logo

గడ్డెన్న.. ఇక్కడ పెద్దన్న

రాష్ట్రంలో ముథోల్‌ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ముథోల్‌ నియోజకవర్గం మహారాష్ట్రలో ఉండేది.  భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చింది. 2014లో ప్రత్యేక తెలంగాణలో సుస్థిరమైంది.

Published : 28 Oct 2023 03:08 IST

భిన్న సంస్కృతి.. విభిన్న తీర్పుల ముథోల్‌
భైంసా, న్యూస్‌టుడే

రాష్ట్రంలో ముథోల్‌ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ముథోల్‌ నియోజకవర్గం మహారాష్ట్రలో ఉండేది.  భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చింది. 2014లో ప్రత్యేక తెలంగాణలో సుస్థిరమైంది. ఇలా మూడు రాష్ట్రాలు మారిన ముథోల్‌ ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు పండగలు, ఉత్సవాలు ఇక్కడి ప్రజలు జరుపుకుంటారు. ఇప్పటి వరకు 14 సార్లు జరిన ఎన్నికల్లో ఆరుగురు శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహించారు. ఒకే అభ్యర్థి ఆరు సార్లు, రెండుసార్లు స్వతంత్రులు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా ఒకసారి ఏకగ్రీవమైంది.

రాష్ట్రంలో ఒకటైతే.. ఇక్కడ మరొకటి...

నియోజకవర్గం ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉంటుంది. 1957 నుంచి జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు విలక్షణమైన తీర్పునిస్తుంటారు. పలుమార్లు అధికారంలో ఒక పార్టీ వస్తే ఇక్కడ విపక్ష పార్టీ జెండా ఎగురుతుంది. గడిచిన 66 సంవత్సరాల్లో 1983లో తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ప్రభుత్వం అధికారం చేపట్టగా ముథోల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డెన్న ఎన్నికయ్యారు. 1999లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో తెదేపా ప్రభుత్వం ఏర్పడగా మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డెన్న గెలుపొందారు. 2004లో సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి ఇక్కడ తెరాస అభ్యర్థి బోస్లే నారాయణరావు పటేల్‌, 2009లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగా ఇక్కడ తెదేపా అభ్యర్థి డా.వేణుగోపాలచారి గెలుపొందారు. 2014లో రాష్ట్ర మొత్తం తెరాస(ఇప్పటి భారాస) ప్రభంజనంలోనూ ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జి.విఠల్‌రెడ్డి గెలుపొందడం విశేషం.

నీటి వనరులు..

ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన గడ్డెన్న కల చివరి అంకంలో నెరవేరింది. ఆయన పేరిటే సుద్దవాగుపై ప్రాజెక్టు నిర్మించారు. 14 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు ద్వారా లోకేశ్వరం, భైంసా మండలాల్లోని వ్యవసాయ భూములకు నీరు చేరువైంది. భైంసా మండలంలోని సిరాలలో నిజాం కాలంలో నిర్మించిన సిరాల ప్రాజెక్టు ద్వారా సుమారు 1,900 ఎకరాలకు రెండుపంటలకు సరిపడా నీరు అందేది. కాగా ఇటీవల భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయింది. 

ఆరుసార్లు ఒకరే..

ప్రజల అభిమానాన్ని చూరగొన్న మాజీ మంత్రి, దివంగత నేత గడ్డిగారి గడ్డెన్న తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముథోల్‌ శాసన సభ స్థానానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా ఆయనే ఆరుసార్లు గెలుపొందారు. దీంతో నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అనే ముద్రపడింది. 1967లో ఒకసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందగా, 1972 నుంచి 1985 వరకు మూడుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. ఆయన తర్వాత తనయుడు జి.విఠల్‌రెడ్డి 2014లో మొదటిసారి కాంగ్రెస్‌ జెండాపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాస (భారాస)లో చేరారు. 2018లో భారాస అభ్యర్థిగా పోటీ చేసి రెండో సారి ఎమ్మెల్యే అయ్యారు.

ప్రత్యేకత ఇదీ..

దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న బాసర ఆలయం ముథోల్‌ నియోజకవర్గంలో ఉంది. మహారాష్ట్ర సరిహద్దు కావడంతో ఇక్కడంతా మరాఠి సంస్కృతి సంప్రదాయాలు ఎక్కువే. అలాగే వ్యాపార కేంద్రమైన భైంసా మార్కెట్‌ ఆదిలాబాద్‌ తర్వాత రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ ప్రాంతంలో ప్రధాన పంట పత్తి సాగు చేసేవారు. దీంతో పత్తి పరిశ్రమలు వెలిశాయి. పది సంవత్సరాల క్రితం నుంచి పత్తిసాగు తగ్గించడంతో కొన్ని పరిశ్రమలు మూతపడటంతో చాలా మంది కూలీలు ఉపాధికి దూరమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని