logo

ఉపాధిహామీ పథకం రద్దుకు భాజపా కుట్ర: మంత్రి

కరోనా సమయంలో పనులు లేక అల్లాడిన నిరుపేదలను ఉపాధిహామీ పథకం కడుపు నింపిందని, అలాంటి గొప్ప పథకాన్ని పనిదినాలు తగ్గిస్తూ పూర్తిగా తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు.

Published : 04 May 2024 06:15 IST

కూలీలతో కలిసి నేలపై కూర్చుండి మాట్లాడుతున్న మంత్రి సీతక్క

సారంగాపూర్‌, న్యూస్‌టుడే: కరోనా సమయంలో పనులు లేక అల్లాడిన నిరుపేదలను ఉపాధిహామీ పథకం కడుపు నింపిందని, అలాంటి గొప్ప పథకాన్ని పనిదినాలు తగ్గిస్తూ పూర్తిగా తొలగించేందుకు భాజపా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సారంగాపూర్‌ మండలం ఆలూర్‌, చించోలి(ఎం), వంజర్‌, బీరవెల్లి గ్రామాల్లో ఆమె పర్యటించారు. కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వారి సమస్యలు సౌకర్యాలపై ఆరాతీశారు. నాలుగు నెలల ప్రభుత్వంపై ప్రతిపక్ష భారాస అర్థంలేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్‌ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పుల పాపానికి రూ.29 వేల కోట్ల వడ్డీ చెల్లించామన్నారు. ఈ డబ్బులతో రైతుల రుణమాఫీ ఎప్పుడో జరిగేదన్నారు. అయినా ఆగస్టు 15 లోగా రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు పరుస్తున్నామని చెప్పారు. ఎన్నికలు ముగియగానే కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. పదేళ్ల పాలనలో భాజపా చేసిందేమీ లేద,ని ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టిన గుడి, బడి, రహదారులు, ఇల్లు, ప్రాజెక్టులే నేడూ కనిపిస్తున్నాయన్నారు. ప్రజల సొమ్ముతో అయోధ్యలో కట్టిన గుడిని చూపించి ఓట్లు దండుకోవాలని భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు. భాజపాకు వేసే ప్రతి ఓటు రాజ్యాంగం తొలగింపును అంగీకరించినట్లే అవుతుందని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లు కూడా లేకుండా పోతాయని పేర్కొన్నారు. తొలిసారి ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానంలో ఆడబిడ్డ ఆత్రం సుగుణ బరిలో నిలిచిందని, ఆమెను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి విశ్వనాథ్‌, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు రాజ్‌మహ్మద్‌, నర్సయ్య, అబ్దుల్‌ ఆది, శ్రీనివాస్‌రెడ్డి, మారుతి, వెంకటరమణారెడ్డి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి

నిర్మల్‌, న్యూస్‌టుడే : పార్లమెంటు ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉందని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి ఆదివాసీ ముద్దుబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అధ్యక్షతన జరిగిన నిర్మల్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి  తొలిసారిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయడానికి మహిళకు అవకాశం ఇచ్చారని, అందరూ సమన్వయంతో ఉండి ఆమె గెలుపు కోసం కృషి చేయాలన్నారు.  రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, టీపీసీసీ కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ అప్పాల గణేశ్‌, ఏఐసీసీ కార్యదర్శి నరేశ్‌ జాదవ్‌, జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీలు, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్లు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని