Cyber fraud: పీఎఫ్‌ సొమ్ము ఆశ చూపి వృద్ధ దంపతులకు ₹4 కోట్లు టోకరా!

Fraud alert: పీఎఫ్‌ సొమ్ము ఆశ చూపి ఓ వృద్ధ జంట నుంచి రూ.4 కోట్లు కొట్టేసిన వైనం ఇదీ. ముంబయిలో ఈ ఘటన జరిగింది.

Published : 26 Oct 2023 17:08 IST

Cyber fraud | ముంబయి: కొంత డబ్బు జమ చేశారంటే పెద్ద మొత్తంలో పీఎఫ్‌ అందుకోవచ్చంటూ ఓ వృద్ధ జంటకు సైబర్‌ నేరగాళ్లు ఎర వేశారు. వారిని మాయ మాటలతో మభ్యపెట్టారు. విడతల వారీగా రూ.4.35 కోట్లు కొట్టేశారు. ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్‌ మధ్య ఈ తంతు కొనసాగింది. తాజాగా ఆ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముంబయిలోని కఫ్‌ పరేడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయిలో 70 ఏళ్లు పైబడిన వృద్ధ జంట నివసిస్తోంది. వృద్ధురాలి భర్త గతంలోఓ ప్రముఖ ఐటీ, కన్సల్టింగ్‌ కంపెనీలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఉద్యోగ విరమణ అనంతరం గతంలో చేసిన పెట్టుబడులను ఉపసంహరించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 71 ఏళ్ల వృద్ధురాలికి ఓ రోజు గుర్తు తెలీని మహిళ నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాను ఎంప్లాయీస్‌ ఫ్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నానని చెప్పింది. ఆమెను నమ్మించేందుకు భర్తకు సంబంధించిన వివరాలన్నీ చెప్పింది. దీంతో మాట్లాడుతున్న వ్యక్తిని వృద్ధురాలు పూర్తిగా నమ్మింది.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది ఏపీ వాసుల మృతి

భర్త పీఎఫ్‌ ఖాతాలో 20 ఏళ్ల కాలానికి కంపెనీ రూ.4 లక్షలు డిపాజిట్‌ చేసిందని కాలర్‌ పేర్కొంది. అది మెచ్యూర్‌ అయితే రూ.11 కోట్ల మొత్తం వస్తుందని నమ్మబలికింది. ఇందుకోసం టీడీఎస్‌, జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఆమె చెప్పింది నిజమేనని నమ్మి కాల్‌ చేసిన మహిళ చెప్పినట్లుగా ఓ బ్యాంకు ఖాతాలో ఆ వృద్ధ జంట డబ్బు జమ చేసింది. అలా విడతల వారీగా రూ.4.35 కోట్లు జమ చేశారు. మే నెల నుంచి సెప్టెంబర్‌ వరకు వేర్వేరు సందర్భాల్లో ఈ తంతు కొనసాగింది.

ఇంకా సొమ్ములు కావాలని కాల్‌ చేసిన వ్యక్తి డిమాండ్‌ చేయడంతో తమ దగ్గర లేవని జంట సమాధానమిచ్చింది. అప్పటి వరకు సౌమ్యంగా అడుగుతూ వచ్చిన కాలర్‌.. తర్వాతి నుంచి ఐటీ శాఖకు సమాచారం ఇస్తామంటూ బెదిరించడం ప్రారంభించింది. ఈ చర్యలతో మోసపోయామని గమనించిన ఆ వృద్ధ జంట పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదు మేరకు ఐపీసీతో పాటు, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని