48గంటల్లో ₹10కోట్లు ఇవ్వాలన్నారు:సజ్జనార్‌ 

నగర శివారు రాజేంద్రనగర్‌లో పట్టపగలే కిడ్నాప్‌కు గురైన దంతవైద్యుడి కేసును ఏపీలోని అనంతపురం పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. నిందితుల..

Updated : 29 Oct 2020 13:32 IST

వైద్యుడి కిడ్నాప్ వివరాలు మీడియాకు వెల్లడించిన సీపీ

హైదరాబాద్‌: నగర శివారు రాజేంద్రనగర్‌లో పట్టపగలే కిడ్నాప్‌కు గురైన దంతవైద్యుడి కేసును ఏపీలోని అనంతపురం పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. నిందితుల నుంచి 3 కార్లు, 7 మొబైల్‌ ఫోన్లు, బొమ్మ తుపాకులు స్వాధీనం చేసున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు.

‘‘కిడ్నాప్‌ సూత్రధారి ముస్తఫా.. వైద్యుడు హుస్సేన్‌కు దగ్గరి బంధువు. ముస్తఫా ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. విలాస జీవితానికి అలవాటుపడిన నిందితుడు డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్‌ చేయాలనుకున్నాడు. హుస్సేన్‌కు ముస్తఫా దగ్గరి బంధువు కావడంతో ఆయన్నే కిడ్నాప్‌ చేయాలని నిశ్చయించుకున్నాడు. పథకం ప్రకారం కిడ్నాప్‌ చేసేందుకు హుస్సేన్‌ ఉండే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకోవడంతో పాటు రెండు బృందాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక బృందం కిడ్నాప్‌ చేస్తే.. మరో బృందం బెంగళూరు తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందించాడు.

నెమ్మదిగా వైద్యుడు హుస్సేన్‌తో పరిచయం పెంచుకున్నారు. అనుకున్న విధంగా మంగళవారం మధ్యాహ్నం హుస్సేన్‌ని అతని కారులోనే కిడ్నాప్‌ చేశారు. కారులో అక్కడనుంచి వైద్యుడిని మొదట కూకట్‌పల్లి తరలించారు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న రెండో బృందం హుస్సేన్‌ని బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. 48 గంటల్లోపు రూ. 10 కోట్లు ఇవ్వాల్సిందిగా హుస్సేన్‌ కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో బెంగళూరు వైపు హుస్సేన్‌ని తీసుకెళ్తుండగా మంగళవారం రాత్రి అనంతపురం పోలీసులు 44వ జాతీయ రహదారిపై రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను నిలువరించి అదుపులోకి తీసుకున్నారు’’ అని సజ్జనార్ వివరించారు. మొత్తంగా 12 పోలీసు‌ బృందాలు రంగంలోకి దిగి 12 గంటల్లోనే కిడ్నాప్‌ కేసును ఛేదించినట్లు చెప్పారు. ఈ కేసు విషయంలో ఏపీ‌ పోలీసులు పూర్తి సహకారం అందించారని సీపీ తెలిపారు.

ఇదీ చదవండి..

వైద్యుడి కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని