Crime news: రూ.100 కోట్ల విలువైన ఆస్తి.. కుటుంబానికి తెలీకుండా విక్రయం!

Mumbai crime: ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ మహిళ తన సోదరులతో కలిసి పెద్ద కుట్రకు తెరలేపింది. రూ.100 కోట్ల విలువైన కుటుంబ ఆస్తిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించింది.

Updated : 25 Oct 2023 17:51 IST

Mumbai crime | ముంబయి: డబ్బు కోసం ఓ మహిళ పెద్ద కుట్రకు తెరతీసింది. తన సొంత అన్నదమ్ములతో కలిసి ముంబయి నడిబొడ్డున ఉన్న రూ.100 కోట్ల విలువైన ఆస్తిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించింది. తీరా విషయం ఆస్తి హక్కు కలిగిన ఇతర సోదరులకు తెలియడంతో గుట్టురట్టైంది. వారి ఫిర్యాదు మేరకు అబిదా జాఫర్‌ ఇస్మాయిల్‌ (58) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె కస్టడీలో ఉన్నారు.

సెంట్రల్‌ ముంబయిలో ఈ ఆస్తి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతం బిజినెస్‌ హబ్‌గా అవతరించింది. అక్కడున్న భవనాల్లో వేర్వేరు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. ఈ ఆస్తి విలువ సుమారు రూ.100 కోట్ల పైమాటే. వాస్తవంగా ఈ ఆస్తి అన్నదమ్ములైన జాఫర్‌ కపాడియా, లతీఫ్‌ కపాడియాది. వీరి మరణానంతరం వారి వారసులకు హక్కులు దఖలుపడ్డాయి. అద్దె ద్వారా వస్తున్న మొత్తం లతీఫ్‌ కుటుంబానికి వస్తోంది. లతీఫ్‌ పెద్ద కుమారుడు అజీజ్‌ (74) ప్రాపర్టీకి సంబంధించి నిర్వహణ, ఇతర వ్యవహారాలు చూస్తుంటాడు. లతీఫ్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అజీజ్‌, రహీమ్‌, అమీనా, అబిదా, మాలిక్‌ ఉన్నారు. జాఫర్‌కు ఫర్జానా, రుక్సానా, రెహానా, అమిన్‌, అన్వర్‌, మెహజబీన్‌, అయాజ్‌ పిల్లలున్నారు.

జాఫర్‌ కుమారుడు అయిన అయాజ్‌కు ఇటీవల ఆస్తి అమ్మకం గురించి విషయం తెలిసింది. తమ ఉమ్మడి ఆస్తికి సంబంధించి లతీఫ్‌ కుటుంబం ఓ డెవలపర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆస్తికి సంబంధించి పూర్తి హక్కులు తమకే ఉన్నట్లు పత్రాలు సృష్టించి డెవలపర్‌కు విక్రయించినట్లు తెలిసింది. తమకు తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా ఆస్తిని విక్రయించడంపై అయాజ్‌ పోలీసులను ఆశ్రయించాడు. సోదరులకు పవర్‌ ఆఫ్‌ అటార్నీగా ఉన్న అమినా ఆ డాక్యుమెంట్లపై సంతకం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు ప్రతిగా రూ.3.5 కోట్లు నగదు రూపంలో, కొత్త భవనంలో రెండు ఫ్లాట్లు ఇచ్చేందుకు ఆమెతో ఇతర సోదరులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అమీనా, రహీమ్‌, మాలిక్‌కు డబ్బులు అవసరం అవ్వడంతో ఈ కుట్రకు తెరలేపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అబిదా ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు