logo

మంచి భోజనం తింటున్నామా?

ఆహారమే చక్కని ఔషధం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై అవగాహన లేకపోవడం.. ఎక్కడ పడితే అక్కడ తినేయడం, నాణ్యత గురించి తెలియకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు.

Updated : 07 Jun 2023 06:02 IST

నేడు ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం : ఆహారమే చక్కని ఔషధం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై అవగాహన లేకపోవడం.. ఎక్కడ పడితే అక్కడ తినేయడం, నాణ్యత గురించి తెలియకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఆహారపు అలవాట్లు క్రమేణా మారుతున్నాయి. పోషకాహారం స్థానంలో బర్గర్లు, పిజ్జాలు, పఫ్‌లు, నూడుల్స్‌ వచ్చి చేరుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ టిఫిన్‌ సెంటర్లు, బజ్జీల బండ్లు, హోటళ్లు వెలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వచ్చేశాయి. ప్రజల ఆకలిని, అభిరుచిని కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నాసిరకం, గడువు తీరిన వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా ఆహారపు అలవాట్లు, నాణ్యతపై తీసుకుంటున్న చర్యలపై కథనం.

సురక్షిత ఆహారంపై అవగాహన కలిగించడంతో పాటు ప్రజలను చైతన్యం చేసేందుకు ఐరాస ఏటా జూన్‌ ఏడో తేదీన ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కలుషిత ఆహారం కారణంగా ఏటా అనేక మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించాలని డిసెంబరు, 2018లో ఐరాస జనరల్‌ అసెంబ్లీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సురక్షిత ఆహారం, పోషక విలువలు, కలుషిత ఆహారం వల్ల కలిగే అనారోగ్యం తదితర అంశాలపై చర్చలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘‘ఆహార ప్రమాణాలు.. ప్రాణాలు కాపాడతాయి’’ అనే అంశాన్ని తీసుకొని ఆహార నాణ్యతపై ప్రచారం చేయడంతో పాటు అవగాహన కలిగిస్తారు.

అడ్డూఅదుపు లేదు..

హోటళ్ల ఏర్పాటులో అడ్డు, అదుపు లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు తినే వస్తువులు విక్రయించే ప్రతి ఒక్కరు అనుమతి తీసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ హోటళ్లు వెలుస్తున్నాయి. తనిఖీలు చేసే సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో నామమాత్రంగా తనిఖీలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించకపోయినా.. అడిగే వారు లేకపోవడంతో నాసిరకం వస్తువులతో తయారుచేసే తినుబండరాలు ఎక్కువగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. పెద్ద కంపెనీలు ఉత్పత్తి చేసే ఆహార ఉత్పత్తుల మాదిరిగానే నకిలీలు మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి.. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వారసంతల్లో కల్తీ, నకిలీ వస్తువులే అధికంగా లభిస్తుంటాయి. ఉమ్మడి జిల్లా మొత్తంలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒక్కరే ఉన్నారు. సహా అధికారులు ఒకరిద్దరు ఉండటంతో తనిఖీలు తక్కువగా జరుగుతున్నాయి. జిల్లా మొత్తంలో వేల సంఖ్యలో హోటళ్లు, ఇతర దుకాణాలు ఉంటే కేవలం అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి.

అందరి బాధ్యత

ఆహార భద్రత అనేది ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులతో పాటు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. సురక్షిత ఆహారం అందించడంలో కూలీ నుంచి మొదలు రైతుల వరకు, చిన్న బడ్డీ కొట్టు నుంచి హోటళ్ల వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. పంటల సాగులో పురుగు మందుల వినియోగం తగ్గించాలి. టిఫిన్‌ సెంటర్లు, హోటళ్ల యజమానులు నాణ్యమైన సరకులు ఉపయోగించాలి.

కొంపముంచుతున్న వీకెండ్‌ కల్చర్‌..

ఉమ్మడి జిల్లా మొత్తంలో 27.41 లక్షల జనాభా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మారిన ఆహారపు అలవాట్లు, నాణ్యత లేని ఆహారం తీసుకోవడంతో చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో సమయం లేక, ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోవడం, బయట తినడం, లేదా ఆర్డర్‌ చేసుకొని ఇంట్లోనే తినేస్తున్నారు. కొన్ని సార్లు అది కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బయట తినే ఆహారాన్ని ఎలా చేస్తున్నారో తెలియదు. ఏ నూనె వాడుతున్నారు. శుభ్రత ప్రమాణాలు ఏ మేరకు పాటిస్తున్నారనేది తెలియదు. ఇటీవల వీకెండ్‌ కల్చర్‌ కూడా వచ్చేసింది. ఆదివారం రాగానే కుటుంబంతో సహా హోటళ్లకు వెళ్లి రకరకాల ఫ్రైలు, జంకుఫుడ్‌ లాగించేస్తున్నారు.

వెంటాడుతున్న అనారోగ్యం

సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, పౌష్టికాహారం తీసుకోక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాలో గతంతో పోలిస్తే బరువు ఎక్కువ కావడం, రక్తపోటు, మధుమేహం వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని గుర్తించారు.

పురుషులతో పోలిస్తే మహిళల్లో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉంది. జిల్లా జనాభాలో 40 శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నట్లు తేలింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో 40 శాతానికి పైగా అధిక బరువు ఉంటే కుమురం భీం జిల్లాలో 14 శాతం మంది ఉన్నారు.

అధిక రక్తపోటులో పురుషులు, స్త్రీలు పోటీ పడుతున్నారు. రక్తపోటులో మంచిర్యాల జిల్లా ముందు స్థానంలో ఉంది.. పురుషుల్లో 60 శాతం మందికి ఉండగా, ఇక్కడ స్త్రీలు 49.3 శాతంతో ఉన్నారు.. తర్వాత కుమురం భీం, నిర్మల్‌ జిల్లాల్లోని పురుషుల్లో 50 శాతానికి పైగా ఉంది. స్త్రీలలో పది శాతం తక్కువగా ఉంది.

మధుమేహం విషయానికి వస్తే పురుషులు, స్త్రీలు సమానంగా ఉన్నారు. అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో పురుషుల్లో 30 శాతం ఉండగా, మంచిర్యాల జిల్లాలో స్త్రీలలో 26 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని