logo

ఎన్నికల పోరు.. స్థిరాస్తి జోరు

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మళ్లీ స్థిరాస్తి వ్యాపారం పుంజుకొంది. పారిశ్రామిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రం మంచిర్యాల కావడంతో విశ్రాంత ఉద్యోగులు, కార్మికులు ఎక్కువ మంది ఇక్కడే స్థిరపడటానికి ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు.

Published : 16 Apr 2024 02:46 IST

రెండు నెలలుగా పెరిగిన దస్తావేజుల రిజిస్ట్రేషన్లు

మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మళ్లీ స్థిరాస్తి వ్యాపారం పుంజుకొంది. పారిశ్రామిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రం మంచిర్యాల కావడంతో విశ్రాంత ఉద్యోగులు, కార్మికులు ఎక్కువ మంది ఇక్కడే స్థిరపడటానికి ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. మంచిర్యాల, నస్పూరు, క్యాతనపల్లి పురపాలక సంఘాల్లో భూదందా జోరుగా సాగుతోంది. మిగతా మందమర్రి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, పట్టణాల్లో ప్రధాన రహదారుల పక్కన వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు భూవ్యాపారం కాస్త తగ్గింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ప్లాట్లు కొనుగోలుకు వేసవి కాలం అనుకూలం కావడంతో రెండు నెలలుగా మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో గజం భూమికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు.

ఆగని అక్రమ వెంచర్లు

పట్టణ ప్రాంతాల్లో భూ వ్యాపారులు, కొనుగోలుదార్లను ఆకర్షించేలా వెంచర్లలో పాట్లను అందంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో రహదారుల పక్కన సిమెంట్‌ ఇటుకలతో పిట్టగోడలు నిర్మించి రంగులు వేస్తున్నారు. రహదారిపై వెళ్లే ప్రజల దృష్టి ప్లాట్లపై పడేలా చేస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో చాలాచోట్ల వెంచర్లకు లేఔట్‌ అనుమతి లేకుండానే ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్నారు. చాలామంది లేఔట్‌ అనుమతి లేని ప్లాట్లు కొనుగోలు చేసి, భూఅక్రమార్కుల చేతుల్లో నష్టపోతున్నారు. మంచిర్యాల, నస్పూరు పురపాలక సంఘాల్లో ప్రభుత్వ అసైన్డ్‌ భూములను ప్లాట్లుగా మార్చి అమ్మగా, మందమర్రిలో 1/70 ఏజెన్సీ భూములను కూడా ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్లాట్లు కొనుగోలు చేసే యజమానులు ముందు ఆయా తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఆ భూముల పాత రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించుకోవాలి. అన్ని దస్త్రాలు సరిగ్గా ఉండి, లేఔట్‌ అనుమతి ఉన్న ప్లాట్లు కొనుగోలు చేయాలి. లేకుంటే అనేక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని