logo

అరచేతిలో అతివకు భద్రత

ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్‌ యాప్‌లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Published : 28 Mar 2024 03:21 IST

పోలీసుశాఖ టీ-సేఫ్‌ యాప్‌ ప్రారంభం

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా అతివలపై జరుగుతున్న నేరాలు ఆగడం లేదు. ఇప్పటికే మహిళలు, యువతుల, విద్యార్థినుల భద్రతకు అనేక మొబైల్‌ యాప్‌లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసుశాఖ తాజాగా టీ-సేఫ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 12న ప్రారంభించారు.

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడికి వెళ్లినా తమ వివరాలు అందులో నమోదు చేసుకుని ప్రయాణం చేస్తే పూర్తి సమాచారం పోలీసుశాఖ ఆధీనంలోకి వెళ్తుంది. వారి నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు ఉంటాయి. స్పందన లేని పక్షంలో వెంటనే పోలీసులు మొబైల్‌ నెంబరు ఆధారంగా ట్రాకింగ్‌ చేసి వారు ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని రక్షిస్తారు. మంచిర్యాల జిల్లాలో గడిచిన ఏడాదిలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై 145 కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా వివిధ రకాలుగా మహిళలు ఎదుర్కొన్న వేధింపులపై వందల్లో ఉన్నాయి.

డౌన్‌లోడ్‌ ఇలా..

పోలీసుశాఖ రూపొందించిన టీ-సేఫ్‌ యాప్‌ను గూగుల్‌ప్లే స్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఫోన్‌ నెంబరు ఇచ్చి లాగిన్‌ కావాలి. ఆ తర్వాత అందులో పేరు, ఆడ, మగ అనే వివరాలు నమోదు చేసుకోవాలి. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఈ నెంబరును అందులో ఎంటర్‌ చేయాలి. వెంటనే వెరిఫై(పరిశీలన) చేసుకుంటుంది. మెయిల్‌ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేసుకోవాలి. ప్రయాణిస్తున్న ప్రాంతం వివరాలు, వాహనం పేరు, నంబరు నమోదు చేస్తే పూర్తి వివరాలు పోలీసుల నిఘా పరిధిలోకి వెళ్తాయి.

వినియోగం ఇలా..

ప్రయాణించే సమయంలో దీన్ని ఆన్‌ చేసుకుంటే టీ-సేఫ్‌ యాప్‌ వినియోగదారుల నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు. బేసిక్‌ ఫోన్‌, స్మార్ట్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఏదైనా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆటోమెటిక్‌ సేఫ్టీ మెసేజ్‌ వస్తుంది. వాటికి నాలుగు అంకెల సీక్రెట్‌ పాస్‌కోడ్‌ పంపించాలి. దాని ఆధారంగా మనం సురక్షితంగా ఉన్నామని పోలీసులు గుర్తిస్తారు. ఎలాంటి స్పందన లేకుంటే అప్రమత్తమై మనం ఉన్న చోటకు పోలీసులు వస్తారు. 110, 112 నంబరుకు ఫోన్‌ చేసి ఐవీఆర్‌ ఆప్షన్‌ ద్వారా చరవాణిలో ఉండే ఎనిమిది నంబరును ఎంపిక చేసుకుని మానిటరింగ్‌ రిక్వెస్టు పెట్టాలి. వెంటనే పోలీసుల పర్యవేక్షణ మొదలవుతుంది. తెలంగాణ సరిహద్దులను దాటినా, ఎక్కువ సమయం ఎక్కడైనా ఆగినా, ప్రయాణ మార్గం మారినా టీ సేఫ్‌ కంట్రోల్‌రూం నుంచి నేరుగా 100 డయల్‌కు అటోమెటిక్‌గా ఫోన్‌కాల్‌ వెళ్తుంది. వెంటనే స్పందించి సురక్షితమని చెబితే సరిపోతుంది. లేదంటే నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు.


నిర్భయంగా ఉండేందుకే..

- శ్రీనివాస్‌, రామగుండం పోలీసు కమిషనర్‌

మహిళలు ఎట్టిపరిస్థితుల్లోను అధైర్యానికి గురికావొద్దు. ప్రతి ఒక్కరిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే పోలీసుల లక్ష్యం. అందుకోసమే టీ సేఫ్‌ యాప్‌ను రూపొందించారు. మహిళలు, యువతులు, విద్యార్థినులు ఈ యాప్‌ను వినియోగించుకోవాలి. ఆపదలో ఉన్న మహిళ ఈ యాప్‌ ద్వారా సురక్షితంగా బయటపడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని