Crime News : స్టాక్‌ మార్కెట్‌ మోసగాడు.. 27 ఏళ్ల తర్వాత చిక్కాడు!

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తానని మోసం చేసి పరారైన ఓ వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. 

Published : 23 Mar 2023 13:51 IST

అనేక ఇళ్లు మారుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ నిందితుణ్ని 27 ఏళ్ల తర్వాత ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వీరేంద్ర ప్రవీణ్‌ చంద్ర సంఘ్వీ తనను తాను స్టాక్‌మార్కెట్ నిపుణుడిగా పరిచయం చేసుకొని 1995లో చంద్రభాన్‌ ఖండేల్వాల్ అనే వ్యక్తి  వద్ద రూ.20లక్షలు తీసుకున్నాడు. పెట్టుబడి పెట్టినట్లు నకిలీ రశీదులు అతడికి ఇచ్చి.. నగదుతో వీరేంద్ర ఉడాయించాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వీరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కేసులో ఏడాదిన్నర శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వీరేంద్ర కోర్టు వాయిదాలకు వెళ్లడం మానేశాడు. అతని ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. 

తాజాగా ఏసీపీ అనిల్‌ రోక్డే, ఇతర అధికారులు ఈ కేసుపై దృష్టి సారించారు. రికార్డుల్లో నమోదైన అడ్రస్‌కు వెళ్లి ఆరా తీయగా ఎటువంటి సమాచారం లభించలేదు. దాంతో ముంబయి ఓటర్ల జాబితాను వడపోశారు. వీరేంద్ర ప్రవీణ్‌ చంద్ర సంఘ్వీ పేరుతో ఒకే ఒక్క ఓటరున్నాడు. అందులో పేర్కొన్న చెంబూరులోని సిద్ధార్థ్‌ కాలనీలో ఉన్న అతడి ఇంటికి వెళ్లారు. అయితే, వీరేంద్ర ఆ ఇంటిని ఎప్పుడో విక్రయించి వెళ్లాడని తెలిసింది. పోలీసులు పట్టువదలకుండా స్థానికులతో రహస్య సంభాషణలు జరిపి వీరేంద్ర ఫోన్‌ నంబర్‌ సేకరించి నిఘా పెట్టారు. ఎట్టకేలకు దానా బందర్లోని వీరేంద్ర నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే, దాన్ని కూడా వీరేంద్ర అద్దెకు ఇచ్చి మరో చోట ఉంటున్నట్లు తెలుసుకున్నారు. అతడిని ఎలాగైనా రప్పించాలని తాము పోలీసులమని చెప్పకుండా విద్యుత్తు అధికారుల్లా ఫోన్‌ చేశారు. ఇంటి వద్దే చిన్నపాటి వెరిఫికేషన్‌ ఉందని, వెంటనే రావాలని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన వీరేంద్ర తాను ప్రతి నెల విద్యుత్తు బిల్లు సక్రమంగా చెల్లిస్తున్నానని, రావాల్సిన అవసరం లేదని కటువుగా బదులిచ్చాడు. దాంతో పోలీసులు వెంటనే ఇక్కడకు రాకుంటే కనెక్షన్‌ కట్‌ చేస్తామని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరేంద్ర అక్కడకు వెళ్లాడు.  చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుణ్ని అరెస్టు చేసి కస్టడీకి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని