజీ అయిన 2జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారని వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఇది పౌరుల మధ్య డిజిటల్‌ విభజనను తీసుకొస్తోందని తెలిపింది.  ఇది 5జీ వృద్ధికి విఘాతమని అభిప్రాయపడింది. ఎయిర్‌టెల్‌ మాత్రం దీనిపై తన స్పందనను తెలియజేయలేదు.

సాధ్యమేనా?

వయో వృద్ధులు, పేదలు ఇప్పటికీ ఫీచర్‌ ఫోన్లనే వినియోగిస్తున్నారు. వీరంతా 4జీ లేదా 5జీకి మారాలంటే అందుకు తగిన హ్యాండ్‌సెట్‌ కొనుగోలు చేయాలి. ఇందుకోసం కనీసం బడ్జెట్‌ రూ.5 వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 2జీ, 3జీ సర్వీసుల మూసివేత సాధ్యమవుతుంది. దీనికి పరిష్కారాన్నీ వొడాఫోన్‌ తన అభిప్రాయంలో భాగంగా తెలియజేసింది. హ్యాండ్‌సెట్‌ కొనుగోలుకు రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది. అప్పుడే కొత్త టెక్నాలజీని అందుకోవడం సాధ్యమవుతుందని తెలిపింది. రాయితీ కోసం యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (USOF)ను వినియోగించాలని కోరింది. ప్రస్తుతం రూ.77,133 కోట్ల మేర యూఎస్‌ఓఎఫ్‌ కార్పస్‌ ఉంది.

మరోవైపు ‘2జీ ముక్త్‌ భారత్‌’ వైపుగా జియో ప్రయత్నాలు మొదలుపెట్టింది. తక్కువ ధరకే 4జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తోంది. అయినప్పటికీ ఇంకా 2జీ/3జీ నెట్‌వర్క్‌పై ఆధారపడుతున్నవారి సంఖ్య కొనసాగుతోంది. వీరంతా 4జీ లేదా 5జీకి మారాలంటే కొంతకాలం పడుతుంది.  టెలికాం కంపెనీలు ప్రతిపాదించినట్లు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకున్నా.. అందుకోసం పౌరులకు కొంత గడువు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని