logo

నకిలీ వేలిముద్రలతో పీఎంకేకే పథకంలో మోసం

నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 23 Apr 2024 02:35 IST

వివరాలు వెల్లడిస్తున్న సీపీ శ్రీనివాస్‌

మంచిర్యాల నేరవిభాగం, గోదావరిఖని, న్యూస్‌టుడే: నకిలీ వేలిముద్రలతో హాజరు శాతం ఎక్కువగా చూపించి బిల్లులు కాజేసిన ప్రధానమంత్రి కౌశల్య కేంద్ర పథకం నిర్వాహకులను రామగుండం కమిషనరేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు కౌశల్య కేంద్రం ద్వారా వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందుకు భోపాల్‌ కేంద్రంగా నిర్వహించే అల్టిమేట్‌ ఎనర్జీ రీసోర్సు ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. వివిధ వృత్తుల్లో ఇచ్చే నైపుణ్య శిక్షణకు హాజరైన యువతీయువకుల సంఖ్య ఆధారంగా కేంద్ర ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా మంచిర్యాల కేంద్రానికి 320 మందికి అవకాశం కల్పించగా ఇటీవల దానిని 720 మందికి పెంచారు. ప్రస్తుతం మంచిర్యాల కేంద్రంలో యువతీ యువకుల సంఖ్య తగ్గి కేవలం 50 మంది వరకు మాత్రమే హాజరవుతున్నారు. దీంతో నిర్వహణ సంస్థకు ఆదాయం తగ్గడంతో నకిలీ వేలిముద్రల ద్వారా బయోమెట్రిక్‌లో నమోదు చేయాలని పథకం వేశారు. భోపాల్‌, తెలంగాణకు చెందిన ముఖ్య నిర్వాహకులు సాహిల్‌వలీ, శ్రీనివాస్‌ల సూచన మేరకు మంచిర్యాల కేంద్రం బాధ్యులు మల్లికార్జున్‌ ప్రణాళిక రూపొందించాడు. తనకు పరిచయం ఉన్న నర్సంపేటకు చెందిన విజయ్‌, అదే ప్రాంతానికి చెందిన సలీంజాఫర్‌, వెంకటేశ్వర్లు సహకారంతో 250 మంది అభ్యర్థులకు సంబంధించిన నకిలీ వేలిముద్రలను తయారు చేశారు. వాటితో రోజూ బయోమెట్రిక్‌లో నమోదు చేస్తూ వివరాలను పంపించారు. దీంతో ఒక్కో అభ్యర్థికి కేంద్రం తరఫున రూ.3 వేల చొప్పున బిల్లులు విడుదల అవుతున్నాయి. నకిలీ వేలి ముద్రల విషయమై వచ్చిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్సు పోలీసుల ద్వారా సోదాలు నిర్వహించినట్లు సీపీ వెల్లడించారు. కార్యాలయ బాధ్యులు దేవేందర్‌ను విచారించడంతో విషయం బయటపడిందన్నారు. ఆయా రికార్డులతో పాటు నకిలీ ఫింగర్‌ప్రింట్లు, బయోమెట్రిక్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సూత్రధారులైన మల్లికార్జున్‌, సలీంజాఫర్‌, వెంకటేశ్‌, దేవేందర్‌లను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ముఖ్య పాత్రదారులైన సాహిల్‌వలీ, శ్రీనివాస్‌లను అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్‌కుమార్‌, సీఐ బన్సీలాల్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని