logo

అక్రమ దందా.. ఆ ఇద్దరి అండ

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పెద్దలకు కాసులు కురిపిస్తోంది. పీడీఎస్‌ బియ్యం అక్రమ దందా మూడు బస్తాలు, ఆరు వాహనాలుగా విరాజిల్లుతూ వారి జేబులు నింపుతోంది. నేతల అండదండలతో అది శ్రుతిమించుతోంది.

Updated : 04 May 2024 06:38 IST

సరిహద్దులు దాటుతున్న రాయితీ బియ్యం.. వంతపాడుతున్న అధికారులకు బాసట
మంచిర్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే

పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం పెద్దలకు కాసులు కురిపిస్తోంది. పీడీఎస్‌ బియ్యం అక్రమ దందా మూడు బస్తాలు, ఆరు వాహనాలుగా విరాజిల్లుతూ వారి జేబులు నింపుతోంది. నేతల అండదండలతో అది శ్రుతిమించుతోంది. ఇందుకోసం వారికి అనుకూలంగా ఉండే అధికారులను ఆయా ప్రాంతాల్లో పోస్టింగులు ఇప్పిస్తున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఆయాశాఖల అధికారులకు ప్రతి నెలా ఠంఛనుగా మామూళ్లు ముట్టజెపుతూ అవి పనిచేయనిచోట అధికారాన్ని అడ్డం పెట్టుకొని పీడీఎస్‌ బియ్యాన్ని జిల్లాల సరిహద్దులు దాటిస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఓ ఇద్దరు నేతల కనుసన్నల్లో ఈ రేషన్‌ బియ్యం అక్రమ దందా కొనసాగుతోంది.

ఇద్దరు నేతలు బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో బియ్యాన్ని సేకరించి వారానికి సుమారు 2 నుంచి 4 లారీల చొప్పున జిల్లా సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఈ దందా మొత్తం మూడంచెల వ్యవస్థగా కొనసాగుతోంది.

రేషన్‌ దుకాణాల నుంచే సేకరణ

నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఉన్న రేషన్‌ దుకాణాల ద్వారానే నేరుగా అక్రమార్కులు బియ్యాన్ని సేకరిస్తున్నారు. రేషన్‌ బియ్యంతో పనిలేని లబ్ధిదారులకు సంబంధించిన వారి కోటా బియ్యాన్ని డీలర్లే కిలోకి రూ.10 నుంచి 12కు కొనుగోలు చేస్తున్నారు. అయితే మరికొందరు అక్రమార్కులు నేరుగా వాహనాలను రాత్రి వేళల్లో రేషన్‌ దుకాణాల వద్దకు తీసుకొచ్చి డీలర్లు సేకరించిన బియ్యాన్ని తీసుకెళ్తున్నారు. దీనికి డీలర్లకు కిలోకు రూ.1 నుంచి 2 చెల్లిస్తున్నారు. ఆ వాహనాలు సేకరించిన బియ్యాన్ని ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి వాళ్లు రూ.2 వరకు చూసుకొని అప్పగించేస్తున్నారు.

ఎస్కార్టు వాహనాలతో లారీల తరలింపు..

వారు ఎంచుకున్న రహస్య ప్రాంతానికి వచ్చిన టన్నుల రేషన్‌ బియ్యాన్ని లారీల ద్వారా ఆ ఇద్దరు నేతలు సరిహద్దులు దాటిస్తున్నారు. వారంలో సుమారు 2 నుంచి 4 లారీల్లో బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వాటిని ఆయా మండలాలు, జిల్లాల సరిహద్దులు దాటేంత వరకు వారు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్‌ వాహనాలు ఎస్కార్టుగా లారీల ముందు వెనకా వెళ్తున్నారు. ఎవరైనా అధికారులకు వీటినిగురించి సమాచారమిస్తే ఆ సమాచారం కాస్త అక్రమార్కులకు చేరవేసి వాటి తరలింపు దారి మళ్లిస్తున్నారు. ఈ మూడంచెల వ్యవహారంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ ఇద్దరు నేతలే జోక్యం చేసుకొని దందా సక్రమంగా నడిచేలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

దందా కోసం ఎత్తుకు పైఎత్తులు..

అక్రమార్కులు రేషన్‌ బియ్యం దందా కోసం ఏకంగా తాండూరు మండల పరిధిలోని మారుమూల ప్రాంతంలో ఓ పెద్ద రైస్‌ మిల్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భూ వివాదం నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆ నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారు. కొత్తప్రభుత్వం వచ్చాక మళ్లీ నిర్మాణం పూర్తయ్యేందుకు వచ్చింది. ఈ దందా కొనసాగేందుకు నియోజకవర్గంలోని పలు శాఖల్లో ఆయా ప్రాంతాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారికి పోస్టింగులు వేయించినట్లు తెలుస్తోంది. ఇటీవల వారిపై ఆరోపణలు వచ్చినప్పటికీ ఇద్దరు ప్రజాప్రతినిధులతో నేతలకు ఉన్న సాన్నిహిత్యంతో వారిని కాపాడే ప్రయత్నాలు కూడా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంలో సస్పెండ్‌ అయిన పోలీసు అధికారిని కూడా రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా వారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగేలా చూసుకుంటున్నారు. మరికొంతమంది ఈ దందా సాగిస్తే వారిని పట్టిస్తున్నారు. ఇలా చేస్తూ కింది స్థాయిలో సేకరించే వారిని తమవైపు తిప్పుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని