Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియమే ఎందుకు?

ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి?

Published : 30 Jan 2024 13:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే వెంటనే మెడికల్‌ స్టోర్‌కెళ్లి ట్యాబ్లెట్లు తీసుకొస్తుంటాం. వాటిని వినియోగించేటప్పుడు ఆ మందేమిటి? దాని ధరెంత? ఎప్పటి వరకు పనిచేస్తుంది? వంటి వివరాలు చూస్తుంటాం. ఒకసారి వాటి ప్యాకింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? పిల్‌, ట్యాబ్లెట్‌, క్యాప్సుల్‌.. ఇలా మందు బిల్ల ఏదైనా.. వాటి ప్యాకింగ్‌ స్టైల్‌ ఎలా ఉన్నా.. అందుకోసం వాడేది మాత్రం ఒకటే. అదే అల్యూమినియం. ఇంతకీ ఔషధాల ప్యాకింగ్‌కు దాన్నే ఎందుకు వాడతారు?

శాస్త్రవేత్తలు ఎంతో శ్రమకోర్చి మందులను తయారుచేస్తుంటారు. ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే రోగాలు, మహమ్మారులను తరిమికొట్టేందుకు కొత్త కొత్త ఔషధాలను కనుగొంటూ ఉంటారు. ఎంత శ్రద్ధతో వాటిని తయారుచేస్తున్నామో.. రోగికి చేరే వరకు దాని సామర్థ్యం కొనసాగించడమూ అంతే ముఖ్యం. ఒక చోట తయారైన ట్యాబ్లెట్లు.. ఖండాంతరాలు దాటుతున్నాయి. వేర్వేరు వాతావరణ పరిస్థితులను తట్టుకుని రోగుల ప్రాణాలను నిలబెడుతున్నాయి. కొవిడ్‌ సమయంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను పెద్దఎత్తున అమెరికాకు భారత్‌ ఎగుమతి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక్కడితో పోల్చితే అక్కడి వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నం. పైగా అంత దూరం తీసుకెళ్లినా ఔషధం ఏమాత్రం చెక్కు చెదరడం లేదంటే దానికి కారణం ప్యాకింగ్. దానికి వాడే మెటీరియల్‌.

తొలినాళ్లలో..

పిల్స్‌, ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌ కోసం తొలినాళ్లలో కాగితాన్ని వినియోగించేవారు. దాని స్వభావరీత్యా ఔషధం కలుషితం కాకుండా అది ఏమాత్రం కాపాడలేకపోయేది. తర్వాత పేపర్‌, పాలిమర్‌ లేయర్‌ ప్యాకింగ్‌ వినియోగం అందుబాటులోకి వచ్చింది. కొంతకాలం తర్వాత పేపర్‌కు పీవీసీ లేయర్‌ కూడా జత అయ్యింది. ఇవేవీ మందులను తేమ నుంచి పూర్తి స్థాయిలో కాపాడలేకపోయాయి. పైగా ఆయా మెటీరియల్‌కు ఉన్న సాగదీత లక్షణంతో ట్యాబ్లెట్‌ను బయటకు తీయడమూ కష్టంగా ఉండేది. క్యాప్సుల్స్‌ ప్యాకింగ్‌ విషయంలో ఇది మరింత కష్టంగా మారేది. అలా ప్యాకింగ్‌ మెటీరియల్‌ విషయంలో ఏళ్ల పాటు శ్రమించాక అల్యూమినియం వాడకం అందుబాటులోకి వచ్చింది. ఏళ్లుగా వీటి ప్యాకింగ్‌లో కీలక భూమిక పోషిస్తోంది.

అల్యూమినియమే ఎందుకు?

మనిషి జీవితంలో అల్యూమినియం వాడకం ఎప్పటి నుంచో ఉంది. ఇంట్లో దీనితో చేసిన వంట పాత్రలు వినియోగిస్తాం. ఇలా అందరికీ సుపరిచితమైన అల్యూమినియానికి ఉన్న అసాధారణ లక్షణమే ప్యాకింగ్‌ మెటీరియల్‌గా మారింది. ఇది తుప్పుపట్టదు. పైగా తేమను, వేడిని తట్టుకునే శక్తి దీని సొంతం. దీంతో ఔషధాలను ప్యాక్‌ చేయడానికి ఇంతకంటే మించిన మెటీరియల్‌ లేదని భావించిన ఔషధ పరిశ్రమ.. దీన్ని ప్యాకింగ్‌కు వాడడం మొదలుపెట్టింది. ఈ ప్యాకేజీ అతినీలలోహిత కిరణాలు, నీటి ఆవిరి, నూనెలు, ఆక్సిజన్‌, సూక్ష్మజీవుల నుంచి ఔషధాలను దూరంగా ఉంచుతుంది. వాటిని ఏమాత్రం కలుషితం కాకుండా చూస్తుంది. రోగికి చేరేంత వరకు దాని సామర్థ్యాన్నీ కాపాడుతుంది. ఈ కారణంగానే పిల్స్‌, క్యాప్సుల్స్‌, ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియం ఏళ్లుగా వినియోగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని