logo

రూ.3 లక్షల్లో ముచ్చటైన ఇల్లు

నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు, దానికి వినియోగించే సామగ్రి ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి. చిన్నపాటి ఇల్లు కట్టాలన్నా.. కనీసం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతోంది.

Updated : 30 May 2023 06:55 IST

ఆదివాసీల కోసం ప్రత్యేక నిర్మాణాలు
న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌, తిర్యాణి

కెరమెరి మండలం శివగూడలో ప్రయోగాత్మకంగా కట్టిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇల్లు

నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు, దానికి వినియోగించే సామగ్రి ఖర్చులు తీవ్రంగా పెరిగి పోయాయి. చిన్నపాటి ఇల్లు కట్టాలన్నా.. కనీసం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవుతోంది. అంత డబ్బులు వెచ్చించే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ఆదివాసీల ఇళ్లు చాలా వరకు చుట్టూ కర్రలు, తడకలు అల్లుకొని పైన గూణతో నిర్మించుకుంటారు. బలంగా గాలి వీచినా.. భారీ వర్షం కురిసినా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి. దీనికితోడు కొండలు, గుట్టలపై ఆవాసాలు ఏర్పరచుకునే గిరిజనులకు నిర్మాణానికి అవసరమైన కంకర, ఇసుక, ఇటుక, సలాక తదిర సామగ్రి అక్కడికి తీసుకెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్న పని.

ఈ నేపథ్యంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ విధానం సరైనది అని గుర్తించారు గతంలో కుమురం భీం జిల్లా అడిషినల్‌ కలెక్టర్‌గా పనిచేసిన వరుణ్‌రెడ్డి(ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌). తాను శిక్షణలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో గమనించిన విధానం తనను ఆకట్టుకోవడంతో ఆలోచనను అప్పటి కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారులు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లతో సర్వే చేయించి చివరి ఓ నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల లాభాలే కానీ నష్టాలు లేవని గ్రహించి జిల్లాలో ప్రయోగాత్మకంగా తిర్మాణిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కెరమెరి మండలం శివగూడలో ఇల్లు నిర్మించారు. దానికి స్పందన రావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 92 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

వంట గదిలో నల్లా పరిశీలిస్తున్న ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ భీంరావు, పంచాయతీరాజ్‌ ఈఈ రామ్మోహన్‌రావు

ఫలించిన   ప్రయోగం..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలే ఎక్కువ. గిరిజనల్లో కొలాంలు అన్ని రంగాల్లోనూ అత్యంత వెనుకబడి ఉన్నారు. పూరి గుడిసెలే వీరికి ఆధారం. ఇలాంటి వారి కోసం కుమురం భీం జిల్లాలో మూడు ప్రాంతాల్లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో 40 ఇళ్ల నిర్మాణాలకు అధికారులు సీసీడీపీ(కన్సర్‌వేషన్‌ కమ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌) నిధులు కేటాయించారు. ఈ పనులను గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొదట కుమురం భీం జిల్లా కెరమెరి మండలం శివగూడలో ప్రయోగాత్మకంగా నిర్మించారు. ఇల్లు చూడటానికి బాగా ఉండటంతో తిర్యాణి మండలం భీంజిగూడ పంచాయతీ పరిధిలోని బుగ్గగూడలో 13, కెరమెరి మండలం శివగూడలో 13, సిర్పూర్‌(టి) మండలం కొలాంగూడ వేంపల్లిలో 12 చొప్పున నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటి వరకు 13 పూర్తి కాగా తొమ్మిది నిర్మాణంలో ఉన్నాయి. మిగతావి ప్రారంభించాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 92 ఇల్లు మంజూరైనట్లు కుమురం భీం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి భీంరావ్‌ తెలిపారు.

తిర్యాణి మండలం బుగ్గగూడలో నిర్మిస్తున్న ఇళ్లు

తక్కువ ఖర్చుతో మన్నికగా

ఒక్కో ఇంటిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొదట బేస్‌మెట్‌ నిర్మించి ఇనుప చువ్వలతో ప్రేమ్‌ ఏర్పాటు చేస్తారు. వాటి చూట్టూ సిమెంట్‌ మిశ్రమంతో తయారు చేసిన 75 ఎంఎం(మూడు అంగుళాల) మందం గల ఏరోకాన్‌ ప్యానళ్లను అమరుస్తున్నారు. దీనికి టాటా- ఏరోనాటికల్‌ షీట్ష్‌(హైదరాబాద్‌) వారి సాయం తీసుకుంటున్నారు. పైకప్పు రేకుల ద్వారా వేసవిలో వేడిమి నుంచి రక్షణకు పాల్‌సీలింగ్‌ వేస్తున్నారు. టైల్స్‌ ఫ్లోరింగ్‌, లప్పం, నల్లాలు, విద్యుత్తు, రంగులు వేసి ఆకర్షణగా మలుస్తున్నారు. ఇంటి నిర్మాణం కేవలం రూ.మూడు లక్షల్లోనే పూర్తవుతోంది. ఇది సుమారు 25 ఏళ్ల వరకు మన్నికగా ఉంటుందని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. గాలి, వానలను తట్టుకొంటుందని.. అగ్ని ప్రమాదాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెబుతున్నారు. ఒక్కోసారి ఆదివాసీ గ్రామాల్లో విభేదాలు వచ్చినప్పుడు.. వర్గాలు చీలిపోయి అడవులకు సమీపంలో తాత్కాలిక గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఈ రెడీమేడ్‌ ఇళ్లను.. విప్పుకొని సామగ్రిని వెంట తీసుకొని మళ్లీ నిర్మించుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.


తిర్యాణి మండలం బుగ్గగూడలో 34 కొలాం కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ అందరివి దాదాపుగా ఇలా కర్రలు, తడకలతో కట్టిన ఇళ్లే ఉన్నాయి. మొదటి విడతలో వీళ్లకు 13 ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఇళ్లు నిర్మిస్తున్నారు.


కుటుంబాలకు..

కొలాం  మొదట ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన కొలాం కుటుంబాలకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ విధానంలో అధికారులు ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. రోజుల వ్యవధిలో తక్కువ విస్తీర్ణంలో అతి తక్కువ వ్యయంతో రెండు గదులు(లబ్ధిదారు ఇష్టాన్ని బట్టి కిచెన్‌, హాల్‌, బెడ్‌రూం) నిర్మిస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు సైతం ఈ విధానంలో చేపడుతున్నారు.


పనులు పూర్తి కావొచ్చాయి..
- ఆత్రం భీంరావు, బుగ్గగూడ

వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రేకుల షెడ్డులో భార్య, ఇద్దరు పిల్లలతో తలదాచుకుంటున్నాం. ఏటా వానాకాలం వచ్చిందంటే భయంతో గడపాల్సిన పరిస్థితి. ఇంట్లో నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పక్కా నిర్మాణంతో తమకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఇంటి నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని