logo

ముందే ఓటేశారు!

పోలింగ్‌ తేదీకి ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు ఓటేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టల్‌ ఓటును, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది.

Published : 04 May 2024 06:26 IST

తొలిరోజు 612 మంది వినియోగం

ఇంటి వద్దే ఓటు వేస్తున్న అంధురాలు

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : పోలింగ్‌ తేదీకి ముందే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు ఓటేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టల్‌ ఓటును, 85 ఏళ్లు దాటిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. తొలి రోజైన శుక్రవారం ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో ఉద్యోగులు 332 మంది, వయోవృద్ధులు, దివ్యాంగులు 280 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, బోథ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పోలీసులకు పోస్టల్‌ ఓటు వినియోగం కోసం ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసిన అధికారులు.. దివ్యాంగులు, వయోవృద్ధులు ఉన్నచోటుకే సిబ్బంది బృందాలుగా వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయించారు. బోథ్‌లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని పాలనాధికారి రాజర్షిషా, ఎస్పీ గౌష్‌ ఆలం సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఆదిలాబాద్‌లో మావల, ఆదిలాబాద్‌అర్బన్‌ ఉపతహసీల్దార్లు అరుణ, విజయకాంత్‌లు ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. ఇక్కడ ఉద్యోగులు 310 మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. ఇంటి వద్ద 77 మంది వయోవృద్ధులు, 108 మంది దివ్యాంగులు ఓటు వేశారు.

ఇంటి వద్దకే వెళ్లి ఓటు వేయిస్తున్న సిబ్బంది

ఎండకు తోడు దూరభారం

బోథ్‌ నియోజకవర్గ పరిధిలో హోం ఓటింగ్‌లో భాగంగా 46 మంది వయోవృద్ధులు, 49మంది దివ్యాంగులు తమ ఓటును వినియోగించుకున్నారు. పోస్టల్‌ ఓటింగ్‌ విషయానికి వస్తే తొలి రోజున కేవలం 22 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఆదిలాబాద్‌లో ఎన్నికల శిక్షణ ఉన్నచోటనే ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏర్పాటుచేయగా.. బోథ్‌ నియోజకవర్గంలో మాత్రం ఇచ్చోడ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన అధికారులు పోస్టల్‌ ఓటును మండల కేంద్రమైన బోథ్‌లో వినియోగించుకునే అవకాశం కల్పించడం ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవరోధంగా తయారైంది. తీవ్రమైన ఎండలకు తోడు భీంపూర్‌, తాంసి, తలమడుగు, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌, బోథ్‌ మండలాల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు అత్యధికులు జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోనే నివాసముంటూ పాఠశాలలకు, కార్యాలయాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ఉండటంతో ఎండలో బోథ్‌కు వెళ్లి ఓటువేసేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆదిలాబాద్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలోనే ఓటేసే అవకాశం కల్పిస్తే వెసులుబాటుగా ఉంటుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ దిశగా పాలనాధికారి ప్రత్యేకచొరవ చూపాలని సంబంధీకులు కోరుతున్నారు.

ఆదిలాబాద్‌లో ఓటేసిన ఉపాధ్యాయులు


ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి

పట్నాపూర్‌లో ఇంటి నుంచి ఓటింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ గౌష్‌ ఆలం

బోథ్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. బోథ్‌ మండలంలో శుక్రవారం  ఎస్పీ గౌష్‌ ఆలంతో కలిసి పర్యటించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్ను పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్నికల యాదృచ్ఛికీకరణ, ఈవీఎం స్ట్రాంగ్‌రూంలను అధికారులతో కలిసి పరిశీలించారు. సిబ్బందిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. బోథ్‌, పట్నాపూర్‌లలో నిర్వహిస్తున్న ఇంటి నుంచి ఓటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్‌ సుభాష్‌ చంద్ర, ఎస్‌ఐ రాము, ఏఎంసీ ఛైర్మన్‌ గంగారెడ్డి, పలు పార్టీల నాయకులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని