రుణయాప్‌ కమీషన్‌ ఏజెంట్ల అరెస్టు

రుణయాప్‌ మోసగాళ్లకు సహకరిస్తున్న కాల్‌ సెంటర్‌ యజమానితోపాటు కమీషన్‌ తీసుకుంటూ అతనికి సహకరించిన అయిదుగురిని అరెస్టు చేసినట్లు వైయస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

Updated : 05 Oct 2022 06:32 IST

ప్రధాన నిందితుల కోసం గాలింపులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: రుణయాప్‌ మోసగాళ్లకు సహకరిస్తున్న కాల్‌ సెంటర్‌ యజమానితోపాటు కమీషన్‌ తీసుకుంటూ అతనికి సహకరించిన అయిదుగురిని అరెస్టు చేసినట్లు వైయస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మంగళవారం వివరాలను వెల్లడించారు. ‘వైయస్‌ఆర్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఎర్రమాచుపల్లెకు చెందిన బండి సాయికుమార్‌రెడ్డి ఓ ప్రైవేటు సిమెంట్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆయన రుపీస్‌ క్యాష్‌-రుపీస్‌ లోన్‌యాప్‌లో రూ.95 వేల రుణానికి దరఖాస్తు చేశారు. నిర్వాహకులు అతని ఖాతాకు రూ.65 వేలు పంపించారు. అతని నుంచి విడతల వారీగా రూ.3,71,952 వసూలు చేశారు. ఇంకా బకాయి ఉందని, చెల్లించకుంటే మీ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అంతర్జాలంలో పెడతామని బెదిరించారు. బాధితుడు 2022 ఏప్రిల్‌ 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూపీఐ ఐడీలను సేకరించి, నిందితుల వివరాలను తెలుసుకున్నారు. రూ.లక్షకు రూ.10 వేల కమీషన్‌ తీసుకుంటూ యాప్‌ నిర్వాహకులకు సహకరిస్తున్న లింగుట్ల రంగనాథ్‌ను పది రోజుల కిందట అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారంతో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం’ అని ఎస్పీ వివరించారు.

నిందితులంతా తెలంగాణ వారే 

‘తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన సుతారపు సాయికుమార్‌... హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అనుమతులు లేకుండానే ఇటేడాన్‌ సొల్యూషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అందులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ స్నేహితుల ఖాతాల్లోకి రుణవాయిదాల చెల్లింపుల డబ్బులను వేయించుకుని, వాటిలో తమ కమీషన్‌ మినహాయించుకుని, మిగిలిన డబ్బులను దూర ప్రాంతాల్లో ఉన్న వివిధ ఖాతాలకు బదిలీ చేసేవారు. ఇలా వీరు ఇప్పటివరకు రూ.5 కోట్ల మేరకు లావాదేవీలు జరిపారు. సాయికుమార్‌తోపాటు కంపెనీలో పనిచేస్తున్న జుటుక శివ(నాగర్‌కర్నూలు జిల్లా), పాలకొల్లు సాయితేజ (కొత్తగూడెం జిల్లా),  నల్లోలు నవీన్‌గౌడ్‌, పూరిమిట్ల శ్రీకాంత్‌ (హైదరాబాద్‌ బోయినపల్లి)లను ప్రత్యేక బృందాలు అరెస్టు చేశాయి. ప్రధాన సూత్రధారులైన అన్బు (తమిళనాడు), జాన్‌యాదవ్‌(రాజస్థాన్‌)ల కోసం గాలిస్తున్నాం’ అని ఎస్పీ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని