logo

విద్యుత్తు.. కారాదు విపత్తు

విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఏటా మే 1-7 వరకు విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రచారం చేస్తున్నారు.

Updated : 04 May 2024 06:40 IST

కొనసాగుతున్న విద్యుత్తు భద్రతా వారోత్సవాలు
కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే

ప్రచార కరపత్రం

విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఏటా మే 1-7 వరకు విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రచారం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలోని గృహ, వ్యవసాయ, ఇతరాలు మొత్తం 8,29,408 కనెక్షన్లు ఉన్నాయి. చాలా చోట చేతికందే ఎత్తులో తీగలు, రక్షణలేని నియంత్రికలతో ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు, ఉమ్మడి జిల్లాలోని 13 బల్దియాల్లోనూ పలు చోట్ల వంగిన స్తంభాలు, నియంత్రికల చుట్టు పిచ్చిమొక్కలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో 50-100 పశువులు, పలువురు వ్యక్తులు మృత్యువాత పడుతున్నారు. వ్యక్తి చనిపోతే రూ.5 లక్షలు, పశువులకు రూ.35 వేల వరకు సాయం అందిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో ఇలా..

  • కాగజ్‌నగర్‌ పురపాలికలోని విద్యుత్తు విభాగంలో విధులు నిర్వహించే వారికి పాతకాలం నాటి కర్రల నిచ్చెనలతో విద్యుత్తు స్తంభాలు ఎక్కి దీపాల మరమ్మతులు చేస్తున్నారు. తరచూ ఆ నిచ్చెన నుంచి ప్రమాదవశాత్తు కిందపడి, తీవ్రగాయాలైన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆధునిక యంత్రాలు(నిచ్చెనలు) అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగిస్తే.. ఉపయోగకరంగా ఉంటాయి.
  • వ్యవసాయ, గృహాలలో నాణ్యమైన విద్యుత్తు పరికరాలు వాడాలి. పట్టణ, గ్రామాల్లో పలువురు డిస్కం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్తంభాలు ఎక్కడం, మరమ్మతులు చేయడం వంటివి చేస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు.
  • పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయక్షేత్రాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రికల చుట్టు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ చెడిపోయాయి మరమ్మతులు, తిరిగి నూతనంగా ఏర్పాటు చేయడం లేదు. ఇటీవల నియంత్రికలు, విద్యుత్తు స్తంభాల తీగల చుట్టు పిచ్చిమొక్కలు పెరగడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
  • మారుమూల మండలాల్లోని రైతులు తమ పంట పొలాల్లోని నియంత్రికలను తామే స్వయంగా మరమ్మతులు చేసేందుకు యత్నిస్తుంటారు. అలాంటి చర్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్తు అధికారుల సూచనలు, సలహాలను పాటించాల్సిందే.
  • ఐఎస్‌ఐ, ప్రముఖ కంపెనీల విద్యుత్తు తీగలు, పంపులు, ఇతర పరికరాలను వినియోగించాలి.
  • హెచ్‌.టి.ఫ్యూజ్‌, ఎల్‌టీ ఫ్యూజ్‌ మార్చడానికి డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను అనధికారికంగా ఎక్కరాదు.
  • సర్వీస్‌ వైర్లు, విద్యుత్తు వీధిదీపాలను సరి చేసేందుకు ఇతరులు విద్యుత్తు స్తంభాలను ఎక్కరాదు
  • ఇంటి వరండాలో కాంపౌండ్‌లో ఎలక్ట్రికల్‌ హౌజ్‌ వైరింగ్‌కు సమీపంలో జి.ఐ వైర్లను దండేలుగా కట్టి తడి దుస్తులు ఆరవేయడం ప్రమాదం.
  • గాలి పటాలు విద్యుత్తు తీగలకు చుట్టుకుంటే తీసే ప్రయత్నం చేయరాదు.
  • విద్యుత్తు లైన్ల కింద పందిళ్లు, జెండాలు కట్టరాదు.
  • ఐఎస్‌ఐ మార్కు మోనోబ్లాక్‌ పంపుసెట్లు, సబ్‌మెర్సిబుల్‌ పంపు సెట్లను మాత్రమే వినియోగించాలి.


అవగాహన సదస్సులు

- సి.నాగరాజు, డీఈ, డిస్కం కాగజ్‌నగర్‌ డివిజన్‌

విద్యుత్తు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వినియోగదారులకు ప్రమాదాల నివారణపై సదస్సులు నిర్వహిస్తున్నాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన చేపడుతున్నాం. సిబ్బంది, అధికారులు వినియోగదారులు, రైతులకు అందుబాటులో ఉండి, నాణ్యమైన విద్యుత్తు అందించడంతోపాటు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని